పండుగ శోభ


Sat,April 20, 2019 12:21 AM

- జిల్లావ్యాప్తంగా ఘనంగా గుడ్‌ఫ్రైడే వేడుకలు
- మెదక్ చర్చిలో తెల్లవారుజామునుంచే ప్రార్థనలు
- హనుమాన్ జయంతి సందర్భంగా అనేకచోట్ల భారీ ర్యాలీలు
- మెదక్ పంచముఖి ఆలయంలో బారులుతీరిన భక్తులు

మెదక్‌నెట్‌వర్క్ : ఒకవైపు గుడ్‌ఫ్రైడే, మరోవైపు హనుమజ్జయంతి వేడుకతో చర్చిలు, ఆలయాలు సందడిగా మారాయి. ళెఖూకవారం తెల్లవారుజామునుంచే ప్రఖ్యాత మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించారు. హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లావ్యాప్తంగా అనేకచోట్ల భారీ ర్యాలీలు నిర్వహించారు. జై శ్రీరామ్.. జై భజరంగ్‌బళీ నినాదాలతో ఊరూవాడా హోరెత్తాయి. హనుమాన్ ఆలయాల్లో ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. మెదక్ పంచముఖి ఆలయంలో భక్తులు బారులు తీరారు. రెండు పండుగలు ఒకేసారి రావడంతో సందడి రెట్టింపైంది.

జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోని ఆయా గ్రామాల్లో శుక్రవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాషాయ జెండాలతో హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించి జై హనుమాన్... జైజై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆయా మండలాల్లోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు, భజనలు చేశారు. ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందచేశారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులు అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

మెదక్, నమస్తే తెలంగాణ : ఏసు ప్రభువు మార్గాన్ని జ్ఞానిస్తూ ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని... సకల జనులకు రక్షకుడిగా పరలోకం నుంచే ఏసు దీవెనలిస్తున్నాడని మెదక్ బిషప్ రెవరెండ్ సాలోమాన్‌రాజ్ అన్నారు. శుభ శుక్రవారం పురస్కరించుకుని మెదక్ మాహా దేవాలయంలో ఉదయం 11.30 గంటలకు శిలువను ఊరేగించారు. ప్రార్థనల అనంతరం భక్తులను ఉద్దేశించి బిషప్ దైవ సందేశం చేశారు. శిలువ వేయబడ్డ ఏసుప్రభువు గుడ్‌ఫ్రైడే రోజునే పరలోకానికి వెళ్లాడని, ఆ నాటి నుంచే పరలోకం నుంచే విశ్వానికి రక్షకుడిగా ఉన్నాడన్నారు. ఈ సందర్భంగా శిలువపై మరణానికి ముందు పలికిన ఏడు మాటలను భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా రోలాండ్‌పాల్ ఆధ్వర్యంలో ఏసయ్య భక్తిగీతాలు ఆలపించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో జిల్లాలోని భక్తులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి వచ్చిన భక్తులతో మహా దేవాలయం కిటకిటలాడింది. వేసవి దృష్టిలో ఉంచుకుని ఫిలిగ్రీమ్ మేనేజర్ జాయ్‌ముర్రే, చర్చి కమిటీ సభ్యులు భక్తులకు నీటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కార్యక్రమాలలో బిషప్ సతీమణి వజ్రమ్మ, చర్చి ప్రెసిబేటరీ ఇన్‌చార్జి రెవరెండ్ అండ్రూస్ ప్రేమ్ సుకుమార్, పాస్టర్లు సుశీల్‌కుమార్, రాజశేఖర్, దయానంద్, విజయ్‌కుమార్, సీఎస్‌ఐ కమిటీ సభ్యులు రోలాండ్‌పాల్, గెలెన్, సాలోమాన్, ప్రభుదయాల్, సువన్‌డగ్లస్, శాంతికుమార్, కొమ్ము రాజు, సువన్ డగ్లస్, ఉదయ్‌కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

138
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...