ప్రతీకారంతో నరికారు


Wed,June 19, 2019 12:50 AM

పటాన్‌చెరు రూరల్‌, నమస్తే తెలంగాణ : మే 31న రుద్రారం వద్ద జాతీయ రహదారిపై ఓ యువకుడిని నరికి చంపిన కేసు సంచలనం సృష్టించింది. గతంలో జరిగిన ఒక హత్యకు ప్రతీకారంగా బాధిత కుటుంబ సభ్యులు సుపారీ ఇచ్చి కర్ణాటక నుంచి హంతకులను రప్పించి మహబూబ్‌ హుస్సేన్‌ను నరికి చంపారు. కేసును దర్యాప్తు చేసిన పటాన్‌చెరు పోలీసులు 14మందిపై కేసులు నమోదు చేశారు. వారిలో 11మందిని అరెస్టు చేశారు. ఈ మేరకు మంగళవారం పటాన్‌చెరు డీఎస్పీ రాజేశ్వర్‌రావు విలేకరుల సమావేశంలో రుద్రారం హత్య కేసులో నిందితులను అరెస్టు చేసిన విషయాన్ని వెల్లడించారు.

పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామంలో మే నెల 31న మహబూబ్‌ అనే యువకుడిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపారు. హత్య కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేశారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన మహబూబ్‌ (25) భోలక్‌పూర్‌, పలు ప్రాంతాల్లో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా దందా నిర్వహిస్తుంటాడు. ముషీరాబాద్‌కు చెందిన అర్షద్‌ (24)తో అతడికి వ్యాపార గొడవలు ఉన్నాయి. మహబూబ్‌పై ముషీరాబాద్‌లో అక్రమ బియ్యం రవాణా కేసులు గతేడాది నమోదు అయ్యాయి. వీటికి కారణం అర్షద్‌గా భావించిన మహబూబ్‌ తన అనుచరులతో గతేడాది డిసెంబర్‌ 17న పటాన్‌చెరు మండలం లక్డారం గ్రామం వద్ద అర్షద్‌ను తీసుకెళ్లి హత్య చేశారు. ఈ కేసును పటాన్‌చెరు పోలీసులు హత్యగా గుర్తించి మహబూబ్‌ను మరికొందరిని అరెస్టు చేసి సంగారెడ్డి కోర్టుకు హాజరుపర్చారు. ఈ మేరకు మహబూబ్‌పై కోర్టులో విచారణ కొనసాగుతున్నది. కోర్టుకు గత నెల 31న బైక్‌పై వచ్చిన మహబూబ్‌ను అర్షద్‌ కుటుంబ సభ్యులు, హంతక ముఠాతో వెంబడించి కొడవళ్లతో నరికి చంపారు. దాడి సమయంలో హంతకుల్లో ఒకరు తుపాకీతో బెదిరింపులకు పాల్పడినట్టుగా ప్రత్యక్ష సాక్షులు తెలుపడంతో పోలీసులు కేసును ఛేదించారు.

హత్యకు ప్లాన్‌ ఇలా..
రేషన్‌ బియ్యం అక్రమ దందా వ్యవహారంలో గతేడాది జరిగిన పరిణామాలు అర్షద్‌ హుస్సేన్‌, మహబూబ్‌ హుస్సేన్‌ మధ్య విభేదాలకు దారి తీసింది. అర్షద్‌ను మహబూబ్‌ హుస్సేన్‌ గతేడాది లక్డారం గ్రామానికి తీసుకొచ్చి హత్య చేశారు. తన కుమారుడిని హత్య చేశాడని పగబట్టిన అక్తర్‌ హుస్సేన్‌ (62), తన కుమారులతో కలిసి మహబూబ్‌ను చంపి ప్రతీకారం తీర్చుకోవాలని ఆదేశించాడు. ఈ మేరకు అజీజ్‌ అనే వ్యక్తితో కలిసి కర్ణాటకలోని కిరాయి ముఠాతో రూ.6లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బాబా, అహ్మద్‌, ఖలీల్‌తోపాటు నగరానికి చెందిన మహబూబ్‌ అనే వ్యక్తులు హత్యకు సుపారీ తీసుకున్నారు. డబ్బులు తీసుకున్న హంతక ముఠా కర్ణాటక రాష్ట్రం గుల్బార్గాకు చెందిన ఘోడా ఫిరోజ్‌ అనే పాతనేరస్తుడి వద్ద తుపాకీని కొనుగోలు చేశారు.

మే నెల 31న మహబూబ్‌ హుస్సేన్‌ కోర్టు విచారణకు వస్తున్నాడని తెలుసుకుని కారు, బైకులపై కోర్టు వద్ద నిఘా పెట్టారు. కోర్డుకు హాజరై ఇంటికి బయలు దేరిన మహబూబ్‌ హుస్సేన్‌ను రుద్రారం వద్ద నరికి చంపారు. ఈ హత్యకు అర్షద్‌ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని గుర్తించి విచారణ చేపట్టి కర్ణాటకలోని హంతక ముఠాను అరెస్టు చేశారు. మహమ్మద్‌ అన్సార్‌ హుస్సేన్‌, ఆసిఫ్‌ హుస్సేన్‌, అఖీల్‌ హుస్సేన్‌, అబ్దుల్‌ మన్నాన్‌, మహబూబ్‌, మహమ్మద్‌ ఖలీల్‌, అబ్దుల్‌ అజీజ్‌, మహమ్మద్‌ ఫైజాన్‌, కర్ణాటకకు చెందిన మహమ్మద్‌ ఖలీల్‌, మహమ్మద్‌ అహ్మద్‌, మహమ్మద్‌ బాబాలను అరెస్టు చేశారు. అక్తర్‌ హుస్సేన్‌, దావూద్‌, ఫిరోజ్‌లు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద తుపాకీ, 14 సెల్‌ఫోన్లు, రూ. 50వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసును 6 పోలీసు బృందాల ఛేదించాయి.

110
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...