గర్భిణులకు అహారపు అలవాట్లపై ..


Sun,June 16, 2019 12:29 AM

మెదక్‌ కలెక్టరేట్‌ :పుట్టే పిల్లలలో పోషకాహార లోపాలు లేకుండా ఉండేందుకు గాను మహిళలు గర్భిణిగా ఉన్న సమయంలో తీసుకోవాల్సిన అహారపు అలవాట్లను గురించి అవగాహన కల్పించాలని ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించినట్లు కలెక్టర్‌ ధర్మారెడ్డి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని అంగన్‌వాడీ సుపర్‌వైజర్లు, సీడీపీవోలతో మాతాశిశు మరణాల తగ్గింపు కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గర్భిణులకు సంబంధించిన పూర్తి వివరాలు అంగన్‌వాడీ కార్యకర్తలు, సుపర్‌వైజర్ల వద్ద అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతి మహిళకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలకు హాజరు అవుతుందా లేదా అనే విషయాన్ని గమనించడంతో పాటు తగిన సలహాలు, సూచనలు అందజేయాలన్నారు. పరీక్షలలో 7శాతం కంటే తక్కువ రక్తశాతం ఉన్న మహిళలపై ప్రత్యేక దృష్టి సారించి తీసుకోవాల్సిన అహారపు అలవాట్లను గురించి వివరించాలన్నారు. అలాగే 7-9 శాతం ఉన్న మహిళలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. ఈ రకమైన మహిళలపై అంగన్‌వాడీ కార్యకర్తలు, సుపర్‌వైజర్లు ప్రత్యేక సమయాన్ని కేటాయించి వారి కుటుంబ సభ్యులతో గర్భిణికి ఉన్న వాస్తవ ఆరోగ్య పరిస్థితిని వివరించడంతో పాటు డెలివరీ సమయంలో వచ్చే ఇబ్బందులను తెలియజేయాలన్నారు. అలాగే ప్రతి కేసును నెలవారి పరీక్షల సందర్భంగా రిపోర్టులను పరిశీలించాలన్నారు. నెల నెలకు నిర్వహించే పరీక్షలలో ఆరోగ్య పరిస్థితిలో పురోగతి లేకుండా ఉంటే సంబంధిత అంగన్‌వాడీ కార్యకర్త సరిగ్గా పనిచేయనట్లుగా పరిగణించి తగు చర్యలకు సిఫారసు చేయాలన్నారు. గత సంవత్సరం నిర్వహించిన సమీక్షలో సైతం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారని కానీ ఆచరణలో అధి సాధ్యం కాకపోవడంలో అధికారుల నిర్లక్ష్యం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోషక లోపాలు లేకుండా పిల్లలు జన్మించాలని ప్రభుత్వ నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. సమావేశంలో డీడబ్ల్యూవో జ్యోతిపద్మ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.వెంకటేశ్వరరావు, సహాయ కార్మిక అధికారి కృష్ణతో పాటు జిల్లాలోని సీడీపీవోలు, సుపర్‌వైజర్లు పాల్గొన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...