పరిషత్ పోరుకు సై


Sun,April 14, 2019 01:12 AM

మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఇక పరిషత్తు ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. దీంతో గ్రామాల్లో పరిషత్ ఎన్నికల సందడి నెలకొన్నది. ఈనెల 22 నుంచి మే 14 లోపు జిల్లాలో మూడు విడుతలుగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. కాగా ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లను ఖరారు చేసింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో మిగిలినది నోటిఫికేషన్ విడుదల చేయడమే. దీంతో గ్రామాల్లో రాజకీయ వేడి రాజుకుంటున్నది. ఎలాగైనా సీట్లు దక్కించుకునేందుకు నేతల ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన టీఆర్‌ఎస్ తరఫున నిలిస్తే గెలుపు ఖాయమనే ధీమాతో ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. గెలుపు గుర్రాల కోసం ఆయా పార్టీల నేతలు అన్వేషణ మొదలు పెట్టారు.

జిల్లా పరిషత్, మండల పరిషత్ పోరుకు సర్వం సిద్ధమవుతున్నది. కొత్త జిల్లాలు, మండలాల ప్రాతిపదికన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల పునర్విభజన పూర్తవ్వగా కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. జిల్లా పరిషత్ రిజర్వేషన్లను రాష్ట్రస్థాయి యూనిట్‌గా ఖరారు చేశారు. కలెక్టర్ ధర్మారెడ్డి సారథ్యంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు పూర్తి చేశారు. ఎంపీటీసీ స్థానాలకు ఆయా రెవెన్యూ డివిజన్ అధికారుల ఆధ్వర్యంలో మండల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను వర్తింపజేశారు. ఇందులో మొత్తం 50 శాతం మహిళలకు కేటాయించారు. మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ బీసీ మహిళకు కేటాయించారు. జిల్లాలో మొత్తం 20 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా ఇందులో ఎస్సీ 3 (మహిళ2-జనరల్1), ఎస్టీ 2(మహిళ1-జనరల్1), బీసీ5 (మహిళ2-జనరల్3), జనరల్10 (మహిళ5-జనరల్5) స్థానాల్లో రిజర్వేషన్ కల్పించారు. జిల్లాలో మొత్తం 189 ఎంపీటీసీ స్థానాల్లో ఎస్సీ 33 (మహిళ 17-జనరల్16), ఎస్టీ 23 (మహిళ17-జనరల్6), బీసీ 43 (మహిళ20-జనరల్23), జనరల్ కేటగిరీలో 90 స్థానాలు (మహిళ40-జనరల్50) కేటాయించారు. మహిళలకు 50 శాతం స్థానాల్లో రిజర్వేషన్ కల్పించారు.

ప్రధాన ఘట్టం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ఆశావహులు పోటీకి సన్నద్ధమవుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ నెలలో వెలువడే అవకాశాలు ఉన్నాయి. దీంతో గ్రామాల్లో పదవుల కోసం ముందుకువచ్చే వారి సంఖ్య పెరుగుతున్నది. ఎలాగైనా టికెట్ సాధించాలని నేతలు ఇప్పటి నుంచే తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అసెంబ్లీ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. బరిలో ఎవరు నిలిచినా గెలుపు మాత్రం టీఆర్‌ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన వారిదేననే విధంగా పరిస్థితులు మారాయి. దీంతో ఎలాగైనా టికెట్ సాధించాలని ఆశావహులు ఎమ్మెల్యే, నియోజకవర్గ, జిల్లా పార్టీ నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

సర్పంచ్ ఎన్నికల్లో మెదక్ జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తు లేకపోయిన టీఆర్‌ఎస్ పార్టీ మద్దతు పొందిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు విజయం సాధించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, వృద్ధులు, వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పింఛన్లు.. ఇలా అనేక సంక్షేమ పథకాలతో టీఆర్‌ఎస్ ప్రజలకు చేరువైంది. ఫలితంగా ఎన్నికలు ఏవైనా వెన్నంటి ఉంటాం అనే విధంగా ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి పట్టం కడుతున్నారు. పార్టీ గుర్తు లేకపోయినా సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించగా, పరిషత్ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండటంతో టీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఆశావహులు ఆసక్తి చూపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు 20వేల నుంచి 50వేల మెజార్టీతో గెలుపొందారు. దాదాపుగా అన్ని గ్రామాల్లో టీఆర్‌ఎస్ పార్టీకి మెజార్టీ ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ గుర్తుపై పోటీ చేస్తే విజయం తథ్యం అనే విషయం స్పష్టమవుతున్నది. అందుకే టీఆర్‌ఎస్ నుంచి టికెట్‌ను పొందడమనేది ప్రస్తుతం గెలుపుగానే భావిస్తున్నారు. గత సర్పంచ్ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం రాలేదు.. ఇప్పుడైనా ఎంపీటీసీ టికెట్ వచ్చేలా చూడాలంటూ కోరుతున్నారు. మరికొందరు పార్టీ కోసం ఎంతో కష్టపడున్నామని, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో గెలుపు కోసం కీలకపాత్ర పోషించామని, తమకు ఎంపీటీసీగా పోటీచేసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. నోటిఫికేషన్ రాకముందే తమకు టికెట్ పక్కాగా చేసుకోవాలని ఆశావహుల్లో నెలకొంది.

బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు
పరిషత్ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించనున్నారు. ఈ మేరకు అవసరమైన బ్యాలెట్ బాక్సులను అధికారులు సిద్ధం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో నిర్వహించిన బ్యాలెట్ బాక్సులను ఈ ఎన్నికల్లో వినియోగించనున్నారు. ఎంపీటీసీ గులాబీ రంగు, జెడ్పీటీసీ తెలుపు రంగులో బ్యాలెట్ పేపర్లు ఉంటాయని డీపీవో హనోక్ తెలిపారు.

మూడు విడుతల్లో పరిషత్ ఎన్నికలు
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను మూడు విడుతల్లో జరుపడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఇందుకోసం అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకోవడంతోపాటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లతో తాము సన్నద్ధంగా ఉన్నట్లు చెబుతున్నది. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల కోడ్‌తో అభివృద్ధి పనులకు అడ్డంకులు వస్తున్న క్రమంలో రాష్ట్రంలోని అన్ని ఎన్నికలను మే 23 వరకు లోక్‌సభ ఎన్నికల కోడ్ లోపు పూర్తి చేయాలని తెలంగాణ సర్కార్ ఎన్నికల కమిషనర్‌కు విన్నవించింది. దీనికి స్పందించిన ఎన్నికల సంఘం నిర్ణీత సమయంలో ఎన్నికలను పూర్తిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నది. ఇందుకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నది. ఈ నెలలోనే 23 నుంచి 25వ తేదీలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో చర్చలు జరుపుతున్నది. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ అభ్యర్థులు, రాజ్యసభ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ ప్రధానకార్యదర్శులతో శనివారం రాష్ట్ర టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమై దిశానిర్దేశం చేశారు.

ఈ నెల 22 నుంచి వచ్చేనెల 14 వరకు..
ఏంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 22 నుంచి వచ్చే నెల 14వ తేది వరకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడుత ఎన్నికలు జరిగే మండలాల్లో వచ్చే నెల 6వ తేదీన పోలింగ్ జరుగనున్నది. రెండో దశ ఎన్నికలు జరిగే మండలాల్లో 10వ తేదీ మూడో దశలో ఎన్నికలు జరిగే మండలాల్లో 14వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి.

1032 పోలింగ్ కేంద్రాలు
ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం 1032 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీపీవో హనోక్ తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ ధర్మారెడ్డికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలిపారు. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తునట్లు ఆయన పేర్కొన్నారు.

130
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...