దేశానికే ఆదర్శంగా మల్కాపూర్ నిలువాలి


Fri,June 21, 2019 01:03 AM

తూప్రాన్, నమస్తే తెలంగాణ : ఆధునిక సాగులో ముందడుగు వేసి దేశానికే ఆదర్శంగా నిలువాలని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. తూప్రాన్ మండలం మల్కాపూర్‌లో నాబార్డు నిధులతో ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటుతో గ్రామంలోనే ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాలను కొనుగోలు చేయవచ్చన్నారు. ఈ సంఘం దేశానికే ఆదర్శంగా నిలువాలన్నారు. కలిసిమెలిసిగా, సంఘటితంగా ఉంటూ రైతులు సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. సంఘం ఏర్పాటుతో మార్కెట్ సదుపాయం మెరుగుపడుతుందన్నారు. రైతులు తమకు కావాల్సిన విత్తనాలను ఆచితూచి సంఘానికి సమకూర్చుకోవాలన్నారు. భవిష్యత్‌లో పంట నిల్వకు గోడౌన్ల ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా నిధులు మంజూరు చేయిస్తానన్నారు. ఆధునిక సాగులో అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. సేంద్రియ ఎరువులపై ఎక్కువ దృష్టి సారించి పంట సాగు చేయాలన్నారు. దీని వల్ల పంట దిగుబడి ఎక్కువగా రావడంతో పాటు భూసారం పెరుగుతుందన్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీని కలెక్టర్ సందర్శించి అసంతృప్తిని వ్యక్తం చేశారు. నర్సరీలో 23 రకాల మొక్కలను పెంచుతున్నట్లు ఈజీఎస్ అధికారులు తెలుపడంతో అటవీ ప్రాంతంలో నాటేందుకు పండ్ల మొక్కలను పెంచేందుకు ఎందుకు దృష్టి సారించడం లేదంటూ ఈజీఎస్ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరుశురాం, గడ ఎంపీడీవో జయదేవ్, ఏవో నుస్రత్, సర్పంచ్ మహాదేవి, ఎంపీటీసీ వెంకటమ్మ, ఉప సర్పంచ్ సుగుణశేఖర్, పాలకవర్గ సభ్యులు ఆంజనేయులుగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, రేణుకాస్వామి, శ్రీను, హారికగంగరాజు, పంచాయతీ కార్యదర్శి రాజేశ్, ఆయాశాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...