ఉపాధిహామీ కూలీలకు వేసవిలో అదనపు భృతి


Sat,April 13, 2019 02:47 AM

కొల్చారం: ఉపాధిహామీ పనుల్లో పాల్గొనే కూలీలకు వేసవి అదనపు భృతి లభించనుంది. వేసవి ఎండల్లో పనిచేసే వారికి ఫిబ్రవరి నుంచి జూన్ వరకు అదనంగా భృతిని చెల్లించడానికి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. దీంతో కొల్చారం మండలంలో అయిదు వేల మంది కూలీలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ సంవత్సరం మండలంలో వ్యవసాయ పనులు లేక పలువురు జంటనగరాలకు వెళ్లి రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు. ఊర్లోనే పనులు కావాలనే వారికి ఉపాధిహామీ పనులు వరంగా మారాయనే చెప్పవచ్చు. ఉపాధిహామీలో పనిచేసే కూలీలకు వేసవి అదనపు భృతి చెల్లించాలని ఆదేశాలు రావడంతో కూలీలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు.
వలసల నివారణకే...
వేసవి సీజన్‌లో గ్రామాల్లో వ్యవసాయ పనులు ఉండకపోవడంతో కూలీలు ఇబ్బంది పడకుండా ఈ పథకాన్ని నిర్వహిస్తున్నారు. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో వారు పనులకు గైర్హాజరు కాకుండా ఉండేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక భృతిని ప్రకటించింది. ఉపాధిహామీ పనిచేసిన కూలీకి అదనంగా ఈ భృతిని కలిపి అందిస్తారు. వేసవిలో కూలీలు ఉపాధి పనులపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంటారు. ఈ భృతి వారీ కుటుంబాలకు ఎంతో ఆసరా చేకూరుతుంది.

ఐదు నెలల పాటు భృతి అందజేత...
ఉపాధిహామీ పనుల్లో పాల్గొనే కూలీలకు ఐదు నెలలపాటు అదనపు భృతిని అందించనున్నారు. మండలంలో 21 గ్రామపంచాయతీల్లో ఉపాధిహామీ పనులు జోరుగా నడుస్తుండడంతో, ప్రస్తుతం పనికి వస్తున్న అయిదు వేల మంది కూలీలకు ఈ భృతి వర్తిస్తుంది. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు పెంచిన భృతిని కూలీ డబ్బులకు కలిపి అందజేస్తారు. వేసవి ఎండ తీవ్రతను బట్టి 20 నుంచి 30శాతం వరకు అదనపు భృతి అందజేస్తారు. ఏప్రిల్, మే నెలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ రెండు నెలల్లో గరిష్ఠంగా 30శాతం భృతిని అందజేస్తారు. ఒక్కకూలీ మార్చిలో రోజుకు రూ.100 సంపాదిస్తే దానికి అదనంగా ఇరవై శాతం భృతిని కలిపి రూ.120 చెల్లిస్తారు. ఇలా నెలలో నిర్ణయించిన విధంగా భృతిని కలిపి కూలీ డబ్బులు అందజేస్తారు. ఇప్పటికే పనిచేసే చోట నీడ వసతి కల్పించడం, తాగునీటి కోసం రూ.5 అదనంగా చెల్లించడం, గాయాలైతే ప్రథమ చికిత్స అందించడం, పెద్ద దెబ్బలు తాకితే దవాఖాన బిల్లులు చెల్లించడంతో కూలీలు ఆకర్షితులు అవుతున్నారు.

169
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...