ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేయండి


Sat,May 18, 2019 12:50 AM

-అవసరమైన సామగ్రి సమకూర్చుకోవాలి
-తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి
-రిటర్నింగ్ అధికారులతోకలెక్టర్ ధర్మారెడ్డి సమీక్ష
మెదక్ కలెక్టరేట్: ఈనెల 27వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో జెడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవోలతో కలెక్టర్ ఓట్ల లెక్కింపు నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓట్ల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో మూడు విడుతల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం జరిగిందన్నారు. మూడు డివిజన్లలో ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంల్లో భద్రపరచడం జరిగిందన్నారు. ఓట్ల లెక్కింపునకు అవసరం ఉన్న సిబ్బందిని సత్వరం నియమించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే కౌంటింగ్‌కు అవసరమయ్యే సామగ్రిని సమకూర్చు కోవాలని అధికారులకు సూచించారు. ఎంపిక చేసిన కౌంటింగ్ సూపర్‌వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్‌లకు ఫలితాల లెక్కింపునకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగు సూచనలు చేసేందుకు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద అవసరమైన పోలీసు బందోబస్తుకు పోలీసు అధికారులకు సమాచారం అందించాలన్నారు. కౌంటింగ్ విధులకు కేటాయించిన ఉద్యోగులు అందరూ సమిష్టిగా కృషి చేసి ఓట్ల లెక్కింపు ప్రక్రియ విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో లక్ష్మీబాయి, డీపీవో హనోక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

భూరికార్డులపై జాయింట్ కలెక్టర్ ఆరా..
పాపన్నపేట: పాపన్నపేట తహసీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం మెదక్ జాయింట్ కలెక్టర్ నగేశ్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన భూరికార్డులను పరిశీలించారు. ముఖ్యంగా అన్నారం గ్రామానికి చెందిన భూరికార్డులను ప్రత్యేకంగా తెప్పించుకుని సమగ్రంగా పరిశీలించారు. ఇదిలా ఉండగా శుక్రవారం మండల పరిధిలోని ఆరేపల్లి, కుర్తివాడ గ్రామాల శివారులోని మంజీరానది నుంచి పెద్దఎత్తున అక్రమంగా రవాణా చేయడానికి నిల్వ ఉంచిన ఇసుకను ఈ రోజే తహసీల్దార్ కార్యాలయం వద్ద టెండర్లు వేయడానికి ఏర్పాట్లు చేశారు. జేసీ నగేశ్ వచ్చిన విషయం గమనించిన ఆయా గ్రామాల్లో ఇసుక నిల్వ ఉంచిన వారు జేసీ నగేశ్‌ను కలిసి తాము మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి మంజీరానది నుంచి ఇసుక తీసుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఆయనను కోరగా, ఆయన స్పందిస్తూ మంజీరానది నుంచి ఇసుక తీసుకెళ్లడానికి ఎంతటివారికైనా అనుమతించే ప్రసక్తేలేదని హెచ్చరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి ఇసుక అవసరం అనుకుంటే చెరువులు, కుంటల నుంచి ఇసుక తీసుకోవడానికి పంచాయతీ కార్యదర్శుల అనుమతి తీసుకొని నిర్మించుకోవాల్సిందిగా సలహా ఇచ్చారు. అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు వారానికి రెండు మూడు సార్లు మంజీరానది పరివాహక ప్రాంతంలో ఇసుక తీయకుండా పర్యవేక్షించాల్సిందిగా తహసీల్దార్ బలరాంను జేసీ ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ బలరాం రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...