విపక్షాల్లో పరిషత్ గుబులు


Wed,April 17, 2019 11:40 PM

- విపక్ష పార్టీలకు ప్రజా స్పందన కరువు
- నోటిఫికేషన్‌కు ముందే నిరాసక్తత
- అధికార పార్టీలో టిక్కెట్ల కోసం పోటాపోటీ
- జిల్లా ఎన్నికల ఇన్‌చార్జిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
- గెలుపు బాధ్యత ఎమ్మెల్యేలపైనే..

మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: విపక్ష పార్టీలో పరిషత్ ఎన్నికలంటే గుబులు మొదలైంది... అసెంబ్లీ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాభవంతో పరిషత్ ఎన్నికల్లో ఎలా నెట్టుకురావాలో అర్థకాని పరిస్థితి నెలకొంది. ప్రజల్లో ఆశించిన స్పందన లేకపోవడం, ఆర్థికంగా భారం కావడంతో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే వెనకడుగు వేస్తున్నారు. మరోవైపు అధికార పార్టీలో ఆశావహుల పోటీ ఎక్కువైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసేందుకు పల్లెలో పోటాపోటీ నెలకొంది. గులాబీ పార్టీలో టికెట్లకోసం తీవ్ర పోటీ నెలకొంది. గెలుపు భాధ్యత పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ అప్పగించిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లాలో పరిషత్ ఎన్నికల కోసం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావును ఇన్‌చార్జిగా నియమించారు. టికెట్ల కోసం తమవంతుగా ప్రయత్నాలుగా ఎమ్మెల్యే మద్దతును కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఆశవహులు నిమగ్నమయ్యారు.

ఉమ్మడి మెదక్ జిల్లా పునర్విభజన అనంతరం మూడు జిల్లాలుగా ఏర్పడింది. మెదక్ జిల్లాలో 20 మండలాలు ఉన్నాయి. ఇందులో 189 ఎంపీటీసీ, 20 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. పరిషత్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ప్రభుత్వం మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. షెడ్యూల్‌నూ ఎన్నికల కమిషన్ రేపోమాపో విడుదల చేయనున్నది దీంతో గ్రామాల్లో ఎన్నికల వేడి మొదలైంది. ముఖ్యంగా అధికార పార్టీలోనే పోటాపోటీ నెలకొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ప్రభంజనం చూపింది. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉండటం... సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజల్లో పూర్తి సానుకూలత ఉంది. ఈ తరుణంలో అధికార పార్టీ నుంచి టికెట్ దక్కించుకుంటే తమ గెలుపు ఖాయమైనట్లేనని భావిస్తున్నారు. మెదక్, సిద్దిపేట జిల్లాలకు పరిషత్ ఎన్నికలకు ఇన్‌చార్జిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావుకు బాధ్యతలను అప్పగించారు. దీంతో ఆశావహులు అధికార పార్టీలోనే అధికంగా ఉన్నారు. ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని భావించి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకుల మద్దతు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

విపక్ష పార్టీల్లో నిరాసక్తత
టీఆర్‌ఎస్ పార్టీలో పోటీ చేయడానికి ఉత్సాహాన్ని చూపుతుంటే మరోవైపు కాంగ్రెస్, బీజేపీలో పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాభవం చెందడం, ప్రజల్లో ఆశించిన మేర అనుకూల స్పందన లేకపోవడంతో వెనకడుగు వేస్తున్నారు.

మూడు విడుతల్లో పరిషత్ ఎన్నికలు
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను మూడు విడుతల్లో జరపడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఇందుకోసం అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకోవడంతోపాటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లతో తాము సన్నద్ధంగా ఉన్నట్లు చెబుతుంది. ప్రధాన ఘట్టం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ఆశావహులు పోటికి సన్నద్ధమవుతున్నారు. దీంతో గ్రామాల్లో పదవుల కోసం ముందుకువచ్చే వారి సంఖ్య పెరుగుతుంది. ఎలాగైనా టికెట్ సాధించాలని నేతలు ఇప్పటి నుంచే తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. అసెంబ్లీ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. బరిలో ఎవరు నిలిచినా గెలుపు మాత్రం టీఆర్‌ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన వారిదేననే విధంగా పరిస్థితులు మారాయి. దీంతో ఎలాగైనా టికెట్ సాధించాలనే పనిలో నిమగ్నమయ్యారు.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు పోటీ తీవ్రం
జిల్లా పరిషత్‌కు జూలై5, మండల పరిషత్‌లకు జూలై 4లోగా కొత్త పాలక వర్గాలు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గడువులోపే ఎన్నికలు పూర్తి చేసి కొత్త పాలక వర్గాలు కొలువు దీరేలా అటు ఈసీ, ఇటు ప్రభుత్వం దృష్టి సారించింది. చిన్న జిల్లాలు కావడం, కొత్త మండలాలు ఏర్పాటు కావడంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ పదువులకు తీవ్రమైన పోటీ ఉంది. జిల్లాలో 189 ఎంపీటీసీ, 20 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్‌గా గెలుపొందాలంటే సగం కంటే ఎక్కువ సభ్యుల మద్దతు ఉండాలి. అయితే తక్కువ స్థానాలు ఉండటంతో గెలుపుపై ధీమాతో ఉన్నారు. దీంతో అందరి దృష్టి పరిషత్ ఎన్నికలపై పడింది. అలాగే కొత్త మండలాలు ఏర్పాటు చేయగా మండలాల విస్తీర్ణం తగ్గింది. దీంతో గ్రామాల సంఖ్య తగ్గడంతో జెడ్పీటీసీ సభ్యుడిగా గెలవడం సులభంగా మారింది. ఎంపీపీ పదవులకు సంబంధించి గతంలో ఎక్కువ మంది ఎంపీటీసీ సభ్యుల మద్దతు కూడగట్టాల్సి వచ్చేది. 3000-4000 జనాభా ప్రాతిపదికన ఎంపీటీసీ స్థానాలు ఖరారు చేశారు. అయితే కొత్తగా మండలాలు ఏర్పాటు కావడంతో చాలా మండలాల్లో గ్రామపంచాయతీలు తక్కువగా ఉన్నాయి. దీంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య తక్కువ సంఖ్యలో ఉన్నాయి.

జిల్లాలో అత్యల్పంగా నార్సింగి (కొత్తమండలం) 5 ఎంపీటీసీ స్థానాలు, తూప్రాన్ 5 స్థానాలు, చిలిపిచెడ్ (కొత్త మండలం) 6 స్థానాలు ఉన్నాయి. అత్యధికంగా పాపన్నపేటలో 15 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. తక్కువగా ఎంపీటీసీ స్థానాలు ఉన్న మండలాల్లో ఎంపీపీ పదవులను దక్కించుకోవడం చాలా సులువుగా ఉంది. అయితే ప్రతి మండలంలో అధిక స్థానాలను గెలుపొందే విధంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేయాల్సి ఉంది. దీంతో జిల్లాలో పరిషత్ ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యుల పదవులకు తీవ్రంగా పోటీ నెలకొంది. ఎంపీటీసీ స్థానాలకు తాము పోటీ చేసి గెలిస్తే ఇక ఎంపీపీ రిజర్వేషన్లకు అనుగుణంగా ఎంపీపీ పదవులను దక్కించుకోవడం సులభమవుతుందనే ఆలోచనలో ఆశావహులు ఉన్నారు. మరోవైపు జెడ్పీటీసీ సభ్యుడిగా గెలిస్తే జిల్లా పరిషత్ చైర్మన్ పదవీ దక్కించుకోవచ్చనే భావనతో పెద్ద సంఖ్యలో ఆశావహులు పరిషత్ ఎన్నికలపై ఆసక్తి చూపుతున్నారు.

206
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...