ఓ కంట కనిపెట్టండి


Mon,June 17, 2019 12:53 AM

మెదక్ హెల్త్ :నాడు అమ్మమ్మ, తాతయ్యలకు మాత్రమే కండ్ల్ల అద్దాలు కనిపించేవి. అది దూరదృష్టి కోసం పెట్టుకునే వారి సంఖ్యే ఎక్కువగా ఉండేది. కానీ, ఇటీవల కాలంలో చిన్న వయసు నుంచే దృష్టి లోపాలు పెరిగిపోతున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రికల్ కాంతులు, దుమ్మూ ధూళితో కండ్లపై ఒత్తిడి పెరిగిపోతున్నది. పోషకాహార లోపంతోనూ చూపు మసకబారుతున్నది. ముఖ్యంగా ఐదారేండ్ల వయసు నుంచే భూతద్దాలు పెట్టుకోవాల్సి వస్తున్నది. అందుకే పిల్లలను సెల్‌ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచడంతో పాటు అప్పుడప్పుడు కంటి పరీక్షలు చేయిస్తే చిన్నారుల కండ్లను కాపాడుకున్న వారమవుతాం. రాష్ట్రంలో సుమారు 48 శాతం ప్రజలు కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు పలు సర్వేల్లో వెల్లడైంది. ఇందులో 30శాతం వరకు పదిహేనేండ్ల వయస్సు వారేనని వెలుగులోకి వచ్చింది. సమాజంలో పెరుగుతున్న చదువు ఒత్తిడి, వెలుతురుకు దూరమవడం, వాతావరణంలో పెరిగిపోతున్న కాలుష్యం కూడా కంటి చూపు దెబ్బతినేందుకు కారణమవుతున్నది. ఇటీవలి కాలంలో వీడియో గేమ్స్, రైమ్స్, కార్టూన్ చానళ్లకు పిల్లలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. స్మార్ట్ ఫోన్లు టీవీలతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీంతో మానసిక రుగ్మతలతో పాటు కండ్లకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్కూళ్లకు వెళ్లాల్సిన సమయంలో దవాఖానల చుట్టూ తిరిగే వారు ఎక్కువగానే కనిపిస్తున్నారు. తెలంగాణ పాఠశాలల్లో పిల్లలలో హ్రస్వ దృష్టి, దీర్ఘదృష్టి క్రమేపీ పెరుగుతున్నట్లుగా సర్వేల్లో వెల్లడిస్తున్నాయి. 2014-15లో 5,44,499 మంది పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు చేస్తే 24,947 మందిలో దృష్టి లోపాలు ఉన్నట్లు గుర్తించారు. 2015-16లో 6,59,156 మందిని పరిశీలిస్తే 40,264 మందిలో దృష్టి లోపాలున్నట్లు నిర్ధారించారు. ఎక్కువగా చిన్నారుల్లో దూరపు చూపు సమస్య ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇంకా దుమ్మూధూళితో కండ్లల్లో అలర్జీ పెరిగిపోతున్నట్లు చెబుతున్నారు.

ఇటీవల కాలంలో పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల లోపాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇదే విషయాన్ని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి. పోషకాహారం సరిగ్గా అందకపోవడంతో కూడా కంటి వ్యాధులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. చిన్నప్పటి నుంచే పోషకాహారం విషయంలో తల్లిదండ్రులు దృష్టిపెట్టాలని, ముఖ్యంగా కండ్లకు అవసరమైన ఏ విటమిన్ దొరికే ఆకు కూరలు, ఇతర పండ్లను ఎక్కువగా అందించాలని సూచిస్తున్నారు.

ఆదిలోనే గుర్తిస్తే మేలు..
పిల్లలను ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఎక్కువ దూరంలో కూర్చోమని చెప్పాలి. పాఠశాలల్లో బోర్డుపై రాసే అక్షరాలు సరిగా కనిపిస్తున్నాయో? లేదో? అడిగి తెలుసుకోవాలి. సెల్‌ఫోన్‌తో ఆడనీయొద్దు. ముఖ్యంగా రాత్రి వేళ ఫోన్ అసలే ముట్టనీయొద్దు. తదేకంగా టీవీ, ఫోన్లు చూడడంతో కండ్లలో ఉండే నీటి పొరపై ఒత్తిడి పెరిగి కంటి వ్యాధులు వచ్చే ప్రమాదముంటుంది. వీలైనంత వరకు చిన్నారుల్లో దృష్టి లోపాలను ఆదిలోనే గుర్తించాలి. ఇలా చేయని పక్షంలోనే సమస్య ముదిరి ఆపరేషన్‌కు దారితీస్తుంది. ఒక్కోసారి చూపు కోల్పోయే ప్రమాదముంటుంది. ఇదే విషయాన్ని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. టీవీలకు, సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచాలని చిన్నారుల తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...