జల జాతర


Wed,June 19, 2019 12:51 AM

-ఫలితాన్ని ఇవ్వనున్న సీఎం కేసీఆర్‌ భగీరథ ప్రయత్నం
-గోదావరి జలాలతో పలు ప్రాజెక్టులకు జీవం
-జిల్లాలో చివరి దశకు చేరుకున్న ప్రాజెక్టుల నిర్మాణం
-ప్రాజెక్టుల కల త్వరలోనే సాకారం
-ఆనందంలో రైతాంగం, ప్రజానీకం
-21న మేడిగడ్డ వద్ద ప్రాజెక్టును ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చివరిదశకు చేరుకుంటున్నాయి. కొమురవెల్లి మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ (50 టీఎంసీలు), కొండపోచమ్మ రిజర్వాయ ర్‌(15 టీఎంసీలు), అనంతగిరి(3.50 టీఎంసీలు), శ్రీరంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌(3.50 టీఎంసీలు), చేపట్టారు. త్వరలోనే అనంతగిరి నుంచి రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌కు ట్ర యల్‌ రన్‌ చేయడానికి అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నా రు. కొండపోచమ్మ రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తయింది. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి. సిద్దిపే ట జిల్లా రిజర్వాయర్ల ఖిల్లాగా మారనున్నది. ఉమ్మడి జిల్లాలో మొ త్తంగా 8,46,744 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించనున్నా రు. సిద్దిపేట జిల్లాలో 3,29,616 ఎకరాలకు, మెదక్‌ జిల్లాలో 2,47,418 ఎకరాలకు, సంగారెడ్డి జిల్లాలో 2,69,744 ఎకరాల కు సాగు నీరందిస్తారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాను సస్యశ్యామలం చే సే గోదావరి జలాలు మిడ్‌మానేరు నుంచి వస్తాయి. సిద్దిపేట జిల్లా సరిహద్దులోని అనంతగిరి వద్ద 3.50 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు.

పనులన్నీ చివరి దశలో ఉన్నాయి. శ్రీరంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ను చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ వద్ద 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే కెనాల్‌ తదితర పనులు పూర్తి చేశారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పూర్తయింది. సర్జిపుల్‌ పంపుతో పాటు 134 మెగావాట్ల నాలుగు మోటార్లను బిగించారు. త్వరలోనే ట్రయల్‌ రన్‌ నిర్వహించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. కొమురవెల్లి మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ బండ్‌ నిర్మాణం 22.62 కిలోమీటర్లు. వీటిలో నాలుగు రీచ్‌లుగా పనులు జోరుగా సాగుతున్నాయి. మొత్తం 13కోట్ల క్యూబిక్‌ మీటర్ల నల్లమట్టి పని, 35 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక, 10 లక్షల క్యూబిక్‌ మీటర్ల కంకర పనులు చేపట్టాల్సి ఉంది. ఇప్పటికే నాలుగు రీచ్‌ల్లో రాత్రి పగలు అనే తేడా లేకుండా జోరుగా పనులు కొనసాగుతున్నాయి. ముంపు గ్రామాల కోసం ముట్రాజ్‌పల్లి వద్ద ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి నాటికి కాలనీ పూర్తి చేసే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి. కొండపోచమ్మ రిజర్వాయర్‌ పూర్తయింది. ఈ రిజర్వాయర్‌ ముంపు గ్రామాలకు తున్కిబొల్లారం వద్ద ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ ఏర్పాటు చేశారు. వచ్చే నెలలో ముంపు గ్రామాల ప్రజలకు అందించనున్నారు. త్వరలోనే ఉమ్మడి జిల్లాలోని బీడు భూములకు గోదావరి జలాలు రానుండడంతో రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

మేడిగడ్డ నుంచి గోదావరి జలాలు
మేడిగడ్డ నుంచి తరలించిన గోదావరి జలాలతో పలు ప్రాజెక్టులకు జీవం కల్పించేలా డిజైన్‌ రూపొందించారు. ఎల్లంపల్లి నుంచి 231.50 ఎఫ్‌ఆర్‌ఎల్‌ (ఫుల్‌ రిజర్వాయర్‌ లెవల్‌)లో ఉన్న మేడారం చెరువుకు నీటిని తరలిస్తారు. అక్కడి నుంచి కాకతీయ కాల్వ మీదుగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వరద కాల్వలోకి నీటిని పంపిస్తారు. 318 ఎఫ్‌ఆర్‌ఎల్‌లో ఉన్న మిడ్‌మానేరులోకి నీటిని తరలించి, అక్కడి నుంచి సిద్దిపేట జిల్లా సరిహద్దులోని అనంతగిరి రిజర్వాయర్‌కు.. అక్కడి నుంచి శ్రీ రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌లోకి నీటిని పంపిస్తారు. కొమురవెల్లి మల్లన్నసాగర్‌ 536 ఎఫ్‌ఆర్‌ఎల్‌లో ఉండే కీలకమైన రిజర్వాయర్‌లోకి నీటిని తరలిస్తారు. అక్కడి నుంచి 624 ఎఫ్‌ఆర్‌ఎల్‌లో ఉండే కొండపోచమ్మ రిజర్వాయర్‌కు నీటిని పంపుతారు. మరో వైపు ప్యాకేజీ-17 ద్వారా నిర్మించే కాల్వ నుంచి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు గోదావరి జలాలు తరలిస్తారు. ప్యాకేజీ-18 కింద నిర్మించే కాల్వ ద్వారా నీటిని హల్దివాగుకు పంపిస్తారు. ప్యాకేజీ-19 ద్వారా చేబర్తి గ్రామం వరకు గోదావరి జలాలు తరలించడంతో హల్దివాగు నుంచి నిజాంసాగర్‌కు జీవం పోస్తారు.

సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు.. అన్న మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ మాట మరోమారు నిజం కాబోతున్నది. సీఎం కేసీఆర్‌ భగీరథ ప్రయత్నంతో మనం కలలు కన్న ప్రాజెక్టులు కళ్ల ముందే సాకారం కాబోతున్నవి. ఎడారిగా మారిన మెతుకు సీమలో సిరులు పండించేందుకు చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చివరి దశకు వచ్చాయి. త్వరలోనే ఉమ్మడి జిల్లాకు పచ్చలహారం తొడగడానికి గోదారమ్మ పరుగులు పెడుతానంటున్నది. పాలకులకు సంకల్పం ఉంటే అద్భుతాలు ఎలా ఉంటాయో జిల్లాలో జరుగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులే నిదర్శనం. త్వరలోనే మిడ్‌మానేరు నుంచి జిల్లాకు గోదావరి జలాలు ట్రయల్‌ రన్‌ చేయడానికి అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 21న జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.

151
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...