సమస్యను పరిష్కరించండి


Sat,April 20, 2019 12:16 AM

కొల్చారం: రెవెన్యూ అధికారుల తప్పిదానికి కొల్చారం మండలం వరిగుంతం గ్రామానికి చెందిన మంగలి భాస్కర్ గత ఎనిమిది సంవత్సరాలుగా ఎక్కని గడప లేదు... తన తాత మంగలి కిష్టయ్య కొన్న భూమి రెండేళ్ల తర్వాత మ్యుటేషన్ ఆరేండ్లు తాత పేరిట వచ్చింది. తాత మరణానంతరం తన తండ్రి మంగలి చంద్రయ్య పేరిట ఫౌతివిరాసత్ కావాల్సి ఉండగా 2007 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు బదిలీ అయిన ఎనిమిది మంది తహసీల్దార్‌లను ఆశ్రయించినా ఫలితం లేదు. అట్టి భూమి తన తాతకు అమ్మినవారి పేరు మీద కూడా లేకపోగా కొత్త వ్యక్తుల పేరు మీద రావడంతో కంగుతిన్నాడు. 2017 సెప్టెంబర్ 15న సీఎం కేసీఆర్ ప్రారంభించిన భూమి రికార్డుల ప్రక్షాళనతో తన కష్టాలు గట్టెక్కుతాయనుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్యం రెవెన్యూ కార్యాలయం చుట్టూర ప్రదక్షిణలు తప్పడం లేదు. అయినా వారి భూసమస్య పరిష్కారం లభించకపోవడంతో నమస్తే తెలంగాణ ధర్మగంటను ఆశ్రయించాడు.

వివరాల్లోకి వెళ్లితే వరిగుంతం గ్రామానికి చెందిన మంగలి కిష్టయ్య 1999వ సంవత్సరంలో గుడ్డెలుగుల మౌలానా దగ్గర డాక్యుమెంటు నెంబర్ 308/99 ద్వారా సర్వే నెంబర్166/ఇ, విస్తీర్ణం: 0-15గుంటలు, 167/రు,విస్తీర్ణం: 0-13 1/2 గుంటలు కొనుగోలు చేయగా, రెండు సంవత్సరాల తర్వాత అప్పటి తహసీల్దార్ ఉత్తర్వులు నెంబర్: బి/3267/2001 ద్వారా మంగలి కిష్టయ్య పేరిట మ్యుటేషన్ చేశాడు. అప్పటి నుంచి 2007 వరకు మంగలి కిష్టయ్య పేరిట వచ్చిన భూమి ఆయన మరణానంతరం అతడి కుమారుడు మంగలి చంద్రయ్య పేరిట ఫౌతి చేయాలని దరఖాస్తు చేశాడు. 2007వ సంవత్సరం నుంచి 2010 వరకు రెవెన్యూ రికార్డుల్లో అట్టి భూమి ఎవ్వరి పేరిట లేకపోగా, 2010వ సంవత్సరం నుంచి అమ్మినవారు గుడ్డేలుగుల మౌలానా పేరు కాని, కొనుగోలు చేసుకుని మ్యుటేషన్ చేసుకున్న మంగలి కిష్టయ్య పేరిట గాని కాకుండా ఇతరుల పేరిట ఆ భూమి రికార్డుల్లో మారిపోయింది. ఈ విషయమై ఎన్నోసార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి మంగలి చంద్రయ్య కొడుకు మంగలి భాస్కర్ ఎన్నో అర్జీలు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. 2017 సెప్టెంబర్ 15 నుంచి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన భూమి రికార్డుల ప్రక్షాళనలో అర్జీ పెట్టుకున్నప్పటికీ అట్టి భూమి మంగలి చెంద్రయ్య పేరిట ఫౌతి కాలేదు. ప్రభుత్వం నుంచి రైతుబంధు రాలేదు.
అలాగే అదే రైతు అదే గ్రామానికి చెందిన తిమ్మగల్ల పోచయ్య, తిమ్మగల్ల లింగయ్యల దగ్గర సర్వేనంబర్ 170,171లలో విస్తీర్ణం 0-12 గుంటల భూమిని 13-3-2013వ తేదీన సాదాబైనామా ద్వారా కొనుగోలు చేశాడు. 2014 జూన్2 వతేదీ వరకు తెల్ల కాగితాలపై కొనుగోలు చేసిన భూముల క్రమబద్దీకరణ కోసం ప్రభుత్వం మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అవకాశం ఇవ్వగా, దరఖాస్తు చేసుకున్నప్పటికీ క్రమబద్ధీకరించలేదు.

ఒకే రైతుకు డబుల్ ఖాతాలు ఉండవద్దని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ స్థానిక వీఆర్వో నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా ఇదే రైతు మంగలి చంద్రయ్యకు 1636 ఖాతా ద్వారా కొత్త పట్టాదారు పాసుపుస్తకం నెంబర్: టీ08060141023, మరో ఖాతా నంబర్ 58 ద్వారా పాసుపుస్తకం నంబర్ : టీ 08060140042లు ఇచ్చారు. వీటన్నింటిని సరిచేయాలని ఎన్నిసార్లు కొల్చారంలోని తహసీల్దార్ కార్యాలయం చుట్టూర తిరిగాను. గ్రామంలో నిర్వహించిన గ్రామసభల్లో దరఖాస్తులు ఇచ్చాను. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలు చేసినా ఫలితం లేదు.

ఫౌతి విరాసత్ చేయడానికి ఎన్నేండ్లు:
- ముత్యంగారి హన్మంత్, వరిగుంతం గ్రామ రైతు
వరిగుంతం గ్రామానికి చెందిన రైతు ముత్యంగారి వెంకయ్య 1998 సెప్టెంబర్ 11వ తేదీన చనిపోయాడు. అతని పేరిట కింది సర్వే నెంబర్లలో 285, 295, 323, 553, 577, 270, 278, 312, 479, 410లలో విస్తీర్ణం 4 ఎకరాల 25 గుంటలు ఉంది. అతని మరణానంతరం తన పేరిట ఫౌతివిరాసత్ చేయాలని అతడి కుమారుడు ముత్యంగారి హన్మంత్ పలు మార్లు వీఆర్వోలకు అర్జీలు చేసుకున్నాడు. జమీన్‌బందీ దరఖాస్తు 25-02-2015, మీ సేవలో ఫౌతి కోసం 18-09-2017 తేదీన దరఖాస్తులు చేసుకున్నాడు. 22-12-18వ తేదీన గ్రామంలో తీర్మానం చేసినా ఇప్పటి వరకు అతని పేరిట మారలేదు. ప్రభుత్వం రైతులకు ఇస్తున్న పెట్టుబడి సహాయం రైతుబంధు రాలేదు. అలాగే తన పేరిట ఫౌతి చేయాలని దరఖాస్తు చేసుకున్నా కాలేదు. కాని అదే భూమి సర్వే నెంబర్ 553లో మరో రైతు బాలయ్యో శేఖర్ పేరుమీద ఎలాంటి ఆధారం లేకుండా రెవెన్యూ అధికారులు పట్టామార్పిడి చేశారు. ఇదెక్కడి న్యాయం కలెక్టర్ అక్రమాలకు పాల్పడుతున్న రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.

121
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...