పుస్తకాల లెక్క పక్కా..


Tue,April 23, 2019 12:19 AM

మెదక్ మున్సిపాలిటీ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు వచ్చేశాయి. ఇటీవలే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠ్యపుస్తక విక్రయ కేంద్రానికి చేరుకున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు అందజేయాలని యోచిస్తున్నారు. పుస్తకాల పంపిణీలో అవకతవకలు జరుగకుండా పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నారు. గతంలో పర్యవేక్షణ లోపం కారణంగా ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టాయి. బహిరంగ మార్కెట్‌లో పెద్ద ఎత్తున అమ్మకాలు కూడా జరిగాయి. అలా కాకుండా ఈ సారి ఒక్క పుస్తకం లెక్క తప్పకుండా బార్ కోడింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. పుస్తకాలు ఎప్పుడు పంపిణీ చేయాలనే కచ్చితమైన ఆదేశాలు రాకున్నప్పటికీ పాఠశాల పునఃప్రారంభం రోజున విద్యార్థుల చేతికి అందించేందుకు చర్యలు చేపట్టారు.

జిల్లాకు అవసరమైన పుస్తకాలు..
జిల్లాలో 625 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 97 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి 6,02,517 పాఠ్య పుస్తకాలు అవసరమవుతాయి. గత సంవత్సరం మిగిలిపోయిన 34,521 పుస్తకాలు పోను 5,67,996 పుస్తకాలు కావాల్సి ఉంటుంది. వీటిలో 2,51,550 పుస్తకాలు (40శాతం) ఈ నెల 15వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని బుక్‌డిపోకు చేరాయి. ఇంకా 3,16,446 పుస్తకాలు రావాల్సి ఉన్నది.

అవకతవకలు జరుగకుండా బార్ కోడింగ్ విధానం...
పుస్తకాల పంపిణీలో అవకతవకలు, పక్కదారి పట్టడం, ప్రైవేట్ పుస్తక దుకాణాల్లో విక్రయాలు ఏటా జరుగుతున్న తంతు. ఈ సారి వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం బార్ కోడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. పుస్తకంపై కోడ్ నెంబర్ ముంద్రించారు. ఆ నంబర్ ప్రకారం హైదరాబాద్‌లోని ప్రిటింగ్ ప్రెస్ నుంచి ఏ జిల్లాలకు ఏ నెంబర్లు చేరాయో పక్కగా లెక్కల్లో తెలిసిపోతుంది. జిల్లా నుంచి ఏయే మండలాలకు, అక్కడి నుంచి ఏ పాఠశాలలకు వెళ్లాయో ఈ బార్‌కోడ్ నెంబర్‌ను బట్టి చూడొచ్చు. పుస్తకంపై ముద్రించిన వరుస సంఖ్యను బట్టి చూస్తే ఏ విద్యార్థికి చేరిందో రికార్డుల్లో ఉంటాయి. విద్యార్థులకు పంపిణీ చేసిన పుస్తకాల వివరాలను విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి అందించాల్సి ఉంటుంది. గతంలో వేసవి సెలవులకు ముందే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. దీంతో విద్యార్థులు ఇంటికి తీసుకెళ్లేవారు. ఈ సారి అలాకాకుండా పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు అందించాలనుకుంటున్నారు.


జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు : 625
చదువుతున్న విద్యార్థుల సంఖ్య : 97వేలు
కావాల్సిన పాఠ్యపుస్తకాలు : 5,67,996
ఇప్పటి వరకు వచ్చినవి : 2,51,550
ఇంకా రావాల్సినవి : 3,16,446

వచ్చే నెల మొదటి వారంలో పంపిణీ చేస్తాం...: శ్రీకాంత్, పాఠ్యపుస్తకాల జిల్లా మేనేజర్
జిల్లాకు ఇప్పటికే 2,51,550 పుస్తకాలు వచ్చాయి. ఇంకా 3,16,446 పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉన్నది. అవి కూడా వారం పది రోజుల్లో వస్తాయి. విద్యార్థులకు మే మొదటి వారంలో పుస్తకాలను పంపిణీ చేస్తాం. ఈ సారి బార్ కోడింగ్ విధానం ప్రవేశపెట్టడంతో పుస్తకాలు పక్కదారి పట్టే అవకాశం లేదు. ప్రభుత్వం నుంచి పుస్తకాలు పంపిణీకి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఆదేశాలు రాగానే ముందుగా బుక్ డిపో నుంచి ఎంఈవోలకు అందజేస్తాం. అక్కడి నుంచి ప్రధానోపాధ్యాయులకు పంపిస్తారు.

133
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...