భళా.. కాళేశ్వరం


Fri,June 21, 2019 01:04 AM

-జిల్లాలో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
-ఫలాన్నివ్వనున్న అపర భగీరథుడు సీఎం కేసీఆర్ ప్రయత్నం
-గోదావరి జలాలతో పచ్చగా మారనున్న ఉమ్మడి జిల్లా పొలాలు
-మరి కొద్ది నెలల్లో ముద్దాడనున్న గోదారమ్మ జలాలు
-లక్షలాది ఎకరాలకు అందనున్న సాగునీళ్లు
సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్, ఎమ్మె ల్యే హరీశ్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ఎత్తిపోతల కింద నిర్మిస్తున్న రిజర్వాయర్ల నిర్మాణాలు వాయువేగంగా జరుగుతున్నాయి. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు సుమారుగా 8.50 లక్షల ఎకరాలకు పైగా సాగునీరందించే ఈ ప్రాజెక్టులతో ఉమ్మడి మెదక్ జిల్లాకు పూర్వవైభవం రానున్నది. సమైక్య రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు నిర్మాణం సైతం నోచుకోని ఉమ్మడి మెదక్ జిల్లాకు స్వరాష్ట్రంలో మహర్దశ వచ్చింది. జిల్లాను సస్యశ్యామలం చేసే గోదావరి జలాలు మిడ్‌మానేరు నుంచి వస్తాయి. మేడిగడ్డ నుంచి తరలించిన గోదావరి జలాలతో పలు ప్రాజెక్టులకు జీవం కల్పించేలా డిజై న్ రూపొందించారు. ఫలితంగా ఉమ్మడి మెదక్(సిద్దిపేట, సం గారెడ్డి, మెదక్) జిల్లా సస్యశ్యామలం కానున్నది. ఎల్లంపల్లి నుంచి 231.50 ఫుల్ రిజర్వాయర్ లెవల్(ఎఫ్‌ఆర్‌ఎల్)లో ఉన్న మేడారం చెరువుకు నీటిని తరలిస్తారు. అక్కడి నుంచి కాకతీయ కాల్వ మీదుగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాల్వలోకి నీటిని పంపిస్తారు. 318 ఎఫ్‌ఆర్‌ఎల్‌లో ఉన్న మిడ్ మా నేరులోకి నీటిని తరలించి అక్కడి నుంచి అనంతగిరి రిజర్వాయర్‌కు నీటిని పంపిస్తారు. రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లోకి నీటిని పంపించడంతో కుడి, ఎడమ కాల్వల ద్వారా 1.10 లక్షల ఎకరాలకు ఆయకట్టు సాగునీరు అందుతుంది. మల్లన్నసాగర్ 536 ఎఫ్‌ఆర్‌ఎల్‌లో ఉండే కీలకమైన రిజర్వాయర్‌లోకి నీటిని తరలిస్తారు. దీని కింద 1.25 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తారు. అక్కడి నుంచి 624 ఎఫ్‌ఆర్‌ఎల్‌లో ఉండే కొండపోచమ్మ రిజర్వాయర్‌కు నీటిని పంపుతారు. మరో వైపు ప్యాకేజీ-17 ద్వారా నిర్మించే కాల్వ నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు గోదావరి జలాలు తరలిస్తారు. ప్యాకే జీ-18 కింద నిర్మించే కాల్వ ద్వారా నీటిని హల్దివాగుకు పంపిస్తారు. ప్యాకేజీ - 19 ద్వారా చేబర్తి గ్రామం వరకు గోదావరి జలాలు తరలించడంతో హల్దివాగు నుంచి నిజాంసాగర్‌కు జీ వం పోస్తారు. కాల్వల ద్వారా చెరువులను నింపడానికి ము మ్మరంగా కాల్వల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే గోదావరి జలాలతో చెరువులను నింపడానికి ప్రణాళికలు రూపొందించారు. ఆదిశగా ఏర్పాటు జరుగుతున్నాయి.

అనంతగిరి రిజర్వాయర్(3.50 టీఎంసీలు)
కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-10లో భాగంగా మిడ్‌మానేరు నుంచి 88.24 టీఎంసీల నీటిని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లీపూర్, ఎల్లాయిపల్లి, కొచ్చగుట్టపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న అనంతగిరి(3.50 టీఎంసీల సామర్థ్యం) రి జర్వాయర్‌కు తరలిస్తారు. 10వ ప్యాకేజీలో సర్జిపూల్ పంపు పనులు పూర్తి కావచ్చాయి. రిజర్వాయర్ నిర్మాణంలో భాగం గా సుమారు 2కిలో మీటర్ల బండ్ నిర్మాణ పనులు పూర్తి చే శారు. అప్రోచ్ చానల్, గ్రావిట్ కెనాల్ 2.380, మెయిన్ కెనా ల్ 7.65 కిలో మీటర్ల పనులు దాదాపు పూర్తయ్యాయి. సొరంగంలో కాంక్రీట్ పనులు పూర్తి కావొస్తున్నాయి. తిప్పారం వద్ద 400/11కేవీ సబ్‌స్టేషన్ పూర్తి చేశారు. ఈ రిజర్వాయర్ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాకు 30వేల ఎకరాల ఆయకట్టు, సిద్దిపేట జిల్లాకు 15,200 ఎకరాలకు సాగు నీరందిస్తారు.

రంగనాయకసాగర్(3 టీఎంసీలు )
ప్యాకేజీ-11లో అనంతగిరి నుంచి చంద్లాపూర్, పెద్దకోడూరు గ్రామాల మధ్య నిర్మిస్తున్న రంగనాయకసాగర్(3టీఎంసీలు) రిజర్వాయర్‌కు 88.25 టీఎంసీల నీటిని తరలిస్తారు. రిజర్వాయర్ బండ్ 8.6 కిలో మీటర్ల పొడవు ఉండగా, బండ్ పనులు పూర్తి చేశారు. రిజర్వాయర్ నుంచి కుడి, ఎడమ కాల్వ పనులు పూర్తి కావొచ్చాయి. ఈ రిజర్వాయర్ నుంచి లక్షా 10 వేల ఎకరాలకు సాగునీరందిస్తారు. కుడి, ఎడమ కాల్వల నిర్మాణ పనులు పూర్తి దశకు వచ్చాయి. సొరంగం, ఓపెన్ కెనాల్ పనులు, అప్రోచ్ చానల్ 1.75 కిలో మీటరు. గ్రావిటీ కెనాల్ 0.454 కిలో మీటర్లు, మెయిన్ టన్నెల్ 8.59 కిలోమీటర్ల పనులన్నీ పూర్తయ్యాయి. చంద్లాపూర్ వద్ద 400/11కేవీ సబ్‌స్టేషన్ పూర్తి చేశారు. 134 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు మోటార్లు బిగించారు. త్వరలోనే ట్రయల్ రన్ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

కొమురవెల్లి మల్లన్నసాగర్(50 టీఎంసీలు )
ప్యాకేజీ-12 కింద రంగనాయకసాగర్ నుంచి నీటిని కొ మురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్(50టీఎంసీలు)కు తరలిస్తారు. ఈ రిజర్వాయర్ నుంచి లక్షా 25 వేల ఎకరాలకు సా గునీరందిస్తారు. ఉమ్మడి మెదక్‌తో పాటు ఉమ్మడి నిజామాబాద్, నల్గొండ జిల్లాలకు ఇది గుండెకాయలాంటిది. అప్రోచ్ చానల్ 2.0 కిలో మీటర్లు, గ్రావిట్ కెనాల్ 2.2 కిలో మీటర్లు, మెయిన్ టన్నెల్ 16.8 కిలో మీటర్లు ఉంది. దాదాపుగా పనులు పూర్తి కావొచ్చాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ బండ్ పొడవు 22.9 కి.మీటర్లు ఉంటుంది. దీని ఎత్తు 63 మీటర్లు ఉంటుంది. బండ్ నిర్మాణంలో భాగంగా 4 రీచ్‌లుగా విభజించి పనులు చేపట్టారు. ప్రస్తుతం బండ్ నిర్మాణ పనులతో పాటు లింక్ కెనాల్ పనులు జోరుగా నడుస్తున్నాయి. రిజర్వాయర్ పూర్తయ్యే లోపు కాల్వల ద్వారా చెరువులు నింపేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. రిజర్వాయర్ పనులు పూర్తి కాకున్న ఈలోగా కెనాల్స్ ద్వారా కొండపోచమ్మ రిజర్వాయర్‌కు గోదావరి జలాలు తరలించనున్నారు.

కొండపోచమ్మ రిజర్వాయర్(15టీఎంసీలు)
మర్కూక్ మండలం పాములపర్తి వద్ద నిర్మిస్తున్న కొండపోచమ్మ రిజర్వాయర్ పనులను రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. ఈ రిజర్వాయర్ సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యదాద్రి భువనగిరి, మేడ్చల్ జిల్లాలోని సాగు,తాగునీటి అవసరాలు తీర్చనున్నది. మొత్తం 2,85,280 ఎకరాలకు సాగునీరు అందించనున్నది. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే లక్షా 50 వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నది. 15.8 కి.మీ వలయాకారంలో నిర్మిస్తున్న కట్ట నుంచి మూడు పాయింట్ల వద్ద కెనాల్స్‌కు నీటిని పంపింగ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు పంపుహౌస్‌లు నిర్మాణమవుతున్నాయి. ఒకటి అక్కారం, రెండోది మర్కూక్ వద్ద నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాలు చివరి దశకు వచ్చాయి. ఇటీవలే ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లాలోని 59 గ్రా మాల మీదుగా 127 కి.మీ. కాల్వ నిర్మాణానికి పరిపాలన అ నుమతులివ్వగా, భూసేకరణ చేపడుతూ కాల్వలు నిర్మిస్తున్నారు.

తోటపల్లి ఆన్‌లైన్ రిజర్వాయర్(0.32 టీఎంసీ)
బెజ్జంకి మండలం తోటపల్లిలో 0.32 టీఎంసీల సామర్థ్యం తో రిజర్వాయర్ నిర్మించారు. మిడ్ మానేరు ప్రాజెక్టు నుంచి ప్రధానమైన కుడి కాలువ ద్వారా సుమారుగా 35 కిలో మీటర్ల దూరంలోని తోటపల్లి ఆన్‌లైన్ రిజర్వాయర్‌కు నీళ్లు చేరుకుంటాయి. కొన్ని నెలల కిందట మిడ్ మానేరు నుంచి గోదావరి జలాలను విడుదల చేశారు. దీంతో అప్పుడు తోటపల్లి ఆన్‌లైన్ రిజర్వాయర్‌లో గోదావరి జలాలతో నిండుకుండలా మారింది. బెజ్జంకి మండలంలోని వడ్లూరు, బేగంపేట, దేవక్కపల్లి, తోటపల్లి గ్రామాలకు ప్రత్యక్షంగా 5 వేల ఎకరాలకు, పరోక్షంగా మరో 20 వేల ఎకరాలకు, హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లోని 19 గ్రామాలకు సాగునీరందుతున్నది. తోటపల్లి ఆన్‌లైన్ రిజర్వాయర్ ద్వారా గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్లను నింపుతారు.

గౌరవెల్లి రిజర్వాయర్(8.23 టీఎంసీలు)
హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలో చే పట్టిన గౌరవెల్లి రిజర్వాయర్(8.23 టీఎంసీల) పనులు శరవేగంగా సాగుతున్నాయి. సొరంగం, సర్జిపూల్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. నారాయణపూర్ వరకు ఓపెన్ కెనాల్ ద్వారా, అక్కడి నుంచి సుమారు 16 కిలోమీటర్ల దూరం సొ రంగం ద్వారా రేగొండ సర్జిపూల్‌కు నీరు చేరుతుంది. అక్కడి నుంచి గౌరవెల్లి రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి గండిపెల్లి రిజర్వాయర్‌కు పంపింగ్ చేస్తారు. గౌరవెల్లి రిజర్వాయర్ కుడి, ఎ డమ కాల్వల ద్వారా లక్షా ఆరు వేల ఎకరాలకు సాగు నీరందనున్నది. కుడి కాల్వ నుంచి 90 వేల ఎకరాలకు, ఎడమ కా ల్వ నుంచి 16 వేల ఎకరాలకు పారిస్తారు. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లోని గ్రామాలతో పాటు పక్కనే ఉన్న కరీంనగర్, వరంగల్ అర్బన్ జిల్లాలోని కొన్ని మండలాల్లోని గ్రామాలకు సాగు నీరు అందుతుంది. కాగా, గౌరవెల్లి రిజర్వాయర్ నుంచి గండిపెల్లి రిజర్వాయర్‌కు నీటిని పంపింగ్ చేస్తారు. దీని సామర్థ్యం ఒక టీఎంసీ. ఈ రిజర్వాయర్ ద్వారా 54వేల ఎకరాల ఆయకట్టుకు గోదావరి నీటిని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుడి కాల్వ అక్కన్నపేట నుంచి కట్కూరు మీదుగా వరంగల్ అర్బన్ జిల్లాలోని కన్నారం, వేలూరు వరకు వెళ్తుంది. ఎడమ కాల్వ ద్వారా రామవరం నుంచి నంగునూరు, మద్దూరు మండలాల్లోని కొన్ని గ్రామాలతో పాటు జనగామ జిల్లాకు కూడా సాగునీరు అందనున్నది.

201
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles