మెజార్టీ తేలేది నేడే


Wed,May 22, 2019 11:54 PM

-మెజార్టీపైనే అంచనాలు
-విజయోత్సవ సంబురాలకు టీఆర్‌ఎస్ శ్రేణుల ఏర్పాట్లు
-మెదక్, జహీరాబాద్ రెండు స్థానాల్లో మంచి మెజార్టీ వస్తుందని ధీమా
-బీవీఆర్‌ఐటీ, గీతం యూనివర్సిటీలలో ఓట్ల లెక్కింపు
-కౌంటింగ్ కేంద్రాల వద్దకు భారీగా తరలిరానున్న గులాబీ శ్రేణులు

సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధానప్రతినిధి : నేడు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగి, మెజార్టీ తేలనుండగా, టీఆర్‌ఎస్ దళం సంబురాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నది. ఎన్నికల నోటిఫికేషన్ మొదలు పోలింగ్ దాకా అన్ని నియోజకవర్గాల్లో గులాబీ పార్టీకే అనుకూలంగా ఉన్నది. ఇతర పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో ఉన్నా, అన్ని చోట్ల కారు జోరే కొనసాగింది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా మెదక్ నుంచి బరిలో ఉన్న తాజా మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జహీరాబాద్ నుంచి బరిలో ఉన్న తాజా మాజీ ఎంపీ బీబీ పాటిల్‌లు ఏ గ్రామానికి వెళ్లినా ఘన స్వాగతం లభించింది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేల విస్తృత ప్రచారం బాగా కలిసి వచ్చింది. ప్రతి చోటా కారు గుర్తుకే మా ఓటు.. అనే నినాదం వినిపించింది. ఇప్పటికే గులాబీ అభ్యర్థుల గెలుపు ఖాయమని ధీమా ఉండగా, మెజార్టీపైనే సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

అధికార టీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. జిల్లా పరిధిలోని జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించనున్నారని ధీమాతో ఉన్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గాల పరిధిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకోవడానికి ఎవరికి వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గురువారం ఓట్లు లెక్కించనున్న విషయం తెలిసిందే. జహీరాబాద్ స్థానానికి సంబంధించిన పటాన్‌చెరు సమీపంలోని గీతం యూనివర్సిటీలో మెదక్ పార్లమెంట్‌కు సంబంధించి నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీ ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8గంటల నుంచి లెక్కింపు మొదలు కానున్నది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో మొత్తం 10అసెంబ్లీ నియోజకవర్గాలుండగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు విస్త్రతంగా ప్రచారం చేసిన విషయం కూడా విధితమే. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు ఎవరికి వారు తమ నియోజకవర్గం నుంచి ఎంత మెజార్టీ రానున్నదని అంచనాలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో మెజార్టీపై టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆసక్తి నెలకొన్నది.

అంతా అనుకూలమే...
ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. మెదక్ పరిధిలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. జహీరాబాద్ పరిధిలో జుక్కల్, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, అందోలు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కే అనుకూల వాతావరణం ఉన్నది. ఇతర పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ హవానే కొనసాగింది. ఈ క్రమంలో అన్నివర్గాల ప్రజలు టీఆర్‌ఎస్ అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టారు. జహీరాబాద్ నుంచి బరిలో ఉన్న తాజా మాజీ ఎంపీ బీబీ పాటిల్‌కు, మెదక్ నుంచి బరిలో ఉన్న తాజా మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలు ఏ గ్రామానికి వెళ్లినా ఘన స్వాగతం లభించింది. ఇదే సమయంలో ఇతర పార్టీల నాయకుల ప్రచారం చప్పగా సాగించదని కూడా చెప్పుకోవ చ్చు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే అధికార పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించనున్నారని ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు.

ప్రజాప్రతినిధుల విస్తృత ప్రచారం...
ఎన్నికల సమయంలో ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రజాప్రతినిధులు విస్త్రతంగా ప్రచారం చేశారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి, మాజీ మంత్రి హరీశ్‌రావు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్‌చార్జిలుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. వీరిద్దరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అసెంబ్లీ నియోజకవర్గాల వారికి విస్తృతంగా ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు కూడా భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలన్ని గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. మెదక్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలను మాజీ మంత్రి హరీశ్‌రావు సమన్వయ పరిచారు. మెదక్‌లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, దుబ్బాకలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి, నర్సాపూర్‌లో మదన్‌రెడ్డి, సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, పటాన్‌చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డిలతో పాటు మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, గజ్వేల్‌లో కార్పొరేషన్ చైర్మన్లు భూం రెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, భూపతిరెడ్డిలు సవాల్‌గా తీసుకుని ప్రచా రం చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో పార్టీ నేతలను మంత్రి ప్రశాంత్‌రెడ్డి సమన్వయ పరిచారు. ఈ క్రమంలోనే జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, అందోలులో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, నారాయణఖేడ్‌లో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిలు జోరుగా ప్రచారం చేశారు. పార్టీ శ్రేణులందరినీ సమన్వయ పరిచి విస్త్రతంగా ప్రచారం చేయడంలో టీఆర్‌ఎస్ నేతలు సక్సెస్ అయ్యారు.

విజయోత్సవాలకు ఏర్పాట్లు...
జహీరాబాద్, మెదక్ ఎంపీ స్థానాల్లో విజయం ఖాయమని నిర్ణయించుకున్న అధికార టీఆర్‌ఎస్ శ్రేణులు విజయోత్సవాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే బాణాసంచా తెచ్చిపెట్టుకున్నారు. మెదక్ స్థానానికి సంబంధించిన నర్సాపూర్‌లోని బీఆర్‌ఐటీతో పాటు అల్లూరి సీతారామరాజు గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో, జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి గీతం యూనివర్సిటీలో ఓట్లు లెక్కించనున్నారు. తాజా మాజీ ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి తిరిగి రెండోసారి ఎంపీలుగా భారీ మెజార్టీలో విజయం సాధించనున్నారని ధీమాతో ఉన్న టీఆర్‌ఎస్ శ్రేణులు విజయోత్సవాలకు ఏర్పాట్లు చేసుకున్నారు.

ఈ క్రమంలోనే పెద్దఎత్తున కౌంటింగ్ కేంద్రాల వద్దకు తరలివెళ్లడానికి సిద్ధం అవుతున్నారు. కేంద్రాల లోపలికి అనుమతి లేకపోయినప్పటికీ బయట ఉండి అయినా సంబురాల్లో పాల్గొనడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా పార్లమెంట్ నియోకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు, గ్రామాల్లో కూడా సంబురాలకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

132
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...