గెలుపెవరి సోంతమో


Thu,May 16, 2019 12:47 AM

మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :జిల్లా పరిషత్‌ పోరు పరిసమాప్తమైంది. మొత్తం 20 జెడ్పీటీసీ, 189 ఎంపీటీసీ స్థానాలకు మూడు విడుతల్లో ఎన్నికలు నిర్వహించారు. మొదటి విడుతలో ఆరు మండలాల్లో ఈ నెల 6వ తేదీన, రెండో విడుతలో ఆరు మండలాల్లో 10వ తేదీన, మూడో విడుత 14వ తేదీన ఎనమిది మండలాలకు ఎన్నికలు జరిగాయి. మొదటి విడుతలో 77.78శాతం, రెండో విడుతలో 80.85 శాతం, మూడో విడుతలో 76.89శాతంగా పోలింగ్‌ నమోదైంది. జిల్లాలో మొత్తం మంది 4,90,211 ఓటర్లు ఉండగా మూడు విడుతల్లో జరిగిన ఎన్నికల్లో 3,81,941మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడు విడుతల్లో సాగిన పరిషత్‌ ఎన్నికల ఫలితాలు బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమై ఉన్నాయి.

బ్యాలెట్‌ బాక్సులు స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో పటిష్ఠ భద్రత మధ్య భద్రపర్చారు. సీసీ కెమెరాల నిఘాలో పోలీసు సిబ్బంది 24గంటలు గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ నెల 27వ తేదీన అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. తొలి విడుత పరిషత్‌ ఎన్నికలు జరిగిన ఆరు మండలాల్లో 79,807 మంది పురుషులు, 85,035 మంది మహిళలు, మొత్తం 1,64,342 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉండగా ఇందులో 63,299 పురుషులు, 64,525 మంది మహిళలు, మొత్తం 1,27,824 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండో విడుతలోని ఆరు మండలాల్లో 80,513 పురుషులు, 77,842 మహిళలు, మొత్తం 1,58,355 మంది ఓటర్లలో 63,519 పురుషులు, 62,787 మహిళలు, మొత్తం 1,26,306 మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.

తుది విడుత జరిగిన ఎనమిది మండలాల్లో 81,510 పురుషులు, 86,002 మహిళలు, మొత్తం 1,67,514 మంది ఓటు వేయాల్సి ఉండగా 62,691 పురుషులు, 65,120 మహిళలు, మొత్తం 1,27,811 మంది ఓటర్లు ఓటు వేశారు. తొలివిడుత ఎన్నికలు జరిగిన హవేళిఘనపూర్‌, అల్లాదుర్గం, టేక్మాల్‌, రేగోడ్‌, పాపన్నపేట, పెద్దశంకరంపేట మండలాల బ్యాలెట్‌ బాక్సులను మెదక్‌లోని వెలుగు పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపర్చారు. రెండో విడుతలో ఆరు మండలాలకు ఎన్నికలు జరుగగా ఐదు మండలాలు అయిన చిలిపిచెడ్‌, కొల్చారం, శివ్వంపేట, కౌడిపల్లి, నర్సాపూర్‌ల బ్యాలెట్‌ బాక్సులను తునికిలోని మహాత్మా జ్యోతిరావుపూలే విద్యాలయంలోని స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపర్చారు.

వెల్దుర్తి మండలానికి చెందిన బ్యాలెట్‌ బాక్సులను తూప్రాన్‌లోని నోబుల్‌ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచారు. తుది విడుత జరిగిన ఎనమిది మండలాలకు ఎన్నికలు జరుగగా అందులో నాలుగు మండలాలైన మెదక్‌, చిన్నశంకరంపేట, రామాయంపేట, నిజాంపేట బ్యాలెట్‌ బాక్సులను మెదక్‌లోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో భద్రపర్చారు. మిగిలిన నాలుగు మండలాలు తూప్రాన్‌, మనోహరాబాద్‌, చేగుంట, నార్సింగి బ్యాలెట్‌ బాక్సులను తూప్రాన్‌లోని నోబుల్‌ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లలో కట్టుదిట్టమైన భద్రత నడుమ భద్రపర్చారు. జిల్లాలో పరిషత్‌ పోలింగ్‌ ముగియడంతో అభ్యర్థుల గెలుపోటములపై జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. తమ పార్టీ అభ్యర్థి గెలుపొందుతాడని, తమ పార్టీ అభ్యర్థి గెలుస్తాడనే ధీమాలో ఎవరికి వారుగా లెక్కలు వేసుకుంటున్నారు. ఎవరి భవితవ్యం ఏమిటనేది బ్యాలెట్‌ బాక్సులో నిక్షిప్తమై స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో భద్రతాబలగాల మధ్య భద్రంగా ఉన్నాయి. ఈ నెల 27వ తేదీన ఓట్ల లెక్కింపులో అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...