గోపాలమిత్రలకు అండగా ఉంటాం...


Wed,June 26, 2019 01:02 AM

-పాడి పరిశ్రమ అభివృద్ధికి సర్కారు అధిక ప్రాధాన్యం
-రైతుబీమా తరహాలోపశువులకు బీమా యోచన
-15 రోజుల్లో రెండో విడుత గొర్రెల పంపిణీ
-మొదటి విడుత పంపిణీ విజయవంతం
-గొర్రెల పంపిణీతో గొల్లకురుమ కుటుంబాలు ఖుషీ
-మూగజీవాలకు సేవ చేయడంగోపాల మిత్రల అదృష్టం
-శిక్షణ కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని
-హాజరైన 10 ఉమ్మడి జిల్లాల గోపాలమిత్రలు
మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :తెలంగాణ రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షమమే ధ్యేయంగా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య మరియు సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వైస్రాయ్ గార్డెన్‌లో రాష్ట్రస్థాయి గోపాలమిత్రల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి మాట్లాడుతూ నోరులేని మూగజీవాలకు సేవచేసే అవకాశం వచ్చిన గోపాల మిత్రలు నిజంగా అదృష్టవంతులన్నారు. నోరు లేని మూగ జీవాలకు సేవచేస్తే దేవుడికి సేవ చేసినట్లేనన్నారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని సీఎం కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా కుల వృత్తులకు పునరుజ్జీవం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.

రైతులకు పంట పెట్టుబడి సాయం, రైతుబీమా కార్యక్రమాలు రాష్ర్టాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపాయన్నారు. 24 గంటల విద్యుత్‌తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణాలో 45లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. రైతుబీమా తరహాలో పశువులకు బీమాసౌకర్యం కల్పిస్తునట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెటర్నరీ దవాఖానలల్లో 563 దవాఖానలను అప్‌గ్రేడ్ చేశామని రెండోవిడుతలో 540 దవాఖానలను అప్‌గ్రేడ్ చేయనున్నామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు లక్షలు, కోట్ల మంది రైతు కుటుంబాల జీవితాలు ఆదారపడి ఉన్న వ్యవసాయ అనుబంధరంగం పాడిపరిశ్రమ అభివృద్ధ్దికి వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామన్నారు. దవాఖానలను ఆప్‌గ్రేడ్ చేయడంతో పాటు శిథిలావస్థలో ఉన్న వాటికి మరమ్మతులకు నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం విజయవంతమైందన్నారు. అలాగే 15 రోజుల్లో మిగతా కుటుంబాలకు రెండోవిడుత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబీమా కార్యక్రమం తరహాలో ప్రతి పశువులకు బీమా చేయాలనే ఆలోచనతో ఉన్నామన్నారు. త్వరలోనే ఈ కార్యక్రమానికి సైతం శ్రీకారం చుడతామని తెలిపారు. గోపాలమిత్రలు రైతుల వద్ద అదనంగా డబ్బులను వసూలు చేయకూడదన్నారు. రైతు వద్ద నుంచి రూ.130 కంటే అదనంగా వసూలు చేసినట్లు తమ దృష్టికి వస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గౌరవవేతనం పెంపుతో మరింత భాధ్యత పెరిగింది
: ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
ఈ సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. 24 గంటల విద్యుత్‌తో పాటు రైతులకు పంట పెట్టుబడి సాయంతో పాటు రైతుబీమా కల్పించడం దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. 2000 సంవత్సరం నుంచి గోపాల మిత్రలు గ్రామస్థాయిలో పాడి రైతులకు సేవలందిస్తున్నారన్నారు. ఈ సేవలను సీఎం కేసీఆర్ గుర్తించి వారి గౌరవ వేతనం రూ.3500 నుంచి రూ.8500 పెంచిందన్నారు. సూపర్‌వైజర్ల గౌరవ వేతనం రూ.10000 నుంచి రూ.15000లకు పెంచడం జరిగిందన్నారు. గౌరవ వేతనం పెంపుతో గోపాల మిత్రులకు బాధ్యత పెరిగిందన్నారు. ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసి వారి సంక్షేమానకి సైతం పెద్దపీట వేస్తుందన్నారు. జిల్లా కేంద్రంలో చేపల మార్కెట్‌తో పాటు, నియోజకవర్గంలో శిథిలావస్థలో ఉన్న వెటర్నరీ దవాఖానలకు నిధులను కేటాయించాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్‌ను కోరారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కోరిక మేరకు మంత్రి వెంటనే స్పందించి మెదక్‌కు ఫిష్ మార్కెట్‌ను మంజూరు చేశారు. నిధులు కూడా ఉన్నాయని స్థలం కేటాయించి పనులు నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ కోరారు.

రాష్ట్ర వ్యాప్తంగా రూ.5వేల కోట్లతో
రైతులకు పాడిపశువులు..
-పశుసంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా
పశుసంవర్థ్ధక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రూ.5వేల కోట్లతో పాడి రైతులకు సబ్సిడీపై పాడి గేదేలను అందించామన్నారు. అదేవిధంగా రూ.1000 కోట్లతో గొర్రెల అభివృద్ధి పథకం, రూ.1000 కోట్లతో చేపల అభివృద్ధి రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించి గొర్రెలు, ఆవులు, గేదెలు, చేపల పెంపకానికి దవాఖానలకు నిధులను ప్రభుత్వం కేటాయిస్తునట్లు ఆయన తెలిపారు. ప్రపంచ దేశాలకు భిన్నంగా 170 మిలియన్ టన్నుల పాలను ఉత్పత్తి చేస్తూ భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం 4.9 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తిని చేస్తూ 13వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందని అన్నారు. గిర్ జాతి రకం బ్రెజిల్ దేశంలో రోజుకు 60 లీటర్ల పాలను ఇస్తున్నాయని, కానీ మన దేశంలో 5 నుంచి 10 లీటర్ల పాలను మాత్రమే ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఉన్న అవకాశాలను సమృద్ధిగా వినియోగించుకుని ఏ రాష్ట్రంలో పాడిరైతులు ఘననీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పాల ఉత్పత్తిని పెంచడంలో గోపాలమిత్రల సహకారం ముఖ్యమన్నారు. అందుకోసమే యూనివర్సీటీ అధ్యాపకులచే తయారు చేసిన కరదీపికను అందజేసి గోపాలమిత్రులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. శిక్షణ ఇస్తే క్వాలిటీ పెరుగుతుందని ఇది రైతులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

పాడి పరిశ్రమతో రైతుల అభివృద్ధి..
: రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌రావు
పశు సంపదతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు. ముఖ్యంగా మహిళా రైతులు పాడి పరిశ్రమతో ఎంతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని పాడిపరిశ్రమతో రైతులు అభివృద్ధి బాటలో పయనిస్తున్నారన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు.
అంతకుముందు పశుగణాభివృద్ధ్ది సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాళ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫాడర్ పార్క్, ఫొటో ఎగ్జిబిషన్, పరికరాల ప్రదర్శన, ఈ-మొబైల్ బైక్‌లను ప్రారంభించారు. కార్యక్రమ అనంతరం గోపాలమిత్రుల శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన మ్యానువల్, ట్రైయినింగ్ షెడ్యూల్, వాయిస్ మెస్సేజ్ సిస్టమ్‌ను ప్రారంభించడం జరిగింది.

గోపాల మిత్రులకు చెక్కులు పంపిణీ..
రాష్ట్ర ప్రభుత్వం గోపాల మిత్రులకు పెంచిన గౌరవవేతనం సంబంధించి మొదటి వేతనాన్ని చెక్కుల రూపంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నగేశ్, మెదక్ ఉమ్మడి జిల్లా పశుగణాభివృద్ధి చైర్మన్ గణప లకా్ష్మరెడ్డి, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, సీఈవో మంజువాణి, పశుగణాభివృద్ధి సంస్థ అదనపు డైరెక్టర్ డా.రాంచందర్, పశుగణాభివృద్ధి సంస్థ కార్యనిర్వహణ అధికారి డా.కిరణ్‌తో పాటు అన్ని జిల్లాల పశుగణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ ఆర్ నర్సింహారెడ్డి, శ్రీశైలం, సూర్‌రెడ్డి, ఆయా జిల్లాలో చైర్మన్లు నాగేశ్వర్‌రావు. పిచ్చిరెడ్డి. చిన్న కిషన్‌రెడ్డి, గోవర్దన్ యాదవ్, పి.నారాయన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల గోపాల మిత్రలు 1349 మంది, 65 మంది సూపరవైజర్లు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...