నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు


Mon,May 20, 2019 11:47 PM

-వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ స్పెషల్‌ అధికారి సుజాత
మెదక్‌ మున్సిపాలిటీ : నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ స్పెషల్‌ అధికారి సుజాత హెచ్చరించారు. సోమవారం జిల్లా కేంద్రమైన మెదక్‌ పట్టణంలోని ఫెర్టిలైజర్స్‌ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ఫెర్టిలైజర్‌ దుకాణాల్లో నకిలీ విత్తనాలు అమ్మినట్లు తమ దృష్టికి వస్తే దుకాణ యజమానులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. విత్తనాల దుకాణాల్లో నకిలీ విత్తనాలు అమ్మకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని అన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రెబల్‌సన్‌ ఉన్నారు.
రికార్డులను తనిఖీ చేసిన నిజాంపేట
ఎస్‌ఐ, వ్యవసాయశాఖ అధికారి
రామాయంపేట : విత్తనాలు, ఎరువుల దుకాణాలల్లో నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని నిజాంపేట ఎస్సై ఆంజనేయులు, వ్యవసాయశాఖ అధికారి సతీష్‌ లు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఫెర్టిలైజర్‌ దుకాణాలల్లో దాడులు నిర్వహించి రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నిజాంపేట పరిధిలో ఉన్న విత్తనాలు, ఎరువులను విక్రయించే వ్యాపారులు ప్రభుత్వం అందిస్తున్న ధరలకే విక్రయాలు జరుపాలన్నారు. కొనుగోలు చేసిన రైతులకు కచ్చితంగా రసీదులు ఇవ్వాలన్నారు. రసీదులను ఇవ్వని వ్యాపారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడమే కాకుండా లైసెన్సులను రద్దు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు శ్రీలత, సాయికృష్ణ, గణేశ్‌, నరేందర్‌, రాజు పాల్గొన్నారు.
దుకాణాలను తనిఖీ చేసిన అధికారులు
వెల్దుర్తి : నకిలీ విత్తనాలు, ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయాధికారి మాలతి, ఎస్సై గంగరాజు లు హెచ్చరించారు. సోమవారం వెల్దుర్తిలో ఎరువులు, విత్తనాల దుకాణాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరువులు, విత్తనాల విక్రయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఐఎస్‌ఐ మార్కు కలిగిన, ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన విత్తనాలనే విక్రయించాలన్నారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే దుకాణాలను సీజ్‌ చేయడంతో పాటు దుకాణ యజమానులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.
హవేళిఘనపూర్‌ ..
హవేళిఘనపూర్‌ : మండల కేంద్రమైన హవేళిఘనపూర్‌ రైతు ఆగ్రోస్‌ సేవ కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి నాగమాధురి, ఎస్సై శ్రీకాంత్‌ లు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గతంలో రైతులకు విక్రయించిన మందు లు, ఎరువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఫర్టిలైజర్‌ దుకాణాల్లో ఎరువులు కొనుగోలు చేసిన అనంతరం రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఫర్టిలైజర్‌ దుకాణం నిర్వాహకులు నరేందర్‌రెడ్డి ఉన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...