ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోఓపీ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి


Fri,June 14, 2019 12:41 AM

మెదక్ కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ, ప్రాతీయ దవాఖానల్లోని ఓపీ వివరాలను ఏరోజుకు ఆరోజు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యాధికారులు, వైద్య విధాన పరిషత్ ఆధీనంలో పనిచేసే వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ తరపున జిల్లాలో అమలు అవుతున్న వివిధ కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష జరిపారు. జిల్లాలో టీబీ కేసులను గుర్తించడంలో తక్కువ నమోదు చేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారుల పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. టీబీ కేసులను గుర్తించడంలో నర్సాపూర్ డివిజన్ తక్కువ స్థాయిలో నమోదు జరుగుతుందన్నారు. పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు. కేసీఆర్ కిట్‌లపై సమీక్ష జరిపారు. జిల్లాలో గర్బిణుల పేరు నమోదు 12 వారాలలోపు జరగాలన్నారు. (ఏఎన్‌సీ నమోదు) నిర్ణీత గడువు దాటిన తర్వాత ఏఎన్‌సీ నమోదు చేసే వారిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ చూసిన వెంటనే నిర్ణీత పోర్టల్‌లో ఎంట్రీ చేయాలన్నారు. తక్కువ ఎంట్రీ చేసిన వారు నెలలోపు మొత్తం ఓపీ వివరాలు నమోదు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఐడీసీఎఫ్ వాల్‌పోస్టర్‌ను (డయేరియా నివారణ), తల్లిపాల వారోత్సవాల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈనెల 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు 15 రోజుల పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 10వ తేదీ నుంచి జిల్లాలోని 0-5 సంవత్సరాలలోపు పిల్లలకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తారని, ఎవరైనా డయేరియాతో బాధపడితే వారికి జింక్ మాత్రలను 14 రోజులకు అందజేయనున్నట్లు డీఎంఅండ్‌హెచ్‌వో డా.వెంకటేశ్వరరావు తెలిపారు. మొదటివారం రోజులు ఐడీసీఎఫ్ డయేరియా నివారణ కార్యక్రమాలు, రెండవ వారంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత, తల్లిపాలు పట్టేవిధానం, గురించి తల్లులకు వివరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్‌వో రాజు, మెదక్ జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ డా.పి.చంద్రశేఖర్, పీవోఎంహెచ్‌ఎన్ సుమిత్ర, డా.ఇర్షాద్, డా.నవీన్, డా.విజయ, డా.నిర్మల, డా.అనిత, వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, డీపీవో జగన్నాథరెడ్డి పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...