రైతు ఖాతాల్లో నగదు


Sun,June 23, 2019 07:01 AM

-ఎకరాకు రూ.5వేల చొప్పున
-జిల్లాకు రూ.185 కోట్లు
-2,04,500 మంది రైతులకు లబ్ధి
మెదక్ మున్సిపాలిటీ : వ్యవసాయ రంగాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం నుంచి మూడో సారి రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. గడిచిన ఏడాది వానకాలం సీజన్‌కు సంబంధించి రైతులకు నేరుగా చెక్కులు అందజేశారు. డిసెంబర్‌లో ఎమ్మెల్యే ఎన్నికలు రావడంతో యాసంగి సీజన్‌కు సంబంధించి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే పెట్టుబడి సాయాన్ని జమ చేశారు. ప్రస్తుత వానకాలం సీజన్‌కు సంబంధించి మూడోసారి అందిస్తుండగా సాయాన్ని పెంచడం విశేషం. గతంలో ఎకరాకు రూ.4వేలు అందించగా ఈసారి రూ.5వేల చొప్పున ఖాతాల్లో జమచేస్తున్నారు.

2,04,500 మందికి లబ్ధి....
ఈసారి వానకాలం సీజన్‌కు సంబంధించి జిల్లాలో రైతు బంధు పథకం నుంచి 2,04,500 మంది రైతులకు లబ్ధి చేకూరనున్నది. మొత్తం 2లక్షల ఎకరాల సాగుకు భూమికి పెట్టుబడి సాయాన్ని అందించనున్నారు. జిల్లాలో ఈసారి వానకాలం సీజన్‌కు సంబంధించి 2 లక్షల ఎకరాల్లో 80వేల ఎకరాలు వరి, 30వేల ఎకరాల్లో పత్తి, 40వేల ఎకరాల్లో మొక్కజొన్న, ఇతర పంటలు సాగవుతుందని వ్యవసాయ అధికారులు తెలిపారు.

జిల్లాకు రూ.185 కోట్లు...
ఈసారి వానకాలం సీజన్‌లో జిల్లాలోని 2,04,500 మంది రైతులకు పెట్టుబడి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.185 కోట్లు కేటాయించింది. దీంతో పట్టా పాసు బుక్కు కలిగిన రైతులకు రైతు బంధు పథకం లబ్ధి చేకూరనున్నది. జూన్ 10లోపు నూతనంగా పట్టా పాసు పుస్తకాలు అందుకున్న రైతులకు సైతం రైతు బంధు అందజేస్తామని వ్యవసాయ అధికారులు ఇప్పటికే ప్రకటించారు.

పెట్టుబడి సాయం పెంపు..
2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం రూ.2వేలు పెంచనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో రెండు పంటలకు కలిపి రూ.8వేలు ఉన్న సహాయాన్ని ఈ ఏడాది వానకాలం, యాసంగి పంటలకు సంబంధించి రైతులకు ఎకరాకు రూ.10వేల చొప్పున చెల్లించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో రైతన్నల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న పెట్టుబడి సాయంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకుంటున్నారు. గతంలో బ్యాంక్ అధికారులు రుణాల కోసం సవాలక్ష నిబంధనలు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేసేవారు. ప్రభుత్వం రైతు బంధు పథకం కింద అందిస్తున్న పెట్టుబడి సాయంతో రైతులకు ఇబ్బందులు తప్పాయి.

151
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...