అన్ని మున్సిపాలిటీల్లో నర్సరీలు


Wed,April 17, 2019 11:38 PM

మెదక్ మున్సిపాలిటీ : సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం కింద ఇక నుంచి మున్సిపాలిటీల్లోనూ నర్సరీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేయనున్న నర్సరీలను మహిళా సంఘాల సభ్యులకు అప్పగించనుంది. దీని ద్వారా మహిళా సంఘాలకు ఉపాధి కల్పించడంతో పాటు మున్సిపల్ నిధులు హరితహారం కోసం సక్రమంగా వినియోగించేందుకు అవకాశం ఏర్పడనున్నది. జిల్లాలో మెదక్ మున్సిపాలిటీలో గత ఏడాది 10వేల మొక్కలను మాత్రమే నర్సరీలో ఏర్పాటు చేయగా, ఈ సంవత్సరం లక్ష మొక్కలను పెంచాలనే ఉద్దేశంతో నర్సరీలను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా కొత్తగా ఏర్పాటైన తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపాలిటీల్లో కూడా నర్సరీల పనులు వేగవంతం చేశారు. ఈ మొక్కల పెంపక కార్యక్రమం మెప్మా పర్యవేక్షణలో చేపట్టనున్నారు. గతంలో హరితహారం కింద ఇతర నర్సరీల నుంచి మొక్కలను కొనుగోలు చేసిన మున్సిపల్ అధికారులు, ఈ సారి హరితహారంలో మున్సిపాలిటీల్లో మహిళా సంఘాల వారు ఇండ్లల్లో పెంచుకునే మొక్కలనే కొనుగోలు చేయనున్నారు.

గ్రూపులుగా తయారు చేసి...
మహిళలను గ్రూపులుగా తయారు చేసి వారితో నర్సరీలను ఏర్పాటు చేయించేలా మున్సిపల్ కమిషనర్లు ప్రోత్సహిస్తున్నారు. ఒక్కో నర్సరీ ఏర్పాటుకు మొక్కలను బట్టి రూ.10వేల నుంచి రూ.30వేల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. నర్సరీలు ఏర్పాటు చేయాలంటే తగినంత స్థలం, నీటి వసతి, వాటి సంరక్షణ అవసరం ఉంటుంది. ఈ సౌకర్యాలు ఉన్న వారిని గుర్తించి వారికి మాత్రమే నర్సరీలు ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఎర్రమట్టి, కవర్లు, ఎరువు తదితర వాటిని సంబంధిత మహిళలే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. నర్సరీలో ఏర్పాటు చేసిన మొక్కలు పెంచిన సంబంధిత మహిళలకు ఒక్కో మొక్కకు రూ.10చొప్పున మున్సిపాలిటీ చెల్లిస్తుంది. మహిళలు ఎన్ని మొక్కలు పెంచినా వాటిలో బతికిన వాటికి మాత్రమే మున్సిపల్ అధికారులు డబ్బులు ఇస్తారు.

లక్ష మొక్కలను నాటడమే లక్ష్యం...
మెదక్ మున్సిపాలిటీ పరిధిలో హరితహారంలో భాగంగా లక్ష మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. గత ఏడాది కేవలం పది వేల మొక్కలు మాత్రమే నాటాం. ఈ సంవత్సరం లక్ష మొక్కలను నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మెప్మా అధికారుల పర్యవేక్షణలో మహిళా సంఘాల నాయకులకు నర్సరీలను ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తున్నాం. ఒక్కో మొక్కకు రూ.10 చొప్పున కొనుగోలు చేస్తాం.
- సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్, మెదక్

138
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...