సాగుకు... సన్నద్దం


Sat,May 18, 2019 12:55 AM

వానకాలం సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దుక్కులు దున్ని పెట్టారు. జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో రెండు లక్షల ఎకరాల్లో పంటలు వేయనుండగా, అత్యధికంగా వరి 90 వేల ఎకరాల్లో సాగు చేయనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.ఇందుకు 45, 450 క్వింటాళ్ల విత్తనాలు సబ్సిడీపై అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాకు 35 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అధికారులు చెబుతున్నారు. జూన్ మొదటి వారంలో వర్షాలు ప్రారంభం కాకముందే ఎరువులు, విత్తనాలు సిద్ధం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. మొక్కజొన్న, పత్తి, పెసర్లు, కందులు, మినుములు, ఉల్లి, చెరుకు తదితర పంటలు ఎన్ని ఎకరాల్లో పండించే అవకాశం ఉందో ఇప్పటికే పూర్తి వివరాలు సేకరించారు. సాగునీటి వనరులు పరిస్థితి, భూగర్భ జలాల లభ్యత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని వర్షాకాలం సాగు ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
-మెదక్ మున్సిపాలిటీ
వానకాలం కోసం సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. జూన్ మొదటి వారంలో వానలు కురవకముందే రైతులకు ఏ మేరకు ఎరువులు, విత్తనాలు అవసరం, అందుకు అనుగుణంగా అందించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించారు. 2019 వానకాలంలో జిల్లాలో 2లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు 45, 450 క్వింటాళ్ల విత్తనాలు సబ్సిడీపై అందించేందుకు ఏజెన్సీలకు ఇండెంట్లు పంపాలని నిర్ణయించారు. జిల్లాకు 35 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో సాగునీటి వనరుల పరిస్థితి, భూగర్భ జలాల లభ్యత తదితర అంశాలను పరిగనలోకి తీసుకుని వానకాలం సాగు ప్రణాళిక రూపకల్పన చేశారు. జూన్ మొదటి వారంలో తొలకరి పలకరించడానికి ముందే రైతులు ఎరువులు, విత్తనాలను సిద్ధం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఏ పంటలకు ఏ మేరకు విత్తనాలు, ఎరువులు అవసరమవుతాయో వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

వరి తగ్గితే... ఆరుతడి పంటలపై మొగ్గు...
2019 వానకాలం సాగు ప్రణాళికలో వరిపంట విస్తీర్ణం గత వానకాలం కంటే తగ్గితే ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న పంటలు పండించే అవకాశం ఉన్నది. ఈ వానకాలం వరి 90వేలు ఎకరాలు సాగు చేయనున్నారని, మొక్కజొన్న 45వేల ఎకరాలు, అలాగే పత్తి 35వేల ఎకరాల్లో పంటలు పండిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. జొన్న ఒకవెయ్యి ఎకరాలు, పెసర్లు 3వేల ఎకరాలు, కందులు 3వేలు ఎకరాలు, మినుములు ఒకవెయ్యి ఎకరాలు, ఉల్లి 900 ఎకరాలు, చెరుకు 3వేల ఎకరాల్లో పంటలు పండించే అవకాశం ఉన్నది.
అందుబాటులోకి విత్తనాలు.. ఎరువులు..
వానకాలం ప్రారంభం కాకముందే విత్తనాలు, ఎరువులు సరఫరా చేసేందుకు వ్యవసాయశాఖ సమాయత్తమవుతున్నది. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులకు కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఏ మేరకు సబ్సిడీ విత్తనాలు అవసరమవుతాయన్న విషయమై అంచనాకు వచ్చిన వ్యవసాయశాఖ.. ఆయా ఏజెన్సీలకు ఇండెంట్లు పంపటంలో నిమగ్నమయ్యారు. 2019 వానకాలానికి అవసరమైన ఎరువుల్లో చాలా వరకు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించడంతో రానున్న వానకాలం సాగుకు విజయవంతం చేయాలన్న సంకల్పంతో వ్యవసాయ శాఖ ఉన్నది.

ఈ- వ్యవసాయం..
వ్యవసాయ సమాచారం కావాలంటే ఇంటర్‌నెట్‌లోని వెబ్‌సైట్ www.agrisnet.gov.nic.inలోకి వెళ్లి మీ ప్రశ్న, మా జవాబు అనే దానిపై క్లిక్‌చేసి పేరు రిజిస్ట్రారు చేసుకున్న రైతులకు వ్యవసాయ పథకాలు, రాయితీలు, ఎరువుల ధరలు, పంట యాజమాన్యం, సమగ్ర యాజమాన్యం, శ్రీవరి సాగు, డ్రమ్‌సీడర్, విత్తనాలు వెదజల్లే పద్ధతి, సేంద్రియ వ్యవసాయంపై అనేక అంశాలను తెలుసుకోవచ్చు. అలాగే పంటలకు వచ్చే తెగుళ్ల నివారణ చర్యలు తెలుసుకునే వీలుంది. చదువడం ఇబ్బంది పడే రైతులైతే ఈ వ్యవసాయం ప్రదేశంలోని పంటపై క్లిక్‌చేస్తే చాలు ఆడియో రూపంలో సమాచారం వస్తుంది.

భూసార పరీక్ష ఫలితాలు...
భూసార పరీక్ష ఫలితాలు సైతం కంప్యూటర్‌లో పొందుపరుస్తున్నారు. భూసార పరీక్షలు చేయించుకున్న రైతులు మట్టి నమూనాలను సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రాలకు తీసుకొచ్చి ఇస్తే సంబంధిత రైతులకు ఒక కోడ్‌ను కేటాయిస్తారు. పది రోజుల్లో వాటి ఫలితాలు, ఏఏ పంటలు వేయాలి, ఏ మందులు ఎంత మోతాదులో వేయాలో ఆయా శాస్త్రవేత్తలు ఇంటర్‌నెట్‌లో పొందుపరుస్తారు. రైతులు అక్కడకు వెళ్లకుండానే నేరుగా ఇంటర్‌నెట్‌తో ఆ ఫలితాలను తెలుసుకోవచ్చు. భూసార పరీక్షా ఫలితాలు తెలుసుకోవాలంటే www.agrisnet.ig.nic.in అని టైప్ చేసి అందులో భూసార అంశంపై క్లిక్ చేయాలి. అందులో జిల్లా, మండలం, గ్రామం, కోడ్ నంబర్ వస్తుంది. దానిపై వివరాలు నమోదు చేస్తే భూసార ఫలితాలు వస్తాయి.

110
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...