నిర్ధేశించిన మేర రుణాలు ఇవ్వాలి


Wed,June 19, 2019 11:55 PM

మెదక్ కలెక్టరేట్ : జిల్లాలో ఉన్న ప్రతి బ్యాంకు తప్పనిసరిగా తమకు నిర్ధేశించిన లక్ష్యం మేరకు రుణాలను పంపిణీ చేసి లక్ష్యాలను చేరుకుని జిల్లాను ప్రగతిపథంలో నడిపేందుకు కృషి చేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి బ్యాంకర్లకు సూచించారు. బుధవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బ్యాంకర్లను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతిబ్యాంకు శాఖ తమ పరిధిలో కొంత రుణ లక్ష్యాన్ని నిర్ధేశించడం జరిగిందన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతి అధికారి కృషి చేయాలన్నారు. ప్రతి బ్యాంకు తప్పనిసరిగా వ్యవసాయ రుణాలను రైతులకు సకాలంలో అందజేయాలన్నారు. వ్యవసాయ రుణాల పంపిణీలో కొన్ని బ్యాంకులు అలసత్వం ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ప్రతి సమీక్షా సమావేశంలో బ్యాంకులకు లక్ష్యాన్ని నిర్ధేశించడం జరుగుతుందని కానీ వారు అందుకు తగ్గట్లుగా వ్యవహారించడం లేదన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే సదరు బ్యాంకులపై చర్యలకు సిఫారసు చేస్తామన్నారు. బ్యాంకుల వారీగా వ్యవసాయ పంట రుణాల లక్ష్యాలు, సాధించిన పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కొన్ని బ్యాంకులు మినహా ఆశించిన స్థాయిలో రుణ మంజూరు జరుగడం లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ వానకాలం సీజన్‌లో అయినా బ్యాంకులు నిర్ణీత లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం చిన్న, మధ్య తరగతి వ్యాపారస్తుల కోసం ప్రత్యేక రుణ సదుపాయం కల్పించేందుకు కొన్ని కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగా ముద్ర, స్టాండ్‌అప్, పీఎంఈజీపీ రుణాలను వ్యాపారస్తులకు అందజేసి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడం ఈపథకాల ముఖ్య ఉద్దేశమన్నారు. కానీ బ్యాంకులు మాత్రం ఈ రుణాల మంజూరులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని తెలిపారు. ముద్ర రుణాల మంజూరు కోసం తమను ఎవరు సంప్రదించడం లేదని ఒక బ్యాంకు మేనేజర్ ఇచ్చిన సమాదానానికి కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. రూ.50 వేల రూపాయలను ఎలాంటి సెక్యురిటీ లేకుండా ఇచ్చే పథకానికి మీదగ్గరికి ఎవరూ రావడం లేదా అని ప్రశ్నించారు. వచ్చే వారికి అనేక రకాలైన షరతులు విధించడం లేదా మాపరిధిలో లేదు అనే సమాధానాల వల్ల బ్యాంకుల వద్దకు రావడమే మానేశారని కలెక్టర్ తెలిపారు. ముందుగా ప్రతి బ్యాంకు తప్పనిసరిగా మా బ్యాంకులో ముద్ర రుణాలు ఇవ్వబడును అనే బ్యానర్‌ను ప్రదర్శించాలని ఆదేశించారు.

అవసరం ఉన్న వారు బ్యాంకులో సంప్రదిస్తే తిరస్కరించినట్లు తెలిస్తే సంబంధిత బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీటితో పాటు పెండింగులో ఉన్న స్టాండ్‌అప్, పీఎంఈజీపీ రుణాలను సైతం త్వరగా అందజేయాలని సూచించారు. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమం కింద జిల్లాలోని రైతులందరూ తాము సాగు చేసిన పంటలకు బీమా చేసుకునేలా చూడాలన్నారు. బ్యాంకు అధికారులు ఈ ప్రక్రియపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని విషయాలు రైతులకు తెలియజేసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురాంనాయక్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 2019-20 వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ విడుదల చేశారు. అలాగే మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజి కి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను, మహిళా స్వయం సహాయక సంఘాల 2019-20 వార్షిక ప్రణాళికను కలెక్టర్ ఆవిష్కరించారు.

2019-20 సంవత్సరానికి రూ. 2262 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక ఖరారు
2019-20 సంవత్సరానికి రూ. 2262 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను బ్యాంకర్ల సమావేశంలో ఖరారు చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1876 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్ధేశించగా ఇందులో రూ.1400 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాల లక్ష్యానికి గాను 65 శాతం ఇతర రుణాల పంపిణీ లక్ష్యం రూ. 416 కోట్లు కాగా 50 శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్లు లీడ్ బ్యాంకు మేనేజర్ నాగరాజు తెలిపారు. ఈ ఏడాది 2019-20 సంవత్సరానికి రూ. 2262 కోట్ల రుణ పంపిణీ లక్ష్యం కాగా ఇందులో వ్యవసాయ రుణాలు రూ.1850 కోట్లు అని రూ. 412 కోట్లు ఇతర రుణాలు పంపిణీ చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సీతారామారావు, నాబార్డ్ ఏజీఎం సీసీల్ తిమోతి, లీడ్ డిస్ట్రిక్ అధికారి వెంకటేశ్, డీఏవో పరశురాంనాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి దేవయ్య, డీడబ్ల్యూవో జ్యోతిపద్మ, డీటీడబ్ల్యూవో వసంతరావు, బీసీడబ్ల్యూవో సుధాకర్, మెదక్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, పరిశ్రమల శాఖ ఇన్‌చార్జి జీఎం తిరుపతయ్యలతో పాటు వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...