కొమురవెల్లి మల్లన్న బెల్లం లడ్డూలు


Sat,May 18, 2019 11:05 PM

-అందుబాటులోకి రానున్నబెల్లం లడ్డూ ప్రసాదం
-తెల్ల బెల్లం కొనుగోలు ప్రతిపాదనలు
చేర్యాల, నమస్తే తెలంగాణ: కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి భక్తులకు ఇక బెల్లం లడ్డూలు(ప్రసాదం) అందించేందుకు ఆలయ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రస్తుతం భక్తులకు అందిస్తున్న చక్కర లడ్డూలతో పాటు ఇక నుంచి బెల్లం లడ్డూలు అందుబాటులోకి రానున్నాయి. దేవాదాయ కమిషనర్ అనిల్‌కుమార్ ఆదేశాల మేరకు కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ఇక నుంచి బెల్లం లడ్డూలను తయారు చేసి భక్తులకు విక్రయించనున్నారు. దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ సూచనల మేరకు ఇప్పటికే యాదాద్రి లక్ష్మీనర్సింహ్మస్వామి వారి ఆలయం, భద్రాద్రిలోని సీతారామస్వామి వారి ఆలయం, బాసర జ్ఞాన సరస్వతీ మాత ఆలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయాల్లో బెల్లం లడ్డూలను గత రెండు రోజులుగా భక్తులకు విక్రయిస్తున్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఒక్కటైన కొమురవెల్లి మల్లన్న ఆలయంలో బెల్లం లడ్డూలను తయారు చేసి విక్రయించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గత వారం రోజుల క్రితం ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్, ఏఈవో రావుల సుదర్శన్ శాంపిల్‌గా బెల్లం లడ్డూలను తయారు చేసి ఉన్నతాధికారులకు వాటిని అందజేశారు. భక్తుల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని చక్కల లడ్డూలతో పాటు బెల్లం లడ్డూలను తయారు చేయాలనే యోచనలో దేవాదాయ శాఖ అధికారులు కొత్తగా లడ్డూల తయారీకి శ్రీకారం చుట్టారు. మల్లన్న ఉత్సవాల సమయంలో ప్రతి వారం 50వేల లడ్డూల విక్రయం ఉంటుంది, అదే ప్రతి ఆదివారం రోజున 12వేల లడ్డూలకు పైగా విక్రయం జరుగుతుంటుంది. ఇదే ప్రతిపాదికన ఇక పై చక్కర, బెల్లం లడ్డూలను తయారు చేయాల్సి ఉంటుందని ఆలయవర్గాలు తెలిపాయి.

బెల్లం లడ్డూకు రూ.20?
మల్లన్న ఆలయంలో ప్రస్తుతం విక్రయిస్తున్న 100 గ్రాముల చక్కర లడ్డూకు రూ.15లకు విక్రయిస్తున్నారు. ఇక 100 గ్రాముల బెల్లం లడ్డూకు రూ.20లకు విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. చక్కరతో తయారు చేసిన లడ్డూలు వారం రోజుల పాటు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది, కాని బెల్లంతో తయారు చేసిన లడ్డూరు రెండు రోజులు నిల్వ ఉండే అవకాశం తక్కువగా ఉండడంతో లడ్డూలను ఏ మేరకు తయారు చేయాలనే యోచనలో మల్లన్న ఆలయవర్గాలు ఉన్నాయి. స్వామి వారికి ప్రీతిపాత్రమైన ఆది, బుధ వారాల్లోనే బెల్లం లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచాలని, మిగిలిన రోజుల్లో చక్కర లడ్డూలను విక్రయిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా నల్ల బెల్లంతో తయారు చేయడం కంటే తెల్ల బెల్లంతో బెల్లం లడ్డూ తయారు చేసేందుకు తెల్ల బెల్లం కొనుగోలు ప్రతిపాదనలు తయారు చేశారు.

రద్దీ రోజుల్లో లడ్డూలు విక్రయిస్తున్నాం
రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ఆదేశాల మే రకు మల్లన్న ఆలయంలో బెల్లం లడ్డూలను రద్దీ రోజుల్లో అందుబాటులో పెడుతున్నాం. భక్తుల నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా పూర్తి స్థ్ధాయిలో బెల్లం లడ్డూలను అందుబాటులోకి తీసుకువస్తాం. ఇప్పటికే లడ్డూలను తయారు చేసి ఉన్నతాధికారులకు శాంపిల్స్ అందిచాము.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...