హరితహారం విజయవంతానికి కృషి చేద్దాం


Tue,June 11, 2019 12:11 AM

-ప్రతి వ్యక్తిని భాగస్వామ్యం చేయాలి
-ఖాళీ భూముల్లో మొక్కలు నాటాలి
-మొక్కల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించండి
-పాఠశాలల్లో నాటే మొక్కలను విద్యార్థులు దత్తత తీసుకునేలా చూడాలి
-కలెక్టర్ ధర్మారెడ్డి
-కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష
మెదక్ కలెక్టరేట్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు శక్తి వంచన లేకుండా తమ శాఖలకు కేటాయించిన నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకునేలా జిల్లా అధికారులు పనిచేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో హరితహారం కార్యక్రమం విజయవంతంపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాకు నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకునేలా జిల్లాలోని ప్రతి ఒక్కరినీ హరితహారం కార్యక్రమంలో భాగస్వాములుగా చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రతి శాఖకు కేటాయించిన ఖాళీ ప్రదేశాల్లో తప్పనిసరిగా మొక్కలను నాటాలన్నారు. ప్రతి మండలంలో సుమారు 50 నుంచి 100 మంది పెద్ద విస్తీర్ణం గల రైతులను గుర్తించాలని జిల్లా వ్యవసాయ అధికారికి సూచించారు.

ప్రస్తుతం రైతు బంధు కార్యక్రమం నడుస్తున్నందున ప్రతి రైతు వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు వస్తారని అప్పుడు వారికి హరితహారం కార్యక్రమం గురించి వివరించడంతో పాటు ఖాళీగా ఉన్న భూముల వివరాలు తీసుకోవాలన్నారు. తద్వార ఖాళీగా ఉన్న భూముల్లో మొక్కల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ ప్రక్రియలో పశుసంవర్ధక శాఖ అధికారులు సైతం పాల్గొనాలన్నారు. వారి పరిధిలో ఉన్న సొసైటీల సభ్యులకు సైతం వారి సొంత భూముల్లో గొర్రెలు మేతకు అవసరమైన మొక్కలు పెంపకంపై చైతన్య పరచాలన్నారు. చెరువులు, కుంటలు, ఇతర శిఖం భూముల్లో తుమ్మ విత్తనాలను నాటేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని రకాల సంక్షేమ, గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాటు చేయాలని సంక్షేమ అధికారులకు సూచించారు.

అలాగే ప్రతి పాఠశాలలో సైతం మొక్కలను నాటాలన్నారు. గత హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు దక్కని చోట తిరిగి మొక్కలను నాటాలన్నారు. పాఠశాల ప్రాంగణాల్లో నాటే మొక్కలను ప్రతి విద్యార్థి దత్తత తీసుకునేలా చూడాలన్నారు. అప్పుడు వాటి సంరక్షణ బాధ్యత విద్యార్థులపై ఉంటుందన్నారు. జిల్లాలోని ప్రతి పరిశ్రమలో సైతం ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. గత హరితహారం కార్యక్రమంలో కొన్ని ప్రాంతాలను కంపెనీలు దత్తత తీసుకుని మొక్కలను పెంచాయని ఈ సంవత్సరం అలాంటి కార్యక్రమాలు చేయపట్టాలన్నారు. పారిశ్రామిక వాడలోని ఖాళీ ప్రాంతాల్లో మొక్కలను నాటేలా చూడాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలు, ఇతర సంస్థల్లో సైతం మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలోని రేషన్ డీలర్లు, గ్యాస్ ఏజెన్సీల యజమానులకు చెందిన స్థలాల్లో సైతం మొక్కలు నాటేలా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈత వనాల పెంపునకు కృషి చేయాలని సూచించారు.

అలాగే ప్రతి గ్రామ పంచాయతీకి లక్ష మొక్కలతో కూడిన నర్సరీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మండల ప్రత్యేక అధికారులు నర్సరీల స్థితిగతులను పరిశీలించాలన్నారు. వర్షాకాలం ప్రారంభం అవుతున్నందున హరితహారం కార్యక్రమానికి ప్రథమ ప్రాధాన్యత అంశంగా పరిగణించాలన్నారు. ఖాళీ ప్రదేశాలు కనిపించకుండా విరివిగా మొక్కలను నాటేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. హరితహారం కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించి విరివిగా మొక్కలు నాటేలా నాటిన మొక్కలను సంరక్షించేలా అధికారులు చైతన్య కార్యక్రమాలను చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో సీతారామారావు, డీఎఫ్‌వో పద్మజారాణి, ఆర్డీవో సాయిరాం, జిల్లా అధికారులు జ్యోతిపద్మ, ఏసయ్య, అశోక్‌కుమార్, వసంతరావు, సుధాకర్, రాజిరెడ్డి, శ్రీనివాసులు, వెంకటేశ్వరరావు, దేవయ్య, కమలాకర్ పాల్గొన్నారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...