భూసార పరీక్షలతో.. అధిక దిగుబడులు


Sat,May 18, 2019 11:12 PM

-మట్టి సేకరణలో జాగ్రత్తలు అవసరం తొలకరికి ముందే భూ సార పరీక్షలు
వెల్దుర్తి: భూసార పరీక్షలతో పంటకు అవసరమైన ఎరువులను వాడడం వలన అధిక దిగుబడులు సాధించవచ్చు. అలా కాకుండా తమ ఇష్టానుసారంగా రసాయన ఎరువుల వాడకంతో భూసారం తగ్గిపోయి పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అందువల్లన ప్రతి రైతు తొలకరి జల్లులకు ముందు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలతో పంట పొలాల్లోని మట్టిని సేకరించి భూసార పరీక్షలు చేయిస్తే పెట్టుబడి తగ్గడంతో పాటు నాణ్యమైన పంటను పొందవచ్చు. మట్టి నమూనాల సేకరణకు ప్రస్తుతం సరైన సమయమని, భూ సార పరీక్షలకు రైతులకు అవగాహన కల్పించడంతో పాటు మట్టి నమూనాలను సేకరించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి మాలతి తెలిపారు. మట్టి నమూనాల సేకరణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె రైతులకు వివరించారు.

భూసార పరీక్షల కోసం మట్టిని పొలంలో ఒకే దగ్గర తీయకూడదు. వేర్వేరు స్థలాలలో సేకరించి శుద్ధి చేయాలి.ఒకే రకమైన భూమి ఉంటే ఐదు ఎకరాల విస్తీర్ణానికి రెండు లేదా మూడు స్థలాలలో మట్టిని తీయాలి.భూమి రకం వేర్వేరుగా ఉంటే భూమి రకం, మెట్ట పొలం, పల్లపు పొలాలతో పాటు ఇతర తేడాల ఆధారంగా మట్టి నమూనాలను సేకరించారు.మట్టిని సేకరించేటప్పుడు ఇంగ్లీష్ అక్షరం వి ఆకారంలో తవ్వి పై మట్టి కాకుండా లోపలి మట్టిని పొరలుగా తీయాలి.వేర్వేరు చోట్ల తీసిన మట్టిని ఒక దగ్గర పోసి నాలుగు భాగాలుగా విభజించాలి.నాలుగు భాగాలలో రెండు భాగాలను తీసివేసి మిగాత రెండు భాగాలను తీసుకోవాలి. తీసుకున్న రెండు భాగాల మట్టిని ఎలాంటి రాళ్లు, చెత్త, దుమ్ము లేకుండా శుభ్రపర్చాలి. శుభ్రపర్చిన మట్టి అరకిలో ఉండేలా చూసుకోవాలి.శుభ్రం చేసి తీసుకున్న మట్టిని శుభ్రమైన సంచిలో వేసి పూర్తి వివరాలతో వ్యవసాయశాఖ అధికారులకు అందించాలి.

మట్టి సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
భూసార పరీక్షల కోసం మట్టిని సేకరించేటప్పుడు సేంద్రియ, రసాయన ఎరువులు నిల్వ ఉన్న చోట తీసుకోవద్దు.తడి పొలంలో కాని, బురదలో కాని మట్టిని తీసుకోవద్దు. సాధారణంగా పొడిబారిన పొలంలో మట్టిని భూసార పరీక్షల కోసం తీసుకోవాలి.పొలాల్లో ఉండే గట్ల పక్కన, చెట్ల కింద, ఎప్పుడు తిరిగే చోట మట్టిని తీసుకోరాదు.
ఎరువులు వేసిన 45 రోజుల తరువాతనే మట్టిన సేకరించాలి. లేకుంటే సరైన ఫలితాలు రాక రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.భూసార పరీక్షలతో
కలిగే ప్రయోజనాలు
భూసార పరీక్షలతో పొలాల్లోని పోషకాలు, భూమి లక్షణాలను తెలుసుకోవచ్చు.వాటి ఆధారంగా అవసరమైన ఎరువులను మాత్రమే వాడవచ్చు. దీంతో అధిక పెట్టుబడి నుంచి వెసులుబాటు కలుగుతుంది.భూమిలో లోపించిన జింక్, నత్రజని, క్షార, ఆమ్ల లక్షణాలను తెలుసుకుని రైతులకు సరైన సూచనలు చేయవచ్చు.ఏ భూమిలో ఏ పంటలు పండుతాయో గుర్తించి రైతులకు తగిన పంటలను సూచించడంతో పాటు పంట కాలనీల ఏర్పాటుకు ఎంతో తోడ్పడుతుంది.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...