మిషన్‌కాకతీయతో చెరువులకు మహర్దశ


Sat,May 18, 2019 11:14 PM

-మరమ్మతులతో చెరువులు, కుంటలకు పూర్వవైభవం
నర్సాపూర్,నమస్తేతెలంగాణ: మిషన్ కాకతీయలో భాగంగా చెరువులు, కుంటల పునరుద్దరణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టి డివిజన్ పరిధిలోని చెరువులు, కుంటలకు పూర్వవైభవం తీసుకొచ్చింది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌కాకతీయ పనులు నర్సాపూర్ డివిజన్ పరిధిలో విజయవంతం అయ్యాయి. డివిజన్‌లోని నర్సాపూర్, కౌడిపల్లి, శివ్వంపేట, కొల్చారం, చిలిపిచెడ్ వెల్దుర్తి తదితర మండలాల్లో మొత్తం 1056 చెరువులు, కుంటలు ఉన్నాయి. అయితే సుమారు 28065 ఎకరాల ఆయకట్టు ఉంది. మొదటి, రెండవ, మూడవ, నాల్గవ విడుతల్లో చెరువు పూడికలు తీసి కుంటల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు చెరువుల కట్టలను బలోపేతం చేయడం, అలుగులు, తూములకు మరమ్మతు చేయడం వంటివి చేశారు.

చెరువు, కుంటలనుంచి తీసిన మట్టిని రైతులు స్వచ్ఛందంగా పొలాల్లో వేసుకోవడంతో మంచి ఫలితాలు వచ్చాయి. జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించిన అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు చెరువు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించడంతో ఈ పనుల క్వాలిటీ విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి పర్యవేక్షించారు.
మొదటి విడుతలో మొత్తం 176 చెరువులు మిషన్‌కాకతీయ కింద ఎంపిక చేశారు. ఇందు కోసం రూ. 53.69 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసి పనులు చేపట్టింది. 14000 ఎకరాల ఆయకట్టు సామర్థ్యం ఉంది.
రెండవ విడుతలో..
నర్సాపూర్ డివిజన్ పరిధిలో 191 చెరువులు కుంటలు మంజూరయ్యాయి. ఇందు కోసం రూ.44.78 కోట్ల నిధులు మంజూరు చేసి పనులను చేపట్టారు. 11000 ఎకరాల ఆయకట్టు సామర్థ్యం ఉంది.

మూడవ విడుత 159 చెరువులు, కుంటలు మంజూరయ్యాయి. 28.68 కోట్లు నిధులు మంజూరు చేసి పనులను చేపట్టారు. 6400 ఎకరాల ఆయకట్టు సామర్థ్యం ఉంది.
నాల్గవ విడుతలో 75 చెరువులు కుంటలు మంజూరయ్యాయి. 12.45 కోట్ల నిధులతో పనులు చేపట్టారు. 2536 ఎకరాల ఆయకట్టు సామర్థ్యం ఉంది. డివిజన్ పరిధిలోని 6 మండలాల్లో మూడు విడుతల్లో పనులు పూర్తయ్యాయి. మూసపేట, రామచంద్రాపూర్, ఆవంచ, ఆద్మాపూర్, ఇబ్రహీంబాద్, రుస్తుంపేట, హన్మంతాపూర్, నర్సాపూర్ అల్లమోని కుంట, కోమటికుంట, మల్పర్తి చెరువుల్లో పనులు చేపట్టాల్సి ఉంది.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...