జెడ్పీ పీఠాలన్నీ టీఆర్‌ఎస్‌వే..


Thu,April 18, 2019 11:30 PM

దుబ్బాక టౌన్ : జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్‌లను టీఆర్‌ఎస్సే గెలుచుకుంటుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. గురువారం దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో సాయినాథ హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలతో కలిసి పాల్గొన్నారు.

అనంతరం ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ... సిద్దిపేట, మెదక్ జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం గత బుధవారం హైదారాబాద్‌లోని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి స్వగృహంలో జరుగగా, ఎన్నికల్లో అవలంభించాల్సిన విధానాలను ఇప్పుడు చర్చించామన్నారు. అన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీల స్థానాల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలుచుకునే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. ప్రతి జడ్పీటీసీ స్థానాన్ని టీఆర్‌ఎస్సే గెలుస్తుంది... ప్రతి జిల్లా పరిషత్ పీఠాలను టీఆర్‌ఎస్సే గెలుస్తుందన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలైందన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కార్యకర్తలు బాగా పని చేశారని హరీశ్‌రావు కితాబునిచ్చారు. ప్రతి కార్యకర్తకు పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు.
ఎంపీక చేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల గెలుపు కోసం తాము కష్టపడుతామని.. సమన్వయంతో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హరీశ్‌రావు అన్నారు. వందశాతం టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులే గెలిచే విధంగా ప్రచారం ముందుకు సాగుతామన్నారు. ప్రజలు కారు గుర్తుకే ఓటు వేసేందుకు సిద్దంగా ఉన్నారని.. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో చూపించిన ఆదరణను స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం చూపించేందుకు సిద్ధ్దంగా ఉన్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్లు ఆశించే కార్యకర్తలు ఎక్కువగా ఉన్నారని... టికెట్లను ఆశించడం తప్పులేదని.. కానీ, అన్ని సమీకరణలు సరిచూసి టికెట్లను స్థానిక ఎమ్మెల్యేలు కేటాయిస్తారని తెలిపారు. టికెట్లు రానివారికి పార్టీలో సముచిత గౌరవం ఉంటుందని హామీ ఇచ్చారు. దేవాలయ, మార్కెట్ కమిటీల్లో, రాష్ట్రస్థాయి నామినేటెడ్ పోస్టుల్లో స్థానం కల్పిస్తామని.. ఈ విషయాన్ని కార్యకర్తలు సైతం సహృదయంతో అర్థం చేసుకోవాలని హరీశ్‌రావు కోరారు. కొద్దిపాటి ఓపికతో వ్యవహరిస్తే ప్రత్యూమ్నాయ అవకాశం కల్పిస్తామన్నారు.

ప్రభాకర్‌రెడ్డికి 4 లక్షల ఓట్ల మెజార్టీ ఖాయం...
రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో మెదక్ ఎంపీగా కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలువబోతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నామినేషన్ వేసిన రోజే గెలుపు ఖాయమైపోయిందని, భారీ మెజార్టీయే లక్ష్యంగా పని చేశామని తెలిపారు. ప్రతిపక్షాలు ఎప్పుడో చేతులెత్తేశాయని, ప్రతి టీఆర్‌ఎస్ కార్యకర్త సమస్వయంతో పని చేయడం తోనే ప్రభాకర్‌రెడ్డి 4 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా చేగుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బానాపురం కృష్ణారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో చిట్టాపూర్ సర్పంచ్ పోతనక రాజయ్య, ఎంపీపీ ర్యాకం పద్మాశ్రీరాములు, నాయకులు రొట్టె రాజమౌళి, ఆసస్వామి, బాలకిషన్‌గౌడ్, ఆసయాదగిరి, టేకులపల్లి మల్లారెడ్డి, రణం శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు చిట్టాపూర్‌లో నిర్మించిన సాయినాథ హనుమాన్ ఆలయ సమీపంలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...