ఉపాధ్యాయులు విద్యార్థులకు గైడ్‌గా వ్యవహరించాలి


Fri,June 21, 2019 01:03 AM

మెదక్ కలెక్టరేట్ : ప్రతి ఉపాధ్యాయుడు సబ్జెక్టు పరంగానే కాకుండా తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు, వాటి అనుభవాలను సైతం విద్యార్థులకు నేర్పేలా కృషి చేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి జిల్లాలోని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. గురువారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలోని ఉన్నత పాఠశాలలు, తెలంగాణ మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌లు, కస్తూర్బా గాంధీ పాఠశాలల ప్రత్యేక అధికారులతో సమావేశాన్ని కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు నిరంతరం నూతన విషయాలను నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సమాజంలో జరుగుతున్న పరిస్థితులను ఎప్పటికి అప్పుడు అధ్యాయనం చేస్తూ వాటిని విద్యార్థులకు బోధించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పదోతరగతి, ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయితే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో మనోధైర్యం నింపడంతోనే ఇలాంటి సంఘటలను నివారించే అవకాశం ఉంటుందన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో సైతం పదోతరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులు సైతం ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారని గుర్తుచేశారు. విద్యార్థులు ఈ స్థాయిలో మార్కులు తెచ్చుకోవడంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కృషి ఎనలేనిదన్నారు. ప్రతి విద్యార్థికి ఉన్న సామర్థ్యాలను వెలికి తీయడంలో ఉపాధ్యాయులు ముందుండాలన్నారు. ప్రతి విద్యార్థికి హరితహారం కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించాలన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ఉపాధ్యాయులు, విద్యార్థుల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రతి గ్రామ పంచాయితీకి లక్ష మొక్కల నర్సరీలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రజల అభిరుచి తగ్గ మొక్కలను సిద్ధం చేయడం జరిగిందన్నారు. తమ పాఠశాలలో నాటే మొక్కలను ప్రతి విద్యార్థికి దత్తతగా ప్రకటించి వాటి సంరక్షణ బాధ్యత అప్పగించేలా కార్యక్రమాలను రూపొందించాలన్నారు. అంతే కాకుండా ప్రతి ఇంటికీ పంపిణీ చేసిన మొక్కలను సైతం నాటడంతో పాటు సంరక్షించేందుకు చర్యలు తీసుకునేలా విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కలెక్టర్ సూచించారు.

కస్తూర్బా పాఠశాలలో వేదగణిత బోధన..
కలెక్టర్ గారి ప్రత్యేక ప్రత్యేక నిధులతో జిల్లాలోని అన్ని కస్తూర్బా పాఠశాలలో వేదగణిత తరగతులు ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రారంభమవుతున్నాయి. వీటికి సంబంధించిన వేదగణిత పుస్తకాలను కలెక్టర్ ఆవిష్కరించారు. విద్యార్థులకు లెక్కలపై ఉన్న భయాన్ని పోగొట్టి ఇష్టం కలిగేలా ఈ వేదగణిత కార్యక్రమం ఉంటుందని మూడు సంవత్సరాల నుంచి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని కేజీవీబీలలో, జెడ్పీ పాఠశాలలో ఈ కార్యక్రమం కొనసాగుతూ విద్యార్థులకు లెక్కల పై ఎంతో ఆసక్తి పెంచి మంచి మార్కులు వచ్చే విధంగా తీర్చి దిద్దుతున్న సరోజిని లర్నింగ్ సంస్థలలో ఈ సంవత్సరం 2019-20 నుంచి మెదక్ జిల్లాలోని అన్ని కేజీవీబీలలో తరగతులు ప్రారంభం కానున్నాయి. సమావేశంలో జిల్లా విద్యాధికారి డా.రవికాంతరావు, నోడల్ అధికారి మధుమోహన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డితో పాటు మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయలు ఇతర అధికారులు పాల్గొన్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...