నేటి నుంచి నామినేషన్లు


Mon,April 22, 2019 12:07 AM

-ఆరు మండలాల్లో ఎన్నికలు
-65 ఎంపీటీసీ స్థానాలు,ఆరు జెడ్పీటీసీ స్థానాలు
-ఆరు మండలాల్లో మొత్తం ఓటర్లు 1,63,469
-339 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు..
-ఎన్నికల్లో పాల్గొననున్న 1826 మంది సిబ్బంది
మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నగారా మోగించింది. శనివారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో మొదటి విడుత ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుండగా మే6న ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. నామినేషన్ల స్వీకరణ కోసం ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో ఎన్నికల అధికారులను నియమించిన ఎన్నికల అధికారులు, నామినేషన్ల స్వీకరణ కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ స్థానాల వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఆయా ఎంపీటీసీ స్థానాల నామినేషన్లను ఎన్నికల అధికారులు తీసుకోనున్నారు. నేటి నుంచి ఈ నెల 24 వరకు నామినేష్లను స్వీకరిస్తారు.

25న నామినేషన్ల పరిశీలన చేసి అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నవారిని గుర్తించి నామినేషన్లు వేసిన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. 26న అభ్యర్థులపై అభ్యంతరాలు, ఇతర విజ్ఞప్తులను స్వీకరణ, 27న అభ్యంతరాలు, విజ్ఞప్తుల పరిశీలన చేసి 28 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 3గంటల అనంతరం పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు. జిల్లాలోని 20 మండలాలకు గాను మొదటి విడుతలో మెదక్ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో హవేళిఘనపూర్, పాపన్నపేట, పెద్ద శంకరంపేట, అల్లాదుర్గం, టేక్మాల్, రేగోడ్ మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి.

ఆరు మండలాల పరిధిలో మొత్తం 65 ఎంపీటీసీ స్థానాలు, ఆరు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా 339 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు వాటిని పరిశీలించి ఎన్నికల నిర్వహణ కోసం అన్ని చర్యలు చేపట్టారు. 339 పోలింగ్ కేంద్రాల్లో 339 మంది రిటర్నింగ్ అధికారులతో కలిపి ఎన్నికల్లో 1826 మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. మరో 10శాతం మంది ఎన్నికల సిబ్బంది అందుబాటులో ఉంటారని జిల్లా అధికారులు తెలిపారు. ఏదేని అత్యవసర పరిస్థితుల్లో పోలింగ్ సిబ్బందికి సమస్యలు తలెత్తితే అదనపు సిబ్బంది విధులను నిర్వహిస్తారన్నారు. ఎన్నికలు జరిగే ఆరు మండలాల్లో 1,63,469 మంది ఓటర్లు 65 ఎంపీటీసీ స్థానాలు, ఆరు జెడ్పీటీసీ స్థానాల అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. మే6న ఎన్నికలు, 27న ఫలితాలు వెలువడనున్నాయి.

126
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...