విద్యార్థులకు అన్ని వసతులను కల్పిస్తాం


Wed,June 19, 2019 12:49 AM

హవేళిఘనపూర్‌ : గతంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అంటే చిన్న చూపు చూసిన ప్రజలే నేడు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తామని ముందుకు వచ్చి గ్రామస్తులు సొంతగా ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధన చేసేందుకు అనుమతి తీసుకుని ప్రారంభించుకోవడం అభినందనీయమని జిల్లా విద్యాధికారి రవికాంతరావు అన్నారు. మండల పరిధిలోని తొగిట గ్రామంలో గ్రామస్తుల ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల తరగతులను డీఈవో ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఈవో రవికాంత్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటుందని, ప్రజలు మంచి కోరికను కోరి ముందుకు వస్తే దానికి అనుగుణంగా పని చేసేందుకు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉంటారన్నారు. విశాలమైన ప్రాంగణం, పాఠశాల భవనం ఉండటం వల్ల అన్ని అర్హతలున్న ఈ పాఠశాలలో ఇంగ్లిష్‌ విద్యాబోధన ప్రారంభించుకోవడం రాబోయే రోజుల్లో అందరికీ ఆదర్శంగా కావాలన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రజలు ముందుకెళ్లి పాఠశాలలను రెండు సంవత్సరాల పాటు కొనసాగించుకుంటే తర్వాత ప్రభుత్వమే పూర్తిగా భరించి గ్రామీణ ప్రాంతాల్లో కూడా విద్యాబోధనందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ పాఠశాలల్లో చేరేందుకు గాను 80 మంది విద్యార్థులు తమ పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలలకు మాన్పించి ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగించేందుకు నిర్ణయించుకోవడం అభినందనీయమన్నారు.

ఈ పాఠశాలకు మండల పరిధిలోని చౌట్లపల్లి, సుల్తాన్‌పూర్‌, మద్దుల్‌వాయి, ముత్తాయికోట నుంచి పాఠశాలల్లో చేరేందుకు గాను ముందుకు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వీలైనంత మేరా విద్యాశాఖ తరఫున సహాయసహకారాలు అందిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తామన్నారు. ఈ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులకు ఆంగ్ల బోధన విధానంపై శిక్షణ ఇస్తూ విద్యార్థులకు మంచి విద్య బోధించే విధంగా చూస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు గాను ఈ నెల 21 నుంచి పునాధి పునశ్చరణ కార్యక్రమంతో 2వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు మరింత మంచి విద్యాబోధన జరిగేందుకు గాను కాంప్లెక్స్‌ పరిధిలో ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు వారికి శిక్షణ ఇచ్చి విద్యార్థులకు బేస్‌లైన్‌ టెస్టు తరగతిలో నేర్చుకున్న విషయాలను వారికి నేర్పించిన తర్వాత విద్యాబోధన చేయడం జరుగుతుందన్నారు.

తద్వారా విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారనే విషయాన్ని గుర్తించిన తర్వాత వారికి విద్యాబోధన చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా జాయ్‌పుల్లెనింగ్‌ కార్యక్రమంతో నిత్యంలాగే పాఠాలు చెప్పడమే కాకుండా విద్యార్థులకు చిన్న ప్రాజెక్టులు, సర్వేలు, కృత్యాలు చేయించడం ఆ సబ్జెక్ట్‌ పై ఆసక్తి పెంచేలా కూడా కృషి చేస్తున్నట్లు తెలిపారు. పిల్లలు కనీస సామర్థ్యాలు వచ్చే విధంగా అచ్చేవింగ్‌ బేసిక్‌ కాంపిటీసెస్‌ (ఏబీసీ) కార్యక్రమంతో 90 రోజుల పాటు అక్టోబర్‌ నుంచి మార్చి వరకు ఉదయం బోధన అనంతరం సాయంత్రం అర్ధ్దగంట పాటు వివిధ అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులతోనే సాధ్యమన్న విధంగా తమ విద్యాశాఖ పని చేస్తుందని డీఈవో పేర్కొన్నారు. తొగిట గ్రామస్తులు 3వ తరగతి వరకు కాకుండా మరో తరగతిని అదనంగా పెంచాలన్న కోరిక మేరకు ఆయన స్పందిస్తూ త్వరలోనే 4 తరగతి వరకు విద్యాబోధన కోసం అనుమతిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి, ఎంఈవో నీలకంఠం, ఎంపీటీసీ మాణిక్యరెడ్డి, గ్రామ సర్పంచ్‌ మంద శ్రీహరి, ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, కూచన్‌పల్లి పాఠశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, శంకర్‌, రమేశ్‌, కృష్ణమూర్తి, నరేందర్‌రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, గ్రామస్తులు సిద్ధిరాంరెడ్డి, రాంరెడ్డి, ప్రదీప్‌రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...