మోగిన స్థానిక నగారా


Sat,April 20, 2019 11:47 PM

- రేపు తొలి విడుత ఎన్నికల నోటిఫికేషన్
- సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ
- మండల కేంద్రాల్లోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీల నామినేషన్లు
- మే 6,10,14 తేదీల్లో పోలింగ్
- మే 27న ఓట్ల లెక్కింపు

మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జెడ్సీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. జిల్లాలో మూడు విడుతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. జిల్లాలో 189 ఎంపీటీసీ,20 జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ రేపు (సోమవారం 22వ తేదీ) విడుదల చేసి, మే 6న పోలింగ్ నిర్వహిస్తారు. ఈ నెల 26న రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి మే 10న పోలింగ్, తుది దశ ఎన్నికల నోటిఫికేషన్ 30న విడుదల చేసి మే 14న పోలింగ్ నిర్వహిస్తారు. ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి వేర్వేరు బ్యాలెట్ బాక్సులు ఉంటాయి. జెడ్పీటీసీ స్థానానికి గరిష్ఠ వ్యయపరిమితి రూ.4 లక్షలు, ఎంపీటీసీ స్థానానికి రూ.1.50 లక్షలు. ఈ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తారు. మండల కేంద్రాల్లోనే ఎంపీటీసీ, జడ్పీటీసీల నామినేషన్లు స్వీకరిస్తారు. మే 27న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.

పరిషత్ ఎన్నికలకు నగారా మోగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు మూడు విడుతల్లో ఎన్నికలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 22వ తేదీన మొదటి విడుత, 26న రెండోవిడుత, 30న మూడోవిడుత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మొదటి విడుతలో టేక్మాల్, పెద్దశంకరంపేట, రేగోడ్, అల్లాదుర్గం, పాపన్నపేట, హవేళీఘనపూర్, రెండో విడుతలో కొల్చారం, కౌడిపల్లి, చిలిపిచేడ్, నర్సాపూర్, శివ్వంపేట, వెల్దుర్తి, మూడో విడుతలో మెదక్, రామాయంపేట, చేగుంట, చిన్నశంకరంపేట, నార్సింగి, నిజాంపేట, తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 189 ఎంపీటీసీ, 20 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఇందుకోసం జిల్లాలో 1032 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారి, అసిస్టెంట్ పోలింగ్ అధికారి, ఇతర సిబ్బంది ఇలా మొత్తం దాదాపుగా విడుతల వారీగా రెండు వేల ఎన్నికల సిబ్బంది విధులను నిర్వహించనున్నారు.

ప్రధాన ఘట్టం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ నెల 22వ తేదీన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో మొదటి విడుత ఎన్నికలకు అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది. రెండోవిడుత 26వ తేదీన, మూడోవిడుతకు 30వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్లను స్వీరించడం జరుగుతుంది. ఎన్నికలకు దీంతో గ్రామాల్లో పదవుల కోసం ముందుకువచ్చే వారి సంఖ్య పెరుగుతుంది. ఎలాగైనా టికెట్ సాధించాలని నేతలు ఇప్పటి నుంచే తమ తమ ప్రయత్నాలు ప్రారంభించారు. అసెంబ్లీ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయ ఢంకా మోగించింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఇప్పటికే రాజకీయ వేడి ఊపందుకున్నది. ఎలాగైనా సీట్లు దక్కించుకునేందుకు నేతల ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఎలాగైనా టీఆర్‌ఎస్ మద్దతుతో పోటీ చేసేందుకు ఆశావహులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే గెలుపు గుర్రాల కోసం ఆయా పార్టీల నేతలు అన్వేషణ మొదలు పెట్టారు.

రిజర్వేషన్ల ప్రక్రియ ఇలా...
జిల్లా పరిషత్, మండల పరిషత్ పోరుకు సర్వం సిద్ధమైంది. కొత్త జిల్లాలు, మండలాల ప్రాతిపదికన జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల పునర్విభజన పూర్తవగా కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియను అధికార యంత్రాంగం ఇప్పటికే పరిసమాప్తం చేసింది. జిల్లా పరిషత్ రిజర్వేషన్లను రాష్ట్రస్థాయి యూనిట్‌గా ఖరారు చేశారు. కలెక్టర్ సారథ్యంలో ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు పూర్తిచేశారు. ఎంపీటీసీ స్థానాలకు ఆయా రెవెన్యూ డివిజన్ అధికారుల ఆధ్వర్యంలో మండల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను వర్తింపజేశారు. ఇందులో మొత్తం 50శాతం మహిళలకు కేటాయించారు. మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ బీసీ మహిళకు కేటాయించారు. జిల్లాలో మొత్తం 20 జడ్పీటీసీ స్థానాలు ఉండగా ఇందులో ఎస్సీ3 (మహిళ2 - జనరల్1), ఎస్టీ2 (మహిళ1 - జనరల్1), బీసీ5 (మహిళ2 - జనరల్3), జనరల్10 (మహిళ5 - జనరల్5) స్థానాల్లో రిజర్వేషన్ కల్పించారు. జిల్లాలో మొత్తం 189 ఎంపీటీసీ స్థానాల్లో ఎస్సీ 33 (మహిళ 17 - జనరల్16), ఎస్టీ23 (మహిళ17 - జనరల్6), బీసీ 43 (మహిళ20 - జనరల్23), జనరల్ కేటగిరిలో 90 స్థానాలు (మహిళ40 - జనరల్50) కేటాయించారు. మహిళలకు 50 శాతం స్థానాల్లో రిజర్వేషన్ కల్పించారు.

అందరి చూపు టీఆర్‌ఎస్ వైపు...
సర్పంచ్ ఎన్నికల్లో మెదక్ జిల్లాలో టీఆర్‌ఎస్ జయకేతనం ఎగురవేసింది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తు లేకపోయిన టీఆర్‌ఎస్ మద్దతు పొందిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు విజయం సాధించారు. ఎన్నికలు ఏవైనా వెన్నంటి వుంటాం అనే విధంగా ప్రజలు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కి పట్టం కడుతున్నారు. పరిషత్ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండటంతో టీఆర్‌ఎస్ తరఫున పోటీచేయడానికి ఆశావహులు అధికమవుతున్నారు.

మూడు విడుతల్లో పరిషత్ ఎన్నికలు..
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను మూడు విడుతల్లో నిర్వహించనన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందుకోసం షెడ్యూల్‌ను ప్రకటించింది. తొలిదశ ఈ నెల 22న, రెండోదశ 26న, మూడోదశ 30వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మొదటి విడుత ఎన్నికలు మే6వ తేదీన, రెండోవిడుత మే10న, మూడో విడుత మే 14న ఎన్నికలు జరుగనున్నాయి. మెదక్ జిల్లాలో 20 మండలాల్లో మొదటి విడుతలో ఆరు మండలాలు, రెండో విడుతలో ఆరు మండలాలు, మూడో విడుతలో 8 మండలాల ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ఫలితాలను మే27న ప్రకటించనున్నారు. మొదటి విడుత ఎన్నికల్లో ఆరు మండలాల్లో 339 పోలింగ్ కేంద్రాల్లో 1,63,469 మంది, రెండోవిడుతలో ఆరు మండలాల్లో 337 పోలింగ్ కేంద్రాల్లో 1,55,750 మంది, మూడో విడుతలో 8 మండలాల్లో 356 పోలింగ్ కేంద్రాల్లో 1,65,776 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు..
పరిషత్ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు అవసరమైన బ్యాలెట్ బాక్సులను ఇప్పటికే అధికారులు సిద్ధం చేసి ఉంచారు. పంచాయతీ ఎన్నికల్లో వినియోగించిన బ్యాలెట్ బ్యాకులను ఈ ఎన్నికల్లో వినియోగించనున్నారు. ఎంపీటీసీ గులాబీ రంగు, జడ్పీటీసీ తెలుపు రంగులో బ్యాలెట్ పేపర్లు ఉండనున్నాయి.

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...