టార్గెట్ 3జడ్పీలు


Tue,April 16, 2019 11:48 PM

-ఉమ్మడి జిల్లాలో అన్ని జెడ్పీటీసీలు, ఎంపీటీసీల గెలుపే లక్ష్యం
-అభ్యర్థుల ఎంపిక, గెలుపు బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలదే..
-పార్టీలో సమన్వయంతోపాటు అన్నిస్థానాలు గెలిపించేలా బాధ్యతలు అప్పగింత
-మెదక్, సిద్దిపేట జిల్లాలకు హరీశ్‌రావు
-సంగారెడ్డి జిల్లాకు శేరి సుభాష్‌రెడ్డికి బాధ్యతలు
-పరిషత్ పోరులో ఘనవిజయం సాధించాలని టీఆర్‌ఎస్ అధినేత దిశానిర్దేశం
-ఉమ్మడి జిల్లాలో 67 జెడ్పీటీసీ, 713 ఎంపీటీసీ స్థానాలు
-గెలుపు జోష్‌లో అధికార పార్టీ
సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికలకు టీఆర్‌ఎస్ పార్టీ సన్నద్ధమవుతుంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను గెలుచుకొని 3 జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకునే లక్ష్యంగా టీఆర్‌ఎస్ పార్టీ ముం దుకు వెళ్లనున్నది. సోమవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. సిద్దిపేట, మెదక్ జిల్లాలకు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, సంగారెడ్డి జిల్లాకు సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిలకు బాధ్యతలను అప్పగించారు. ఈ ఎన్నికల్లో అందరినీ సమన్వయం చేస్తూ మూడు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లను గెలిపించుకొని వచ్చే బాధ్యతను వారిపై పెట్టారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను ఎంపిక చేయడంతోపాటు గెలుపు బాధ్యతలను ఎమ్మెల్యేల పైనే పెట్టారు. పాత కొత్త వారిని అందరినీ సమన్వయం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేలా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లేలా కార్యాచరణ రూపొందించారు. కాగా, తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశానికి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ అభ్యర్థులు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, టీఆర్‌ఎస్ రాష్ట్ర బాధ్యులు హాజరయ్యారు.

ఉమ్మడి జిల్లాలో 67 జెడ్పీ స్థానాలు
జిల్లాల పునర్విభజన అనంతరం సిద్దిపేట, మెదక్ జిల్లా పరిషత్‌లు కొత్తగా ఆవిర్భవించాయి. ఉమ్మడి జిల్లాలో 67 జడ్పీ స్థానాలు, 3 జిల్లా పరిషత్‌లు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 25 జడ్పీటీసీలు, 295 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో 22 జడ్పీటీసీలు, 229 ఎంపీటీసీ స్థానాలు, మెదక్ జిల్లాలో 20 జడ్పీటీసీలు, 189 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 3 జిల్లా పరిషత్‌లపై గులాబీ జెండా ఎగురవేసేలా టీఆర్‌ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోట. ఎన్నికలేవైన ఇక్కడ గెలుపు టీఆర్‌ఎస్ పార్టీదే. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా పరిధిలోని 10శాసనసభ స్థానాలకు గాను 9 స్థానాలు టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకొని సత్తా చాటింది. అనంతరం వచ్చిన పంచాయతీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసి టీఆర్‌ఎస్ పార్టీ విజయఢంకా మోగించింది. నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వార్ వన్‌సైడ్‌గానే కొనసాగింది. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీల ప్రభావం నామమాత్రమే. ఇప్పటికే ఆయా పార్టీలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

151
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...