జిల్లాకు మరో రెండు ‘గురుకులాలు’


Sun,June 16, 2019 12:30 AM

-నియోజకవర్గానికి ఒకటి చొప్పున మంజూరు
-ఈనెల 17న ప్రారంభానికి సన్నాహాలు
-ఆంగ్ల మాధ్యమంలో 5,6,7 తరగతులు
-లబ్ధిపొందనున్న మరో 480 మంది విద్యార్థులు
-ఆరుకు చేరిన బీసీ గురుకులాలు
మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో నూతనంగా మరో రెండు బీసీ గురుకుల పాఠశాలలు వచ్చాయి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిన ఈ పాఠశాలలను ఈనెల 17వ తేదీన ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న రెండు బీసీ గురుకుల పాఠశాలలో పేద విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు కార్పొరేట్‌ స్థాయి విద్యను అభ్యసిస్తన్నారు. కొత్త వాటిలో ఈ ఏడాది 5,6,7 తరగతులను ఆంగ్ల మాధ్యంలో ప్రారంభించి తరగతికి 80 మంది చొప్పున 240 మందికి ప్రవేశం కల్పించనున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా మరో 480 మందికి గురుకుల పాఠశాలల్లో చేరే అవకాశం లభించనున్నది. గత ఏప్రిల్‌లో ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులకే రిజర్వేషన్ల ప్రకారం ఈ పాఠశాలల్లో ప్రవేశం కల్పించనున్నారు. నియోజకవర్గాల్లో గురుకుల పాఠశాలల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుండటంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

బడుగు బలహీన వర్గాల పిల్లలకు గుణాత్మక విద్యను అందిచడానికి మహాత్మా జ్యోతిరావు పూలే పేరిట నెలకొల్పిన బీసీ గురుకులాల సత్ఫలితాలు ఇస్తుండటంతో వాటి స్ఫూర్తితో గురుకులాల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లాలోని మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున రెండు గురుకుల పాఠశాలలు మంజూరు అయ్యాయి. దీంతో జిల్లాలో బీసీ గురుకులాల సంఖ్య పాత గురుకుల పాఠశాలలు నాలుగింటితో కలిపి ఆరుకు చేరింది. జిల్లాకు నూతనంగా మంజూరైన రెండు గురుకుల పాఠశాలలో ఒకటి బాలికల గురుకుల పాఠశాల కాగా మరోటి బాలుర గురుకుల పాఠశాల బాలుర గురుకుల పాఠశాల హావేళిఘనపూర్‌ మండల కేంద్రంలోని వైపీఆర్‌ కళాశాలలో తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నారు. నర్సాపూర్‌ మండలం వెల్దుర్తికి మంజూరైన గురుకుల పాఠశాలను అనువైన భవనం లేక పోవడంతో ప్రక్కనే ఉన్న డివిజన్‌ కేంద్రమైన తూప్రాన్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఈరెండు గురుకులాలను ఈనెల 17వ తేదీన ప్రారంభించనున్నారు. దీంతో జిల్లాలో గురుకుల పాఠశాలల సంఖ్య ఆరుకు చేరింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలో పేద విద్యార్థులకు పౌష్టికాహారం తోపాటు కార్పొరేట్‌ స్థాయి విద్య అందుతున్నది. తమ పిల్లల చదువుల కోసం ప్రభుత్వం కొత్త గురుకులాలను ఏర్పాటు చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పేద విద్యార్థులకు మెరుగైన విద్య
ప్రభుత్వం పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నది. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ఈ గురుకులాలు విద్యార్థులకు మంచి ఆహారంతో పాటు ఇంగ్లిష్‌ మీడియం చదువులు అందిస్తున్నాయి. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా రాష్ట్రం ఏర్పడక ముందు నర్సాపూర్‌ నియోజకవర్గం తునికిలో ఒకే బీసీ గురుకుల పాఠశాల ఉండగా గత రెండు సంవత్సరాల క్రితం ప్రభుత్వం మెదక్‌ నియోజకవర్గం హవేళిఘనపూర్‌లో బాలికల గురుకుల పాఠశాల, నర్సాపూర్‌ నియోజకవర్గం కౌడిపల్లిలో బాలుర గురుకుల పాఠశాలను, నారాయణఖేడ్‌ నియోజకవర్గ పరిధిలోని పెద్దశంకరంపేట లో బాలుర గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసింది.

వీటిలో ప్రస్తుతం ఐదవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు గత ఏడాది తరగతులు నిర్వహించగా ఈఏడు పదో తరగతిని కూడా నిర్వహిస్తున్నారు. ఒక్కో పాఠశాలలో 400 మంది చొప్పున విద్యను అభ్యసిస్తున్నారు. 2017 సంవత్సరంలో ప్రారంభమైన ఈ పాఠశాలలో మొదటగా 5,6,7 తరగతులు ప్రారంభించారు. ఒక్కో తరగతికి రెండు సెక్షన్ల చొప్పున విభజించి ప్రతి సెక్షన్‌కు 40 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. రెసిడెన్షియల్‌ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మంచి భోజనం, క్రీడలు, యోగా, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఫలితంగా జిల్లాలోని రెసిడెన్షియల్‌ పాఠశాలలో తమ పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. గురుకులాల్లో ఏటా నిర్వహించే ప్రవేశ పరీక్ష కోసం భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరు అవుతున్నారు. ఈ ఏడాది సైతం ఒక్కో సీటుకు ఎనిమిది మంది నుంచి పది మంది విద్యార్థులు పోటీ పడినట్లు అధికారులు తెలిపారు.

విద్యార్థులకు కల్పించే సౌకర్యాలు
ప్రతి విద్యార్థికి బెడ్డింగ్‌ మెటీరియల్‌, పుస్తకాలు, నోట్‌పుస్తకాలు, మూడు జతల స్కూల్‌ యూనిఫారం దుస్తులు, ట్రాక్‌ సూట్‌ అందజేస్తారు. మెనూతో కూడిన పౌష్టిక ఆహారం, మగ పిల్లలకు కాస్మోటిక్‌ చార్జిలు, ఆడపిల్లలకు కాస్మోటిక్‌ కిట్‌లను అందజేస్తారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన , కంప్యూటర్‌ విద్య, ప్రయోగాలు, విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటలు, అనుబంధ కార్యక్రమాల్లో ఉచితంగా శిక్షణ ఇస్తారు.

మరో 480 మందికి లబ్ధి
జిల్లాకు నూతనంగా మంజూరైన బీసీ గురుకులాల్లో మొదటి సంవత్సరం 5,6,7 తరగతులను ఆంగ్ల మాధ్యమంలో ప్రారంభించనున్నారు. తరగతికి 80 మంది చొప్పున ఒక్కో పాఠశాలలో 240 మందికి మొత్తం 480 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. ఈ విద్యాలయాల్లో ప్రవేశానికి విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా గత ఏప్రిల్‌లో నిర్వహించిన టీజీసెట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. అందులో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రిజర్వేషన్ల ప్రకారం ప్రవేశాలు కల్పించనున్నారు. ఒకవేల సీట్లు మిగిలితే రెండో విడుత కౌన్సిలింగ్‌ చేపట్టి పూర్తిచేయనున్నారు.

ప్రారంభానికి సిద్ధమైన పాఠశాలలు
జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన బీసీ గురుకుల పాఠశాలల్లో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ద్వారా 5,6,7 తరగతుల్లో అడ్మిషన్‌ ఇవ్వనున్నారు. పాత బీసీ గురుకులాల్లో పనిచేస్తున్న ప్రిన్సిపాల్‌, వార్డెన్‌లకు కొత్త పాఠశాలలకు డిప్యుటేషన్‌పై పంపారు. వీరి స్థానంలో కొత్త వారిని నియమించుకున్నారు. ఈ పాఠశాలలో ఇటీవల కంట్రాక్టు విధానంలో పనిచేసిన ఉపాధ్యాయులకు కొత్త పాఠశాలలో తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. క్యాటరింగ్‌ కోసం టెండర్‌ విధానంలో కేటాయించగా సెక్యురిటీ, స్వీపింగ్‌, శానిటేషన్‌, ఇతర సిబ్బందిని ఔట్‌సోర్సింగ్‌పై నియమించారు.

150
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...