టెన్షన్.. టెన్షన్..


Sat,July 13, 2019 01:21 AM

మెదక్, నమస్తే తెలంగాణ / మెదక్ మున్సిపాలిటీ : మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల్లో గుబులు పుట్టుకున్నది. రిజర్వేషన్లు అనుకూలుస్తాయో లేదోనని వారిలో ఉత్కంఠ నెలకొన్నది. జిల్లాలోని మెదక్ మున్సిపల్‌తో పాటు నూతనంగా ఏర్పటైన తూఫ్రాన్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపాలిటీల్లో ఈ నెల 14వ తేదీన తుది ముసాయిదా ప్రకటించిన తరువాత వార్డుల రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. ముసాయిదా జాబితా ప్రకారం రిజర్వేషన్లను అంచనాలు వేసుకునే పనిలో ఆశావహులు మునిగి తేలుతున్నారు. రిజర్వేషన్లు అనుకూలించకపోతే ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలను నూతన చట్టంతోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెల 18, 19వ తేదీల్లో శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహించి మున్సిపల్ బిల్లును ఆమోదించి.. ఆగస్టు మొదటి వారంలో ఎన్నికలు నిర్వహంచేందుకు కార్యచరణ రూపిందించేందుకు సన్నాహాలు చేస్తున్నది. శాసనసభ, మండలిలో బిల్లును ఆమోదించాక కొత్త చట్టాన్ని అమలులోకి రానున్నది. సీఎం కేసీఆర్ ఆగస్టులో ఎన్నికలు నిర్వహిస్తామని గురువారం ప్రగతిభవన్‌లో మున్సిపల్ కమిషనర్లతో జరిగిన సమావేశంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మున్సిపల్ నూతన చట్టం బిల్లును తుది రూపం ఇవ్వడానికి న్యాయశాఖకు పంపినట్లు సమావేశంలో చెప్పడం జరిగింది.

నాలుగు మున్సిపాలిటీలు 75 వార్డులు...
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 75 వార్డులు ఉన్నాయి. ఇందులో మెదక్ మున్సిపాలిటీలో 32 వార్డులు, తూప్రాన్ మున్సిపాలిటీలో 16 వార్డులు, నర్సాపూర్‌లో 15వార్డులు, రామాయంపేటలో 12వార్డులు ఉన్నాయి. అయితే మెదక్ మున్సిపాలిటీలో గతంలో 27 వార్డులు ఉండగా, కొత్తగా గ్రామాలు విలీనం కావడంతో వార్డుల సంఖ్య 32కు పెరిగింది. ఇదిలావుండగా జిల్లాలో నూతనంగా ఏర్పడిన తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపాలిటీల్లో వార్డుల్లో రిజర్వేషన్లపై అంతటా ఆసక్తి నెలకొన్నది. అయితే ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 21 శాతమా.. లేదంటే అంతకుమించి ఇస్తారా అనేది ప్రభుత్వ నిర్ణయం మేరకు ఉంటుంది. దానికి అనుగుణంగా వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ ఇంకా జరుగుతున్నది. ఇదిలావుంటే మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించనుండటంతో సుమారు 37 మించి మహిళా కౌన్సిలర్లు జిల్లాలో ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉన్నది.

రిజర్వేషన్లపై టెన్షన్..
కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకునే నేతలు, ఆశావహులకు రిజర్వేషన్లు ఎలా వస్తాయో అని వారిలో ఉత్కంఠ నెలకొన్నది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో రిజర్వేషన్ల చర్చ కొనసాగుతున్నది. ఇప్పటికే వార్డుల విభజన, కులాలు, వర్గాల వారీగా ఓటర్లు గణన వంటి అంశాలు పూర్తి చేసిన అధికారులు ఓటరు ముసాయిదాను ప్రకటించారు. శుక్రవారం ఓటర్ల అభ్యంతరాలను స్వీకరించారు. శనివారం అభ్యంతరాలను పరిష్కరించి 14న ఓటర్ల తుది జాబితా ప్రదర్శించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తిగానే 15వ తేదీన వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు ఏ విధంగా ఉండబోతున్నాయో దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

అవకాశం రాకుంటే..
రిజర్వేషన్లు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఖరారు కానున్నాయి. రిజర్వేషన్లు అనుకూలంగా రాకుంటే ఎలా అడుగు వేయాలనే దానిపై ఆయా రాజకీయ పార్టీల నేతలు తర్జనభర్జన పడుతున్నారు. అనుకూలంగా రాకపోతే ప్రత్యామ్నాయంగా వేరే వార్డులకు వెళ్లాలా లేదా, లేదా మహిళా రిజర్వేషన్ వస్తే తమ సతిమణులను బరిలో దింపడానికి రంగం సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

ఎక్కడ చూసినా అదే చర్చ..
ఎక్కడ చూసినా మున్సిపల్ రిజర్వేషన్లపై చర్చ కొనసాగుతున్నది. నలుగురు కలిసిన చోట రిజర్వేషన్లు ఎలా వస్తాయి. మీ వార్డు రిజర్వేషన్ అయ్యే అవకాశం ఉంది, ఎవరెవరు పోటీలో ఉంటారనే అనే విషయాలనే మాట్లాడుకుంటున్నారు. మొత్తం మీద మున్సిపల్ రాజకీయం వేడెక్కింది. రిజర్వేషన్లు, ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది, పోటీకి దిగుడే అన్నట్లుగా ఆశావహులు రంగం సిద్ధ్దం చేసుకుంటున్నారు.

టీఆర్‌ఎస్‌లో టికెట్ల కోసం పోటాపోటీ..
గత శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలతో పాటు సర్పంచ్, పరిషత్ ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయ దుందుబి మోగించడంతో మున్సిపల్ ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్ విజయ దుందుబి మోగించడం ఖాయమని టీఆర్‌ఎస్ టికెట్ల కోసం ఆశావహులు ముమ్మరంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌లో ఒక్కో వార్డు నుంచి ముగ్గురు, నలుగురు చొప్పున ఆశావహులు ఉండటం గమనర్హం. టీఆర్‌ఎస్ టికెట్ వచ్చినట్లయితే గెలిచినట్లేననే అభిప్రాయంతో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. శాసనసభ ఎన్నికల నుంచి మొన్నటి పరిషత్ ఎన్నికల వరకు ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదిచండంతో మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పునరావృతమవుతుందని విశ్వసిస్తున్నారు. ముఖ్యంగా చైర్మన్‌ను ఎన్నిక పరోక్షంగా జరిగే అవకాశం ఉన్నందున కౌన్సిలర్ల టికెట్లకు పెద్ద ఎత్తున పోటీ పెరుగనున్నది.

రేషన్ డీలర్లు పోటీకి అర్హులే... అంగన్‌వాడీ టీచర్లు అనర్హులు...
మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి రేషన్ డీలర్లు అర్హులు. అంగన్‌వాడీ టీచర్లు మాత్రం అనర్హులు. కొత్తగా రంగంలోకి దిగుతున్న వారికి ప్రధానంగా తాము నివసిస్తున్న ఇంటికి సంబంధించి ఆస్తి, నల్లా పన్ను బకాయిలు ఉండకూడదు. ఒకవేళ సొంత ఇల్లు లేకపోతే యజమానిచే కూడా బకాయిలు కట్టించాల్సిందే. లేనట్లయితే పోటీకి అనర్హులయ్యే అవకాశం ఉంది. ఇక బ్యాంకు రుణం తీసుకుని ఉన్న పక్షంలో దానిపై మొండి బకాయిలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంట్రాక్టర్‌గా ఉన్న పక్షంలో ఆ లైసెన్స్‌ను రద్దు చేసుకోవాలి.

శిక్షణలో ఎన్నికల అధికారులు..
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు 19 మంది జోనల్ అధికారులను నియమించనున్నారు. ఎన్నికల అధికారులు 29 మంది, అసిస్టెంట్ ఎన్నికల అధికారులు 29 మంది, పోలింగ్ స్టేషన్లు 150, ప్రిసైడింగ్ ఆపీసర్లు 150, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు 150 మంది, ఇతర పోలింగ్ అధికారులు 300 మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహించనున్నారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్‌లో ఈవోలు, అసిస్టెంట్ ఈవోలకు ఎన్నికలపై జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. 17వ తేదీన పీవోలకు, ఏపీవోలకు మెద క్, రామాయంపేటలలో శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని జిల్లా అసిస్టెంట్ ఎన్నికల అధికారి సమ్మయ్య తెలిపారు. అలాగే 18న తూప్రాన్, నర్సాపూర్ పీవోలకు, ఏపీవోలకు తూప్రాన్‌లోని లింగారెడ్డి ఫంక్షన్ హాల్‌లో శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. ఇదిలావుండగా మెదక్ మున్సిపల్ ఎన్నికలకు 71 బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

242
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles