టికెట్ దక్కేనా...


Mon,April 22, 2019 12:13 AM

-అభ్యర్థుల ఎంపికలో రాజకీయ పార్టీలు
-పోటీలో ఉద్యోగుల భార్యలు, రిటైర్డ్ ఉద్యోగులు
-మహిళా స్థానాలపై ఆసక్తి
-ఎంపీపీ రిజర్వేషన్‌కు అనుకూలంగా జనరల్ స్థానాలపై దృష్టి
-వరుస విజయాలతో టీఆర్‌ఎస్‌లో జోష్
-విపక్ష పార్టీలకు అభ్యర్థులు కరువు
-జిల్లాలో 189 ఎంపీటీసీ, 20 జెడ్పీటీసీ స్థానాలు
-20 ఎంపీపీ, జెడ్పీచైర్‌పర్సన్ గెలుపు దిశగా అభ్యర్థుల ఎంపిక
టేక్మాల్ : పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడులైంది. నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీగా ఎవరు పోటీ చేయాలో స్పష్టత వచ్చింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు ఎవరు బరిలో ఉంటారన్న విషయంపైనే గ్రామాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా గ్రామాల్లో ఎవరెవరు పోటీచేస్తారో కూడా తేలిపోయింది. స్థానిక ఎన్నికలపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. మండల, జిల్లాస్థాయి రాజకీయాల్లో గుర్తింపు ఎంపీపీ, జెడ్పీటీసీలతో ఉండటంతో విశ్రాంత ఉద్యోగులు సైతం పోటీకి ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు ఊరిలో రాజకీయాలను చూసేవారే తప్ప మరెవరూ అటువైపూ వెళ్లేవారు కాదు. కానీ మారిన పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ఆర్థికంగా స్థిరపడ్డవారు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నవారు గ్రామాల్లోని పదవులపై కన్నేశారు. తాము కాకపోతే తమ కుటుంబీకుల్లో ఎవరినైనా నిలబెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. రిజర్వేషన్ల స్థానాల్లో కొన్నిచోట్ల ఆశావహులు ఎక్కువగా ఉండగా, మరికొన్ని చోట్ల రిజర్వేషన్ల స్థానాల్లో అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా...
సర్పంచ్, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘనవిజయం సాధించడంతో పరిషత్ ఎన్నికలను ఆయా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. తమ తమ పార్టీల తరఫున నిలబెట్టిన వ్యక్తి గెలుపు కోసం ఇప్పటినుంచే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికైతే విజయావకాశాలు ఉంటాయన్న కోణంలో అభ్యర్థుల ఎంపిక కోసం తీవ్ర కసరత్తే చేస్తున్నారు. దీంతో ముఖ్యనేతలు అభ్యర్థులను వెతికే పనిలోపడ్డారు. జనరల్‌కు కేటాయించనున్న స్థానాల్లో ఎక్కువగా ఎంపీపీ రిజర్వేషన్‌కు అనుగుణంగా అభ్యర్థులు బరిలో నిలవడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఎవరిని ఎంపిక చేయాలనే విషయమై పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. పరిషత్ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో తీవ్రమైన పోటీయే కల్పిస్తుంది. ముఖ్యంగా అధికార పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొంది. ఒక్కో ఎంపీటీసీకి నలుగురు, ఐదుగురు ఆశావహులు ఉన్నారు.

మహిళా స్థానాల్లో...
పరిషత్ ఎన్నికల్లో మహిళలకు రిజర్వు అయిన స్థానాల్లో పాగా వేసేందుకు ఆయా పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అధికార పార్టీలో జనరల్ స్థానాల్లో పోటీ అధికంగా ఉంది. మహిళలకు రిజర్వు అయిన స్థానాల్లో పోటీ అధికంగా ఉన్నప్పటికీ జనరల్ స్థానాలతో పోల్చినప్పుడు తక్కువగా ఉండటంతో ఆయా గ్రామాల్లో తమకు అనుకూలంగా ఉండే అభ్యర్థులను వెతికే పనిలో పడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రిజర్వు అయిన స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయడం సమస్యగా మారుతోంది. ఇద్దరు పిల్లల నిబంధన చాలా మందికి అవకాశాలు లేకుండా చేస్తున్నాయి. ఇలాంటి సమస్యలున్న చోట యువతులకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చేందుకు ఆస్కారం ఉంది. ప్రధాన నాయకులకు అత్యంత సన్నిహితులుగా ఉండే కార్యకర్తలు, నాయకుల కుటుంబాలకు చెందిన మహిళలను అభ్యర్థులుగా బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు కేటాయించిన గ్రామాల్లో తమకు అనుకూలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

జనరల్ స్థానాలపై బీసీల చూపు..!
గ్రామపంచాయతీల ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆసక్తి ఉన్న వారికి రిజర్వేషన్ల విషయంలో కొన్ని చోట్ల కలిసిరాలేదు. బీసీ రిజర్వేషన్లు వస్తాయని ఆశించిన చోట జనరల్, ఇతర కేటగిరి కావడంతో ఒక్కింత నిరాశే ఎదురైంది. అయినప్పటికీ జనరల్ స్థానాల్లో బీసీలు పోటీ చేసేందుకు అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా పోటీలో ఉండేందుకు రాజకీయ సమీకరణలు ఊపందుకున్నాయి. పరిషత్ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరుగుతుండటంతో ఎన్నికల్లో గెలువాలనే లక్ష్యంతో పార్టీలు ముందుకెళ్తున్నాయి. రాజకీయపార్టీల అండదండలతోపాటు వ్యక్తిగత పలుకుబడి, సమాజంలో పేరుప్రతిష్టలు ఉన్నచోట్ల జనరల్ స్థానాల్లో సైతం బీసీ వర్గానికి చెందిన వారు పోటీచేసేందుకు సమాయత్తం అవుతున్నారు. అలాగే ఎంపీపీ రిజర్వేషన్లు ఉన్న చోట జనరల్ స్థానాల్లో ఎంపీటీసీగా పోటీచేసి ఎంపీపీ పదవి కోసం ముందుగానే ప్రణాళికలు చేసుకుంటున్నారు. దీంతో చాలా చోట్ల జనరల్ స్థానాల్లో ఇతర వర్గాల వారు బరిలో నిల్చునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

బరిలో విశ్రాంత ఉద్యోగులు..
మారుతున్న కాలంలో ప్రభుత్వ ఉద్యోగులు సైతం రాజకీయాల వైపు ఆసక్తి చూపుతున్నారు. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో వెళ్లడానికి ఉద్యోగం అడ్డంకి కావడంతో తమ భార్యలను, బంధువులను ఎన్నికల బరిలో నిలుపుతున్నారు. రిజర్వేషన్ల ఆధారంగా పోటీ చేయించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విశ్రాంత ఉద్యోగులు నేరుగా రాజకీయాల్లోకి వస్తున్నారు. రిజర్వేషన్లు అనుకూలించిన చోట వారే నేరుగా పోటీలో ఉంటున్నారు. నగరాల్లో ఆర్థికంగా స్థిరపడిన వారు నేరుగా పోటీ చేయడమా లేక తమ బంధువులను, సన్నిహితులను బరిలో ఉంచడమా.. అనే విషయాలపై చర్చిస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగులు సైతం ఈ సారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదువులు ఉన్నతంగా ఉండటం, మండల, జిల్లా స్థాయిలో గుర్తింపు వచ్చేందుకు అవకాశం ఉండటం వల్ల విశ్రాంత ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు.

వరుస విజయాలతో టీఆర్‌ఎస్‌లో జోష్..
వరుస ఎన్నికల్లో గెలుపుతో ఉత్సాహంగా ఉన్న టీఆర్‌ఎస్ శ్రేణులు పరిషత్ ఎన్నికల్లోనూ అదే జోష్‌ను చూపాలనే ఉత్సాహంతో ఉన్నారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే గెలుపొందారు. సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఇదే జోష్‌తో పరిషత్ ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించాలని, జిల్లాలోని 189 ఎంపీటీసీ స్థానాల్లో , 20 ఎంపీపీ స్థానాలు, 20 జెడ్పీటీసీలను గెలుపొంది జడ్పీచైర్‌పర్సన్ టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవాలనే సంకల్పం టీఆర్‌ఎస్ శ్రేణుల్లో నెలకొన్నది. ఆ దిశగా విజయం సాధించడానికి ఎమ్మెల్యేలు, జిల్లా నాయకుల నేతృత్వంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నది. ఒక్కో ఎంపీటీసీ స్థానానికి టీఆర్‌ఎస్‌లో నలుగురు, ఐదుగురు ఆశావహులు ఉన్నారు. కానీ విపక్షాలకు ఎక్కడో ఒక చోట అభ్యర్థులు ఉన్నా పోటీ చేయడానికి పెద్దగా వారు ఆసక్తికనబర్చడం లేదు.

170
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...