వచ్చే నెలలో కొత్త కార్డులు


Sat,May 18, 2019 11:40 PM

మెదక్ మున్సిపాలిటీ /మెదక్ కలెక్టరేట్ :చాలా కాలంగా ఆహార భద్రత కార్డులు లేక కొత్త వాటి కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వచ్చే నెల మొదటి వారం నుంచి అర్హులైన వారి ఆర్థిక స్థోమతను బట్టి ఆహార కార్డులను జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇందుకు సంబంధించి జిల్లాల వారీగా అధికారులు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించే పనిలో నిమగ్నమయ్యారు. గతంలో రేషన్‌కార్డుల పంపిణీలో అక్రమాలు, వస్తువుల పంపిణీలో అవకతవకలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ సారి అధికారులు పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికట్టేందుకు ఈ-పాస్‌ను అమలులోకి తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్ట పడనున్నది.

కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు..
కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. అయితే అర్హులైన వారందరూ మీసేవ కేంద్రాలలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మెదక్ జిల్లాలోని 20 మండలాల్లో రేషన్ దుకాణాలతో నిత్యావసర వస్తువులు పొందాలంటే ఆహారభద్రత కార్డులు తప్పనిసరిగా ఉండాలి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా రేషన్‌దుకాణాలు మొత్తం 521 ఉండగా, 2 లక్షల 13వేల 282 మందికి ఆహారభద్రత కార్డులు ఉన్నాయి. వీరికి ప్రతీనెల 4520 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ జరుగుతున్నది. జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 13,013 అంత్యోదయ కార్డులు ఉండగా, 84 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. లబ్ధిదారులకు ప్రతి నెలా బియ్యం, కిరోసిన్ రేషన్ దుకాణాలతో అందుతున్నది. కార్డులో ఎంత మందికి ఉంటే అంత మందికి పరిమితి లేకుండా ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం, అంత్యోదయ కార్డులకు 35 కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం బియ్యం, కిరోసిన్ మాత్రమే అందిస్తున్నారు.
అర్హులందరికీ ఆహార భద్రత కార్డులు...
జిల్లావ్యాప్తంగా అర్హులైన పేదలందరికీ ఆహార భద్రత కార్డులు వచ్చేలా చూడాలని జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొత్తగా ఆహార భద్రత కార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానించినట్లు జిల్లా పౌరసరఫరాల ఇన్‌చార్జి జి.శ్రీనివాస్ తెలిపారు. కొత్త కార్డుల కోసం అనుసరించాల్సిన ప్రభుత్వ మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. వీటికి అనుగుణంగా ఉన్న లబ్ధిదారులకు కార్డుల పంపిణీలో అధికారులు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. గతంలో కొత్తరేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు తిరిగి మరోసారి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.
పాత దరఖాస్తులకు కాలం చెల్లు..!
ప్రభుత్వం మీసేవ కేంద్రాలలో జూన్ మొదటి వారం నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారివి ఇప్పుడు చెల్లుబాటు కావని పౌరసరఫరాల అధికారులు తెలిపారు. మళ్లీ వారు కూడా కొత్తగా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని రెవెన్యూ అధికారులు అంటున్నారు. కార్డులో వివరాలు మార్చుకోవాల్సిన వారు తొలిగింపులు, చేర్పులు కూడా ప్రస్తుత ప్రక్రియలో జరుగుతాయి. కొత్తగా పెళ్లయిన వారు, కుటుంబాల నుంచి విడిపోయిన వారు రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు. దీంతో చాలా మంది అర్హులైన వారు ఈసారి దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
కొత్త కార్డులకు అర్హులు వీరే...
దారిద్య్ర రేఖకు దిగువన ఉండి గ్రామీణ ప్రాంతాల్లో వారి వార్షిక కుటుంబ ఆదాయం రూ.లక్షా 50వేల లోపు, పట్టణ ప్రాంతంలోని వారు రూ.2లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన వారు ఎవరైనా ఆహార భద్రత కార్డు పొందడానికి అర్హులుగా పరిగణిస్తారు. దరఖాస్తు దారుడి ఆదాయం ధ్రువీకరణతో పాటు నివాస ధ్రువీకరణ, ఆధారుకార్డు, జిరాక్స్ పత్రులను జతపరిచి మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుని ఆ ఫారాలను సంబంధిత తహసీల్దార్‌కు అందజేయాల్సి ఉంటుంది.
ఈ దరఖాస్తులను రెవెన్యూ అధికారులు విచారించిన తర్వాత జిల్లా పౌర సరఫరాల అధికారులకు పంపిస్తారు. వారి ఆమోదిస్తేనే కొత్త రేషన్‌కార్డు పొందవచ్చు. ఏ ఆధారం లేని ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు, వితంతువులకు అంత్యోదయ కార్డులను అందజేస్తారు. ఎలాంటి ఆధారం లేని వారు అన్నపూర్ణ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

186
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...