ఈవీఎంలలో భవితవ్యం


Sat,April 13, 2019 02:50 AM


వచ్చే నెల 23 వరకు అభ్యర్థుల్లో తప్పని టెన్షన్
-స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు భద్రం
-పట్టిష్ట బందోబస్తు
-జహీరాబాద్ ఈవీఎంలు గీతం యూనివర్సిటీలో
-మెదక్ పార్లమెంట్ ఈవీఎంలు బీవీఆర్‌ఐటీలో
-అధికార పార్టీలో మెజార్టీపైనే చర్చ
సంగారెడ్డి, నమస్తేతెలంగాణ ప్రధానప్రతినిధి :
పార్లమెంట్ ఎన్నికల ప్రశాంతంగా ముగిసినప్పటికీ అభ్యర్ధులకు మాత్రం టెన్షన్ తప్పలేదు. ఫలితాలు వెల్లడి కావడానికి నెల రోజులకు పైగా సమయం ఉండటంతో ఈవీఎంలలో ఉన్న భవితవ్యంపై ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. అధికార పార్టీలో మాత్రం మెజార్టీపైనే చర్చ జరుగుతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. రెండు నియోజకవర్గాలలో ప్రశాంతంగా ఎన్నికలు పూర్తవగా గురువారం రాత్రి ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలించారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోకవర్గ ఈవీఎంలను పటాన్‌చెరు మండలంలోని గీతం యూనివర్సిటీకి, మెదక్ పార్లమెంట్ ఈవీఎంలను నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలకు తరలించారు. అక్కడ సీసీ కెమెరాలు, ప్రత్యేక పోలీసు బలగాల భద్రత మధ్య ఈవీఎంలను భద్రపరిచారు. వచ్చే నెల 23న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో అప్పటి వరకు రాజకీయ పార్టీలకు టెన్షన్ తప్పని పరిస్థితి నెలకొన్నది. కాగా ఈ ఎన్నికల్లో అధికార పార్టీ విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకు వివరించడంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక కాంగ్రెస్, బీజేపీల ప్రచారం నామ మాత్రంగానే కొనసాగింది. ఈ లెక్కన రెండు నియోజకవర్గాల్లో వార్‌వన్ సైడ్‌గానే ఉండనున్నదని, మెజార్టీపైనే అంచనాలు వేసుకుంటున్నామని టీఆర్‌ఎస్ నాయకులు ధీమాతో చెబుతున్నారు.

మెజార్టీపై ప్రభావం చూపనున్న పోలింగ్ శాతం..
జహీరాబాద్, మెదక్ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే పోలింగ్ శాతం తగ్గింది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మెదక్‌లో పోలింగ్ శాతం బాగానే నమోదైంది. ఇక్కడ 71.71 శాతం పోలింగ్ నమోదు కాగా జహీరాబాద్‌లో 69.67 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఐదులక్షల మెజార్టీయే లక్ష్యంగా మెదక్‌లో టీఆర్‌ఎస్ ప్రచారం కొనసాగింది. ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, మెదక్, సంగారెడ్డి, పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని అందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్‌లో కూడా జోరుగా అధికార పార్టీ ప్రచారం కొనసాగింది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీల నుంచి పోటీ ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ మంచి మెజార్టీతో విజయం సాధిస్తారని టీఆర్‌ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేసున్నారు. అయితే రెండు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గడంతో మెజార్టీపై ప్రభావం చూపనున్నదంటున్నారు.

స్ట్రాంగ్ రూంల్లో ఈవీఎంలు భద్రం..
రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను సీసీ కెమెరాలు, పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎం మిషన్లను నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీ కళాశాలలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను పటాన్‌చెరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచారు. గీతంలో కలెక్టర్ హనుమంతరావు, బీవీఆర్‌ఐటీలో కలెక్టర్ ధర్మారెడ్డిలు స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. మే 23 వరకు ప్రత్యేక పోలీసు బలగాలు ఇక్కడ బందోబస్తు నిర్వహించనున్నాయి. రోజువారీగా ఆయా జిల్లాల ఎస్పీలు భద్రను పర్యవేక్షించనున్నారు.

ఎవరి లెక్కలు వారివి..
ప్రశాంతంగా పోలింగ్ పూర్తవగా పార్టీల నాయకులు ఇప్పుడు ఓట్లపై లెక్కలు వేసుకుంటున్నారు. ఎవరికి వారు పలానా ఓట్లు తమకే పడ్డాయని లెక్కలు కడుతున్నారు. నామ మాత్రంగానే ప్రచారం చేసినా తమ పార్టీకి ఓట్లు బాగానే పడ్డాయంటూ బీజేపీ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్‌కు ఈ సారి ప్రజలు ఓట్లు వేశారని ఆ పార్టీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. అధికార టీఆర్‌ఎస్ మాత్రం మెజార్టీపైనే లెక్కలు వేసుకుంటున్నది. రెండు పార్లమెంట్ నియోకవర్గాల్లో మంచి మెజార్టీతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించనున్నారని ధీమాతో ఉన్నారు. మే 23 ఎప్పుడు రానున్నది..? ఫలితాలు ఎప్పుడు వెలువడనున్నాయనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొన్నది.

176
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...