మున్సి పోల్స్ కు ముమ్మర ఏర్పాట్లు


Fri,July 12, 2019 01:49 AM

మెదక్ మున్సిపాలిటీ : మున్సిపల్ ఎన్నికలకు వడివడిగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని జిల్లా అసిస్టెంట్ ఎన్నికల అథారిటీ, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. గురువారం మెదక్ మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయా రాజకీయ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ మెదక్ మున్సిపాలిటీలో ఇప్పటి వరకు వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితాను ప్రచురించడం జరిగిందన్నారు. అంతేకాకుండా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లోని నోటీసు బోర్డుపై ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ నెల 13న అభ్యంతరాలు స్వీకరించి పరిశీలించడం జరుగుతుందని, 14న తుది జాబితాను వార్డుల వారీగా ప్రచురించడం జరుగుతుందన్నారు. ఇదిలావుండగా ఈ నెల 14న పోలింగ్ స్టేషన్లకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని, 15, 16, 17 తేదీల్లో అభ్యంతరాలను స్వీకరించి 18న ఫైనల్ లిస్ట్‌ను తయారు చేసి కలెక్టర్ ద్వారా ఎన్నికల ఆఫీసర్‌కు పంపడం జరుగుతుందన్నారు. 19వ తేదీన పోలింగ్ స్టేషన్లను ప్రచురించడం జరుగుతుందన్నారు. మెదక్ మున్సిపాలిటీలో పోటీ చేయు కౌన్సిలర్ అభ్యర్థులు పట్టణంలో ఓటరై ఉండాలని, ఒక వార్డులో పోటీ చేసే కౌన్సిలర్ అభ్యర్థికి అదే వార్డులో ఉన్న వ్యక్తి ప్రతిపాదించాలని తెలిపారు. అంతేకానీ ఒక వార్డులో పోటీ చేసే అభ్యర్థి మరో వార్డులో ఉన్న వ్యక్తిచే ప్రతిపాదిస్తే అది తిరస్కరించడం జరుగుతుందన్నారు.

64 పోలింగ్ కేంద్రాలు.. 11 మంది అధికారులు
మెదక్ మున్సిపాలిటీలో 32 వార్డులకు గాను ఒక్కో వార్డుకు 2 పోలింగ్ స్టేషన్ల చొప్పున మొత్తం 64 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇందుకుగాను 11 మంది ఎన్నికల అధికారులను నియమించడం జరుగుతుందని, వారికి అసిస్టెంట్ ఎన్నికల అధికారులు కూడా ఉంటారని తెలిపారు. అయితే నామినేషన్ నుంచి కౌంటింగ్ అయ్యేంత వరకు ఎన్నికల అధికారులే చూస్తారన్నారు. ఇదిలావుండగా మున్సిపల్ ఎన్నికల్లో 5 వార్డులకు ఒక జోనల్ ఆఫీసర్లను నియమించడం జరుగుతుందని వీరికి జ్యుడీషియల్ పవర్ కూడా ఉంటుందని తెలిపారు. 2014లో మున్సిపల్ ఎన్నికలను ఈవీఎం ద్వారా జరిగాయని, ఇప్పుడు బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించడం జరుగుతాయని చెప్పారు. ఒక్కో వార్డులో 900 నుంచి 1200 ఓటర్లు ఉన్నాయని తెలిపారు.

ఉ.7 నుంచి సా. 5 గంటల వరకు పోలింగ్
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. మున్సిపాలిటీలో పోటీ చేసే కౌన్సిలర్ అభ్యర్ధులు రూ.లక్ష వరకు ఎన్నికల ఖర్చు చేయవచ్చని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.1250 నామినేషన్ ఫీజు కాగా, ఇతరులకు రూ.2500 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే నామినేషన్లను అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చన్నారు. మున్సిపల్‌లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలోనే ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. అయితే కౌన్సిలర్ల రిజర్వేషన్లను కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
రాజకీయ పార్టీల నేతలతో సమావేశం..
మెదక్ మున్సిపల్ కార్యాలయంలో రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలు మాట్లాడుతూ ఆయా వార్డుల్లో ఉన్న ఓటరు జాబితాలో కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని కమిషనర్ సమ్మయ్యకు సూచించారు. ఓటరు జాబితాను పారదర్శకంగా చేయాలని అన్నారు. ఒకే ఓటు రెండు చోట్ల ఉంటే ఎలా అని మాజీ కౌన్సిలర్ మధుసూదన్‌రావు అడగగా, కమిషనర్ స్పందిస్తూ ఒకే చోట ఓటు వేసేలా చూస్తామని తెలిపారు. అనంతరం ఆయా పార్టీలకు చెందిన నాయకులకు ఓటరుజాబితాతో పాటు వార్డులకు సంబంధించిన లిస్ట్‌లను అందజేశారు. ఈ సమావేశంలో టీపీవో విజయశ్రీ, అర్షద్, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు గంగాధర్, గోదల కృష్ణ, కాంగ్రెస్ నాయకులు మదుసూదన్‌రావు, అరవింద్‌గౌడ్, సీపీఐ నాయకులు రాజిరెడ్డి, సీపీఎం నాయకులు మల్లేశం, ఎంఐఎం నాయకులు సయ్యద్ ఇష్రాత్‌అలీ, ఫయీం తదితరులు పాల్గొన్నారు.

15, 16 తేదీల్లో రిజర్వేషన్లు ఖరారు
జిల్లాలోని మున్సిపాలిటీల్లోని ఓటరు ముసాయిదా జాబితాను అధికారులు గురువారం విడుదల చేశారు. ఈ జాబితాపై 11, 12వ తేదీల్లో అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఈ నెల 14న తుది జాబితా విడుదల చేయనున్నారు. జిల్లాలోని మెదక్, తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపాలిటీలు ఉన్నాయి. మెదక్ మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య సమావేశం ఏర్పాటు చేయగా, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, టీడీపీ నేతలు సమావేశంలో పాల్గొన్నారు. తూప్రాన్ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు పాల్గొనగా, నర్సాపూర్ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. రామాయంపేట మున్సిపాలిటీలో ప్రత్యేకాధికారి, మెదక్ ఆర్డీవో సాయిరాం సమావేశం నిర్వహించగా, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల నాయకులు పాల్గొన్నారు. ఓటరు జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే శుక్రవారం వరకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. రాజకీయ పార్టీ నేతలకు ఓటరు జాబితాతో పాటు వార్డులకు సంబంధించిన ఓటరు లిస్ట్‌లను ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు అందజేశారు. అయితే మెదక్ మున్సిపాలిటీలో గతంలో ఉన్న 27 వార్డులతో పాటు నూతనంగా 5 వార్డులు ఏర్పడ్డాయి. దీంతో మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య 32కు చేరింది. మెదక్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 33,465 ఓటర్లు ఉన్నారు. తూప్రాన్ మున్సిపాలిటీలో 17,173 మంది ఓటర్లు ఉండగా, నర్సాపూర్ మున్సిపాలిటీలో 13,493 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే రామాయంపేట మున్సిపాలిటీలో 11,596 మంది ఓటర్లు ఉన్నారు. ఇదిలావుండగా నాలుగు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వార్డుల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా, ఎక్కువగా ఉండడంతో ఆయా రాజకీయ పార్టీల నేతలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు.

141
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...