మీ ఇంటి భద్రత మీ చేతుల్లోనే..


Sat,April 20, 2019 12:16 AM

సంగారెడ్డి కల్చరల్: దొంగలు పడ్డాక కుక్కలు మొరిగిన చందంగా కాకుండా ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఇంటికి తాళంవేసి నిశ్చింతగా ఊరెల్లే రోజులు ఎప్పుడో పోయాయి. ఇంటికి తాళం వేసి ఉంటే తిరిగివచ్చే సరికి ఇల్లుగుల్ల కావడం ఖాయం. చేతులు కాలాక ఆకులు పట్టుకునేకంటే ముందుగానే గట్టి భద్రత ఏర్పరచుకోవడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంటిభద్రతపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇంటికి ఎంత పెద్ద తాళంవేసినా, ఎంతటి గట్టి భద్రతను కల్పించినా దొంగలు ఏదో ఒక విధంగా దోచుకెలుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. పోలీసుల నిఘా, కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీసుల గస్తీ కారణంగా కొద్దిమేర దొంగతనాలు తగ్గినప్పటికీ ఏదో ఒకచోట ఇండ్లలో చోరీలు జరుగుతూనే ఉన్నాయి. ఊళ్ళకు వెళ్లే సందర్భాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు కరపత్రాలు, ఆటోల ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ అడపాదడపా దొంగలు తమ చేతికి పనిచెబుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటి భద్రతపై ప్రత్యేక కథనం మీ కోసం.

అందుబాటులో ఆధునిక పరికరాలు...
ఇంటి భద్రత కోసం ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంటి కిటికీలు, తలుపులు, గేట్లు, ఇంటి పరిసరాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన గాడ్జెట్లు, పరికరాలతో ఇంటిని భద్రంగా ఉంచుకోవచ్చు. దీని మార్కెట్‌లో అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ పరికరాలు నగరంలోని పేరెన్నికగన్న దుఖాణాల్లో వారెంటీ పిరియడ్‌తో అందుబాటులో ఉండగా, మరికొన్ని ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంది. ఆ పరికరాలు ఎలా ఉంటాయి, వాటి పనితీరు, నాణ్యతపై మరింత సమాచారం మీ కోసం.

సీసీ కెమెరాలు...
సీసీ కెమెరాలు దొంగతనాలను నిరోధించడంతో ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. వీటిని ఇంటి పరిసరాలతో పాటుగా ఇంటి బయట, గేటువద్ద అమర్చుకోవచ్చు. ఫలితంగా ఇంటి పరిసరాల్లో, గేటుమందు అనుమానితులు తిరుగుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వవచ్చు. అలాగే దొంగతనాలు జరిగిన సందర్భాల్లో కూడా సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా వారిని పట్టుకునేందుకు ఆస్కారం ఉంది. ప్రతీ కాలనీల్లో ఇప్పటికే పోలీసులు అవగాహన కలిగిస్తూ సీసీ కెమెరాలను బిగిస్తున్నారు.

సెక్యూరిటీ అలారం...
సెక్యూరిటీ అలారం టెలిఫోన్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ అలారం వ్యవస్థను, మీ భద్రతను పర్యవేక్షించే సెక్యూరిటీ కంపెనీతో అనుసంధానం చేస్తారు. ఒకవేళ ఇంట్లోకిగాని వ్యాపార సముదాయంలోకిగాని దొంగలు ప్రవేశిస్తే సంబంధిత కంపెనీకి సిగ్నల్స్ వెలతాయి. ఈ సెక్యూరిటీ కంపెనీలో సుశిక్షితులైన గార్డులు 24గంటలు అందుబాటులో ఉండడం వల్ల వెంటనే అప్రమత్తమవుతారు. ఫలితంగా దొంగలను ఇట్టే పట్టుకునే వీలుంది.

సెక్యూరిటీ షెట్టర్స్...
దొంగలు తరుచుగా కిటికీల్లోంచే ప్రవేశిస్తుంటారు. కాబట్టి కిటికీలకు, ప్రధాన ద్వారంవద్ద సెక్యూరిటీ షెట్టర్స్ ఏర్పాటు చేసుకుంటే ఇంటికి ఎంతో భద్రతగా ఉంటుంది. వీటిని ఏర్పాటు చేసుకుంటే ఇంట్లోకి ప్రవేశించే వీలుండదు. వీటిని స్టీలు, అల్యూమీనియమ్ ఫౌడర్ కోటెడ్ ఫ్రేమ్‌లతో తయారు చేస్తారు. షట్టర్లను తెరవడం మూయడం మ్యానువల్‌గా లేక రిమోట్ సిస్టమ్‌ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. వీటిలో ప్రత్యేక ఏమిటంటే బయటి వ్యక్తులకు ఇంట్లోని వారు కనిపించరు. కాని, ఇంట్లోని వ్యక్తులకు మాత్రం బయటి వ్యక్తులు కనిపిస్తారు.

మోషన్ డిటెక్టర్...
మోషన్ డిటెక్టర్‌తో దొంగతనాలకు చెక్ పెట్టవచ్చు. దొంగలు ఇంట్లోకి ప్రవేశించడానికి వీలున్న తలుపులు, కిటికీల ఆవరణలో ఈ పరికరాన్ని బిగించుకోవచ్చు. ఈ పరికరం కరెంట్‌తో పాటుగా బ్యాటరీలతోకూడా పనిచేస్తుంది. దీన్ని బిగించిన చుట్టు ప్రక్కలకు ఎవరొచ్చినా ఇది పెద్దగా అలారమ్ శబ్దం వస్తుంది. ఇంటికి గడియ లేక తాళంవేసి పనిమీద బయటకు వెల్లినా ఇది ఇంటికి రక్షణ కవచంలా ఉంటుంది. ఇంట్లోకి అపరిచితులు వచ్చారని ఫీడ్‌చేసిన సెల్‌ఫోన్‌కు సమాచారం పంపిస్తుంది. పోలీసులకు సైతం సిగ్నల్స్ అందజేస్తుంది. కాబట్టి దొంగలు ఇంట్లోకి ప్రవేశిస్తే మాత్రం కాలికి బుద్దిచెప్పాల్సిందే.

ఆటోమెటిక్ సెక్యూరిటీ గేట్...
సెక్యూరిటీ గేట్లుకూడా ఇంటికి భద్రతను కల్పిస్తాయి. ఈ తరహా ఆటోమేటిక్ సెక్యూరిటీ గేట్లను మ్యాన్‌వల్‌గాగాని లేక వందల అడుగుల దూరంనుంచి రిమోట్‌తోకూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది బ్యాటరీ సహాయంతో పనిచేస్తుంది. కాబట్టి కరెంట్ నిలిచిపోయినా భయపడాల్సిన అవసరం లేదు. దీనిలో ఆటోమేటిక్ లాక్ సౌకర్యంకూడా ఉంది. కాబట్టి దొంగలు అంత సులభంగా ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉండదు.

వేలి ముద్రల తలుపులు...
ఇటీవల వేలి ముద్రల డోర్లుకూడా అందుబాటులోకి వచ్చాయి. డోర్లను తయారుచేసి వాటికి థంబ్ ఇప్రెషన్‌ను ఫీడ్ చేస్తారు. ఫలితంగా ఎవరి వేలి ముద్రలు ఫీడ్ చేసామో వారు మాత్రమే దానిపై వేలుముద్ర వేసినప్పుడు డోర్లు తెరుచుకుంటాయి. కాబట్టి అలాంటి డోర్లు తెరుచుకోవాలంటే ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ ఆ మిషన్‌పై వేలి ముద్రలు ఫీడ్ చేయాల్సి ఉంటుంది. ఒకరి వేలి ముద్రలే ఫీడ్‌చేస్తే ఆ సభ్యుడు వచ్చేవరకు ఇంటిబయటే వేచిఉండాల్సి ఉంటుంది.

అప్రమత్తతతోనే నేరాల నియంత్రణ...
దొంగతనం జరిగాక బాదపడేకంటే ముందుగా తగు జాగ్రత్తలు తీసుకోవడం మేలు. ఇటీవల మార్కెట్‌లో లభ్యమవుతున్న అధునాతన పరిజ్ఞానంతో తయారు చేసిన గాడ్జెట్‌లను ఇంట్లో అమర్చుకుంటే ఇల్లు గుల్లకాకుండా నివారించుకోవచ్చు. అలాగే ఒకవేళ ఊరికి వెల్లాల్సిన సందర్భాల్లో ఇంటి ప్రక్కలవారికి, సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇస్తే బాగుంటుంది. అందుబాటులో ఉన్న నాణ్యమైన గాడ్జెట్‌లను ఇంటికి అమర్చుకుంటే ఇంటికి రక్షాకవచంగా మార్చుకోవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు.


66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...