కొత్త మండలాల్లో తొలి ప్రాదేశిక ఎన్నికలు


Fri,April 26, 2019 12:09 AM

మెదక్, నమస్తే తెలంగాణ : చిన్న జిల్లాలతోనే ప్రజలకు సుపరిపాలన అందుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2016లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి సంగారెడ్డి, సిద్దిపేటలు జిల్లాలుగా ఆవతరించాయి. వీటితో పాటే కొత్త మండలాలు, గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన మండలాల్లో తొలిసారిగా ప్రాదేశిక ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపొందిన తొలి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీల పేర్లు రికార్డుల్లో నిలిచిపోనున్నాయి. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఎలాగైనా గెలువాలన్న పట్టుదలతో వ్యూహప్రతివ్యూహాలు పన్నుతున్నారు. జిల్లాలో హవేళిఘనపూర్, నిజాంపేట, నార్సింగి, చిలిపిచెడ్, మనోహరాబాద్ మండలాలు ఏర్పడ్డాయి. గతంలో ఈ కొత్త మండలాలు ఇతర మండలాల పరిధిలో గ్రామాలుగా కొనసాగాయి. వీటికి ఎంపీటీసీలు ప్రాతినిథ్యం వహించే వారు. ప్రస్తుతం ఇవి కొత్త మండలాలుగా ఏర్పడటంతో వీటికి జెడ్పీటీసీలు, ఎంపీపీలు ప్రాతినిథ్యం వహించనున్నారు. మండలాల్లో తొలిసారిగా జెడ్పీటీసీ ఎన్నికలు జరుగనుండటంతో ఇక్కడి స్థానాల్లో గెలిచే వారు మండలాల మొదటి జెడ్పీటీసీగా వారి పేరు చిరకాలం నిలిచిపోనున్నది. అదే విధంగా ఈ మండలాల పరిధిలో గెలిచే ఎంపీటీసీల్లో ఎవరో ఒకరు ఎంపీపీ పీఠాన్ని అదిష్టించనున్నారు. ఎంపీటీసీల సభ్యుల మద్దతుతో ఎన్నికయ్యే ఎంపీపీలు తొలి ఎంపీపీగా రికార్డుల్లో నిలిచిపోనున్నారు.

జిల్లాలో 5 కొత్త మండలాలు ఇలా..
మెదక్ ఉమ్మడి మండలం నుంచి హవేళిఘనపూర్ మండలం ఏర్పడింది. రామాయంపేట ఉమ్మడి మండలం నుంచి నిజాంపేట ఏర్పటైంది. చేగుంట మండలం నుంచి నార్సింగి మండలం ఏర్పడింది. కౌడిపల్లి మండలం నుంచి చిలిపిచెడ్ మండలం ఏర్పడింది. తూఫ్రాన్ మండలం నుంచి మనోహరాబాద్ మండలం ఏర్పడింది. కొత్తగా ఏర్పడిన మండలాలకు పాత మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రాదేశిక ఎన్నికల్లో గెలిచేవారు ఈ మండలాలకు కొత్త జెడ్పీటీసీ సభ్యులుగా, ఎంపీపీలుగా ప్రాతినిథ్యం వహించనున్నారు.

విజయమే లక్ష్యంగా...
కొత్తగా ఏర్పడిన మండలాల్లో తొలి జెడ్పీటీసీ సభ్యుడిగా, మొదటి ఎంపీపీగా ఎన్నిక కావాలనుకుంటున్న ఆశావహులు విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. జెడ్పీటీసీ స్థానం, ఎంపీపీ రిజర్వేషన్‌ను పరిగణలోకి తీసుకుంటున్న ఆశావహులు తమకే జెడ్పీటీసీ టికెట్‌ను కట్టబెట్టాలంటూ ఆయా పార్టీల అగ్రనేతలపై ఒత్తడి తీసుకొస్తున్నారు. మొదటి ఎంపీపీగా పేరు తెచ్చుకోవడం కోసం ఎంపీటీసీగా అవకాశం కల్పించాలంటూ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇందులో ఎవరికి ఏ పీఠం వరిస్తుందో తెలియాలంటే మే 25వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...