చోరీల నియంత్రణకు అన్ని చర్యలు


Tue,April 16, 2019 11:31 PM

-వేసవిలో దొంగలతో అప్రమత్తంగా ఉండాలి
-ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు శ్రేయస్కరం ఇప్పటికే 1510 సీసీ కెమెరాల ఏర్పాటు
-కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్‌కు
-సమాచారం ఇవ్వండి ఎస్పీ చందనదీప్తి
మెదక్ మున్సిపాలిటీ : వేసవి కాలంలో కాలనీల్లో, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు శ్రేయస్కరమని, కొత్తవారి కదలికలపై సమాచారం అందించాలని, వేసవిలో చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ చందనదీప్తి తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రివేళాల్లో వీధుల్లో పోలీసు సిబ్బంది గస్తీ తిరుగుతున్నారని, అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నామని అన్నా రు. వేసవి కాలం పెరిగిన ఎండలు.. పిల్లలకు సెలవులు ఉండడంతో చాలా మంది తమ తమ సొంత గ్రామాలకు ప్రయాణాలు చేస్తారని, అదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారని, వేసవిలో విహార యాత్రలు, తీర్ధ యాత్రలు, ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్ నంబర్‌ను సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులకు తెలుపాలన్నారు. ఊళ్లకు వెళ్లే వారు ఇంటిని గమనించమని ఇరుగు, పొరుగు, నమ్మకస్తులైన వారికి చెప్పి వెళ్ళాలని తెలిపారు. జిల్లా పోలీసులు నిఘా నేత్రం కింద ప్రజలు, వ్యాపారస్తుల సహకారంతో 1510 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, తద్వారా ఎన్నో నేరాలను ఛేదించామని అన్నారు.

అదే విధంగా ప్రజలు తమ కాలనీలు, ఇండ్లు, పరిసర ప్రాంతాల్లో, షాపింగ్ మాళ్లలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని తెలిపారు. కిటికీల వద్ద ఇంటి తాళాలు పెట్టి నిద్రించకూడదని, ఇంటి కిటికీలను మూసివేయాలని, వాటికి ఉన్న బోల్టులు సక్రమంగా ఉన్నాయా లేదో ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని తెలిపారు. బంగారు ఆభరణాలు ధరించి ఆరుబయట నిద్రించకూడదని, ఇంట్లో పడుకున్నా కిటికీలు తెరిచి ఉండే వైపు పడుకోరాదని, దుస్తుల్లో డబ్బులు పెట్టి కిటికీలకు, తలుపులకు తగిలించరాదని తెలిపారు. డాబా ఇండ్లపైన, ఆరుబయట చల్లగాలికి పడుకున్న వారి ఇండ్లలో దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రాత్రి సమయాల్లో ఆరుబయట పడుకోవడం దొంగల చేతికి తాళం ఇచ్చినట్టే అవుతుందని తెలిపారు. ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, పెంపుడు కుక్కలను పెంచడం వంటి వాటి వాళ్ల కొంత వరకు దొంగతనాలను నివారించవచ్చని తెలిపారు.

పగటి వేళాల్లో ఎక్కువగా ఇంటికి వచ్చి బంగారాన్ని మెరుగుపెడతాని చెప్పే వారిని నమ్మవద్దని, మహిళలు బయటకు వెళ్తే మెడచుట్టు కొంగు కప్పుకుని వెళ్ళాలని సూచించారు. ప్రజలు తమ సొంత గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలని, ఎక్కువ రోజులు ఇంట్లో లేకుండా వెళ్ళవలసి వస్తే ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలన్నారు. విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదని, అలాగే తాళం చెవి ఇంటి పరిసర ప్రాంతాల్లో పెట్టకూడదని, అనుమానాస్పద వ్యక్తులను ఇంట్లోకి రానివ్వకూడదని, చిల్లర వ్యాపారులు ఏదైనా అమ్మడానికి వస్తే వారిని ఇంట్లోకి రానివ్వవద్దని, పగటి వేళాల్లో కాలనీల్లో చిరు వ్యాపారుల్లా, సేల్స్ రిప్రజెంటేటీవ్‌ల్లా, అడ్రస్ కోసం వెతుకుతున్న వారిలా పర్యటిస్తూ రెక్కీ నిర్వహిస్తారని, అనుమానాస్పద వ్యక్తులుంటే స్థానిక బీట్ కానిస్టేబుల్‌కి ఫిర్యాదు చేయాలని అన్నారు. ప్రజలు నిరంతరం పోలీసులతో సమన్వయంగా సహకరిస్తే చోరీలను నియంత్రించడం చాలా సులభమవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఎప్పుడు కూడా స్థానిక పోలీస్‌స్టేషన్ నంబర్ దగ్గర ఉంచుకోవడం మంచిదన్నారు. కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలను ఏర్పాటు చేసుకుని ఈ కమిటీ సభ్యులు ఎప్పకటిప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంటూ అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్ లేదా దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

115
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...