రూ.36.74 కోట్లతో తాలెల్మ ఎత్తిపోతల పథకం


Mon,April 22, 2019 12:08 AM

-భూములన్నీ సస్యశ్యామలం చేయడమే టీఆర్‌ఎస్ లక్ష్యం...
-తాలెల్మ ఎత్తిపోతల పనులను పరిశీలించిన ఎమ్మెల్చే క్రాంతి కిరణ్
అందోల్, నమస్తే తెలంగాణ: బీడు భూములను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎత్తిపోథల పథకం ద్వారా చెరువులను నింపేందుకు శ్రీ కారం చుట్టిందని అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. అందోలు మండల పరిధిలోని తాలెల్మ గట్టు వద్ద రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకం పనులను ఆదివారం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పరిశీలించారు. సింగూర్ బ్యాక్ వాటర్ నుంచి తాలెల్మ వరకు ఏర్పాటు చేయనున్న పైపులైన్ ఏర్పాటుకు సంబంధించిన పూర్తి వివరాలను అక్కడున్న లిఫ్ట్ ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి తెలసుకున్నారు. వచ్చే పంటకాలంలోపు తాలెల్మ ఎత్తిపోతల పనులను పూర్తిచేయాలని, దేవునూర్, టేక్మాల్, రాయికోడ్, మునిపల్లి, రేగోడ్ మండలాల్లో ఎత్తిపోతల పథకం పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎత్తిపోతల ద్వారా పైపులైన్‌లను ఏర్పాటు చేసి చెరువులను నింపి, మారుమూల గ్రామాల్లోని భూములను సాగులోకి తీసుకురావడమే టీఆర్‌ఎస్ లక్ష్యమన్నారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయాంలో రైతాంగానికి పెద్దపీట వేసిందని, సాగుకు నీటిని అందించడమే లక్ష్యంగా కోట్లాది రూపాయలను వెచ్చించి ప్రాజెక్టులను, ఎత్తిపోతల పనులను చేపడుతుందన్నారు. తాలెల్మ లిఫ్ట్ ఇరిగేషన్ పథ కం ద్వారా సింగూర్ బ్యాక్ వాటర్‌ను 0.117 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అనుమతులను ఇచ్చిందన్నారు. ఎత్తిపోతల పథకం పనులకు గాను రూ.36.74 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, ఈ పనులు పూర్తయితే నియోజకవర్గంలోని అందోలు, అల్లాదుర్గం, వట్‌పల్లి, టేక్మాల్ మండలాల పరిధిలోని 14 గ్రామాల్లోని 40 చెరువుల్లోకి పుష్కలంగా నీరు వచ్చి చేరుతుందని, తద్వారా ఆయా చెరువుల కిందనున్న ఆయకట్టు 3 వేల ఎకరాలకు పైగా భూములు సాగులోకి వస్తాయన్నారు. పనుల్లో వేగం పెంచాలని, రెండు మాసాల్లోగా పూర్తిచేసేలా చూడాలని, ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన అధికారులకు సూచించారు. అనంతరం రైతులతో కలిసి మాట్లాడారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులకు రైతులు సహకరించాలన్నారు. పనులు పూర్తయితే సాగు నీటికి ఢోకా ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఆయనతో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ శ్రీనాథ్, ఏఈ విజయ్ సాగర్, సర్పంచ్ లింగాగౌడ్, జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి, నాయకులు విజయ్‌కుమార్, నాగరాజ్, కృష్ణాగౌడ్‌లతో పాటు తదితరులు ఉన్నారు.

కెనాల్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
వట్‌పల్లి: తాలెల్మ ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు సాగునీరు అందించేందుకు నిర్మిస్తున్న ఎత్తిపోతల పనులను ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆదివారం పరిశీలించారు. మండలంలోని సాయిపేటలో నిర్మిస్తున్న కెనాల్‌ను పరిశీలించి అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు సాఫీగా పంటలను సాగుచేసుకోవాలనే లక్ష్యంతో పైపుల ద్వారా సాగునీటిని అందించడం జరుగుతుందన్నారు. నిర్మాణం పనులను త్వరగా పూర్తిచేసి రైతులకు సాగునీరందించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.

135
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...