ప్రభుత్వ పాఠశాల్లో ఫలితాల శాతం పెంచాలి


Thu,June 13, 2019 12:32 AM

-హరితహారాన్ని విజయవంతం చేసి రికార్డు సాధించాలి
-ఆగస్టులోపు పాఠశాలల్లో కంప్యూటర్ విద్య ప్రారంభిస్తాం
-ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి
హవేళిఘణపూర్: ప్రైవేటు పాఠశాలకు దీటుగా కూచన్‌పల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అమృత 10/10 సాధించి కూచన్‌పల్లి కీర్తి ప్రతిష్టలను నిలిపి అమృతను అందరు విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో ఫలితాల శాతం పెంచాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని కూచన్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు నోట్‌బుక్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 10/10 సాధించి మండల టాపర్‌గా నిలిచిన అమృతను శాలువాతో సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తన స్వగ్రామమైన కూచన్‌పల్లి జిల్లా పరిషత్ పాఠశాలకు గతంలో టేబుళ్లు, టాయిలెట్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా కూచన్‌పల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. గతంలో ఉన్న కంప్యూటర్ ల్యాబ్ మూతపడిపోయిన విషయాన్ని పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాస్ ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డికి తీసుకెళ్లగా ఆగస్టులోపు తన సొంత నిధులతో 12కంప్యూటర్లు ఇప్పించి కంప్యూటర్ విద్యనందించేందుకు కృషి చేస్తామని హామీనిచ్చారు. తమ గ్రామ విద్యార్థులు సాంకేతిక, ఆధునికతలో ముందుండాలని, అలాగే బాలురకు కూడా టాయిలెట్లు నిర్మాణం చేపట్టేందుకు నిధులు మంజూరు చేయిస్తామని హామీనిచ్చారు.

కూచన్‌పల్లి జెడ్పీ పాఠశాలలో సిబ్బంది విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేయడం ద్వారా మెదక్ పట్టణం నుంచి వచ్చి కూచన్‌పల్లిలో విద్యనభ్యసించడంపై పాఠశాల ఉపాధ్యాయులను సుభాష్‌రెడ్డి అభినందించారు. తన సొంత మండలంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు నోట్‌పుస్తకాలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో మండల టాపర్ ఫొటోతో ప్రచురించిన నోట్ బుక్‌లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా 15వేల నోట్‌బుక్‌లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని కూడా మెదక్ మండలంలో చేపట్టనున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా 10/10 శాతం మార్కులు తెచ్చుకునే విద్యార్థుల సంఖ్య పెరిగేలా ఉపాధ్యాయులు, విద్యార్థులు కృషి చేయాలన్నారు.

పేద విద్యార్థులకు తనవంతు సాయం చేయాలనే ఉద్దేశంతో మెదక్, హవేళిఘనపూర్ మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో నోట్‌బుక్‌లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు తగ్గిపోతున్న క్రమంలో మొక్కలు పెంచితే తద్వారా వర్షాలు కురుస్తాయని అన్నారు. కూచన్‌పల్లి గ్రామస్తుల, అధికారులు, విద్యార్థుల సహకారంతో గ్రామ శివారుతో పాటు మండల రోడ్ల పక్కన జూలైలో రికార్డు సృష్టించే విధంగా మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. పాఠశాలలో హెల్త్‌క్యాంపు ఏర్పాటు చేసి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయించి అవసరమైన మందులు ఇప్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, ఎంఈవో నీలకంఠం, గ్రామసర్పంచ్ దేవాగౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, సర్పంచ్‌లు యామిరెడ్డి, మాజీ సర్పంచ్ మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ ప్రియాంకకిష్టాగౌడ్, ఎస్‌ఎంసీ చైర్మన్ పాండరిగౌడ్, యాదగిరి, గ్రామ యువకులు పాల్గొన్నారు.

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...