నిరుద్యోగ యువత నైపుణ్యం సాధించాలి


Thu,June 13, 2019 12:27 AM

మనోహరాబాద్ : నిరుద్యోగ యువత కష్టపడి పనిలో నైపుణ్యం సాధించినప్పుడు అవకాశాలు వెతుకుంటూ వస్తాయని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. మనోహరాబాద్ మండలం దండుపల్లిలో గల ఐటీసీ పరిశ్రమ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐటీసీ బంగారు భవిష్యత్ శిక్షణ కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జిల్లా కేంద్రంలో సైతం నిరుద్యోగ యువతీ, యువకులు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారని, ప్రస్తుతం దండుపల్లిలో ఐటీసీ పరిశ్రమ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వెళ్తే పరిశ్రమల్లో వారి నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. కాగా ఉచితంగా ఏర్పాటు చేసే శిక్షణ కేంద్రాల్లో నైపుణ్యం సాధించడంతో పాటు వ్యక్తిత్వ వికాసం, స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ విద్య వంటి వాటిలో పట్టు సాధించవచ్చన్నారు. ఐటీసీ వారు నిర్వహిస్తున్న శిక్షణా కేంద్రంలో ఎలక్ట్రిషన్‌పై శిక్షణ ఇస్తున్నారని, దీని ద్వారా పరిశ్రమలల్లో ఉద్యోగాల కోసం ఆశపడకుండా స్వతహగా పని చేసుకోవచ్చన్నారు.

చెట్లను పెంచి... నీటి వనరులను సంపాదిద్దాం..
చెట్లను పెంచి, నీటి వనరులను సంపాదిద్దామని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని కోనాయిపల్లి పీటీలో ఐటీసీ బంగారు భవిష్యత్ శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో చెరువులో పూడిక తీత, చెరువు పరిరక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... నీటి వనరులను కాపాడే ముందు వర్షాలు కురిసేలా చెట్లను పెంచాలని ప్రజలకు సూచించారు. ఎక్కువ శాతం వర్షాలు చెట్లు, అటవీ ప్రాంతాల్లోనే కురుస్తాయని, చెట్లులేని చోట్ల వర్షాలు కురవవన్నారు. మొక్కలను నాటి 3 సంవత్సరాలు సంరక్షిస్తే అవి మనకు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. తెలంగాణలో అటవీశాతాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రతి గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేసి 32 జాతులకు చెందిన లక్ష మొక్కలను పెంచుతుందన్నారు. వాటిని గ్రామంలో పలు చోట్ల నాటనున్నట్లు వివరించారు.

మూడు అంశాలతో గ్రామాభివృద్ధి లక్ష్యంగా...
ఐటీసీ బంగారు భవిష్యత్ శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో మూడు అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు ఆ కేంద్రం మేనేజర్ పురుషోత్తం కలెక్టర్‌కు వివరించారు. అందులో ముఖ్యంగా పరిశ్రమ పరిధిలోని 5 కిలోమీటర్ల పరిసర గ్రామాల్లో పూడికతీత ద్వారా భూగర్భ జలాల పెంపుదల, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, గ్రామాభివృద్ధికి సహాయ సహకారాలు, నిరుద్యోగ యువతీ, యువకులు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 80 శాతం నిధులను పరిశ్రమనే భరిస్తుందని, మిగితా 20 శాతం పంచాయతీ లేదా గ్రామస్తులు, దాతలు భరించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో గడ ఎంపీడీవో జయదేవ్, ఎంపీడీవో అరుంధతి, సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు చిట్కుల మహిపాల్‌రెడ్డి, ఐటీసీ పరిశ్రమ మేనేజర్ కరుణశ్రీ, ఐటీసీ శిక్షణకేంద్రం రాష్ట్ర ఇన్‌చార్జి మనీశ్‌కుమార్, మేనేజర్ పురుషోత్తం, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ మెట్టు బాలకృష్ణారెడ్డి, ఉప సర్పంచులు శ్రీహరి, ధర్మేందర్, నాయకులు పంజా భిక్షపతి ముదిరాజ్, చంద్రశేఖర్ ముదిరాజ్, నాయకులు సంతోశ్, దశరథ, రమేశ్, గ్రామస్తులు, నిరుద్యోగ యువతి, యువకులు పాల్గొన్నారు.

121
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...