పోలీస్ వ్యవస్థ పటిష్టతకు సీఎం కేసీఆర్ కృషి


Thu,June 20, 2019 12:23 AM

నారాయణఖేడ్, నమస్తే తెలంగాణ: పోలీస్ వ్యవస్థను పటిష్టపర్చేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ కొనియాడారు. నారాయణఖేడ్‌లో రూ.కోటి నిధులతో నూతనంగా నిర్మించిన పోలీస్‌స్టేషన్ భవనాన్ని బుధవారం ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, డీఐజీ శివశంకర్‌రెడ్డి, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ సుదర్శన్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించిన సందర్భంగా హోంమంత్రి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడితే శాంతిభద్రతలు దెబ్బతింటాయని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్న మాటలను గుర్తు చేసిన మంత్రి కేసీఆర్ ప్రభుత్వం అందుకు భిన్నంగా చర్యలు తీసుకుంటుందని, ఇందుకు ఇటీవల ప్రశాంతంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికలే నిదర్శనమన్నారు. రూ.700 కోట్లతో పోలీస్ వాహనాలను కొనుగోలు చేయడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసుశాఖకు అన్ని సదుపాయాలు సమకూరుస్తుందన్నారు.

పోలీస్ కార్యకలాపాల్లో రాజకీయ జోక్యాన్ని అరికట్టి పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గతంలో సామాన్యులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చే పరిస్థితి లేదని టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని తెచ్చి ప్రజలు, పోలీసులకు మధ్య సత్సంబంధాలను పెంపొందించినట్లు చెప్పారు. పెద్దఎత్తున నిధులను వెచ్చించి హైదరాబాద్‌లో పోలీస్ కంట్రోల్‌రూంను ఏర్పాటు చేస్తున్నట్లు హోంమంత్రి వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసులను ఛేదించడంలో తెలంగాణ పోలీస్ దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో ఉందని, ఈ విషయంలో గతంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కితాబివ్వడం జరిగిందన్నారు. నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న డైనమిక్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గం మరింత అభివృద్ధ్ది సాధించాలని ఆకాంక్షించారు.

సమర్థవంతంగా పోలీసుల పనితీరు :ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
నారాయణఖేడ్‌లో శాంతిభద్రతలను పరిరక్షించడంలో స్థానిక పోలీస్ అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. గతంలో అనేక నేరాలకు నిలయంగా ఉన్న నియోజకవర్గంలో నేరాల సంఖ్య తగ్గడంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ చర్యలే కారణమన్నారు. నారాయణఖేడ్‌లో పూర్థిస్థాయిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేస్తానన్నారు. స్థానికంగా డీఎస్పీ కార్యాలయంతో పాటు నూతనంగా ఏర్పాటైన కల్హేర్, నాగల్‌గిద్ద పోలీస్‌స్టేషన్లకు సొంత భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే, మంత్రిని కోరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అవసరం మేరకు హోం మంత్రి తనవంతు సహకారం అందించాలని కోరారు.

పోలీసుశాఖకు సంగారెడ్డి జిల్లా ప్రత్యేకమైనది
ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి
పోలీసుశాఖకు సంగారెడ్డి జిల్లా ఎంతో ప్రత్యేకమైనదని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. అమీన్‌పూర్ నుంచి కంగ్టి వరకు విస్తరించి ఉన్న జిల్లా కర్ణాటక సరిహద్దున ఉండడం మూలంగా ఇక్కడ నేరాలను అరికట్టడం పోలీసులకు సవాల్ వంటిదేనన్నారు. ఇక్కడ నేరాలకు పాల్పడి కర్ణాటక రాష్ర్టానికి, కర్ణాటకలో నేరాలు చేసి జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాం తాల గుండా తమ జిల్లాలకు ప్రవేశించే ఆస్కారం ఉండడంతో వాటిని ఛేదించడం క్లిష్టమైన పని అయినప్పటికీ ఎప్పటికప్పుడు కేసులను ఛేదిస్తూ నేరాలను నియంత్రిస్తున్నట్లు తెలిపారు. నారాయణఖేడ్‌లో డీఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పోలీస్ కార్యకలాపాలు మరింత సులభతరమయ్యాయన్నారు. సీఎం కేసీఆర్ పోలీస్ వ్యవస్థపై దృష్టి సారించిన ఫలితంగానే పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయసమితి జిల్లా కోఆర్డినేటర్ వెంకట్రామ్‌రెడ్డి, జడ్పీటీసీ సంగీతాశెట్కార్, ఏఎంసీ చైర్మన్ సువర్ణశెట్కార్, ఎంపీటీసీ సయ్యద్ ముజమ్మిల్, నారాయణఖేడ్ డీఎస్పీ సత్యనారాయణరాజు, నారాయణఖేడ్, కంగ్టి సీఐలు వెంకటేశ్వర్‌రావు, తిరుపతియాదవ్ జిల్లాలోని ఆయా సబ్‌డివిజన్‌ల డీఎస్పీలు, సీఐలు, ఆయా మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అన్ని మతాలను ఆదరించే సీఎం కేసీఆర్..
- హోమంత్రి మహమూద్ అలీ
అన్ని మతాలను ఆదరించే మంచి మనసున్న నేత సీఎం కేసీఆర్ అని హోంమంత్రి మహమూద్ అలీ కొనియాడారు. బుధవారం నారాయణఖేడ్ శెట్కార్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన ఈద్-మిలాప్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ గంగాజమున తహజిబ్ కావాలనే సీఎం కేసీఆర్ సంకల్పం సాకారమవుతుందన్నారు. అన్నిమతాల పండుగలు అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రంజాన్ పండుగ కోసం రూ.16 కోట్లు వెచ్చించి ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడమే కాకుండా 12లక్షల మంది ముస్లిం నిరుపేదలకు దుస్తులను పంపిణీ చేసినట్లు తెలిపారు. గతంలో రంజాన్ పండుగకు ఒక్కరోజు మాత్రమే సెలవు ఉండగా, టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండు రోజుల సెలవు దినాలను అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. బోనాలు, క్రిస్మస్ పండుగలకు కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించి నిరుపేదలకు దుస్తుల పంపిణీతో పాటు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

దేశంలోనే రైతుల సంక్షేమంకోసం రూ.12వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమన్నారు. ఈనెల 21న ప్రారంభించనున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలసాగు, తాగునీటి ఇబ్బందులు శాశ్వతంగా తీనున్నాయన్నారు. అభివృద్ధి కోసం శ్రమించే ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ప్రజల ఆదరణతో భవిష్యత్‌లో మంత్రి స్థాయికి ఎదిగాలని హోంమంత్రి ఆకాంక్షించారు. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ హోంమంత్రి మహమూద్ అలీ సహకారంతో నియోజకవర్గంలోని మైనార్టీల అభ్యున్నతికి మరింత కృషి చేస్తానన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలో రెండు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో అంబదాస్‌రాజేశ్వర్, నాయకులు మొయిద్‌ఖాన్, అభిషేక్‌శెట్కార్ పాల్గొన్నారు.

117
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...