ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలన


Sat,April 20, 2019 12:17 AM

తూప్రాన్ రూరల్ : జిల్లాలో 20 జెడ్పీటీసీలకు,189 ఎంపీటీసీ స్థానాలకు మూడు విడుతలుగా ఎన్నికలు జరుగనున్నాయని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా బ్యాలెట్ బాక్సులు భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ చేసే కేంద్రాల్లోని టేబుళ్ల ఏర్పాటు గురించి జెడ్పీ డిప్యూటీ సీఈవో లక్ష్మీబాయి, డీపీవో హనోక్‌తో కలిసి శుక్రవారం రాత్రి ఆయన పరిశీలించారు. తూప్రాన్ మండలం అల్లాపూర్ శివారులోని గురుకుల పాఠశాల భవనం, మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట శివారులోని నోబుల్ కాలేజీలను వారు పరిశీలించారు. స్ట్రాంగ్‌రూం, కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న టేబుళ్ల ఏర్పాటుకు సంబంధించి అవసరమైన గదులను పరిశీలించారు. పరిశీలించిన కేంద్రాల్లో మౌలిక వసతులు ఉన్నాయా..? గదులకు డోర్‌లు సక్రమంగా ఉన్నాయా..? లేదా..? పార్కింగ్ సౌకర్యం, కౌంటింగ్‌కు వచ్చే సిబ్బంది, ఏజెంట్‌లు, భద్రతా సిబ్బందికి గదులు సరిపోతాయా..? స్ట్రాంగ్ రూంలకు భద్రత ఉంటుందా..? అన్న దోరణీలో ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. తూప్రాన్ డివిజన్ పరిధిలోని తూప్రాన్, మనోహరాబాద్, వెల్దుర్తి, చేగుంట, నార్సింగి మండలాలకు ఒకే కేంద్రం సరిపోతుందా..? లేదా అనే వివరాలను క్షుణ్ణంగా పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంలను పరిశీలించడం జరుగుతుందన్నారు. తూప్రాన్ డివిజన్ పరిధిలోని 5 మండలాలకు ఒకేచోట కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు. స్ట్రాంగ్ రూంలు వాటికి పక్కనే కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తూప్రాన్ డివిజన్‌కు సంబంధించి అల్లాపూర్ గురుకుల పాఠశాల, లింగారెడ్డిపేటలోని నోబుల్ కాలేజీలను పరిశీలించడం జరిగిందన్నారు. అయితే ఒక స్ట్రాంగ్ రూంకు ఒకటి లేదా రెండు టేబుళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఎంపీడీవో అరుంధతి, డీఈ నర్సింహులు, సిబ్బంది రాజశేఖర్‌రెడ్డి, ప్రసాద్, దత్తాత్రేయశర్మతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...