పోలింగ్ 71.56% జిల్లాలో ఓటెత్తిన జనం


Fri,April 12, 2019 12:30 AM

- ప్రశాంతంగా మెదక్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్
- ఉత్సాహంగా ఓటేసిన ప్రముఖులు, జనం
- ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ
- సమస్యాత్మక గ్రామాల్లో వెబ్ కాస్టింగ్, వీడియో గ్రఫీ
- నర్సాపూర్ నియోజకవర్గంలో పలుచోట్ల కాంగ్రెస్, బీజేపీలకు ఏజెంట్లు కరువు
- పలు పోలింగ్ బూత్‌లను సందర్శించిన ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, రామలింగారెడ్డి, క్రాంతికిరణ్‌లు

మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో 71.56 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే జనం ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం రెండు గంటలకే దాదాపుగా 50 శాతం పోలింగ్ నమోదైంది. మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో నర్సాపూర్‌లో అత్యధికంగా 77.29 శాతం పోలింగ్ నమోదైంది. నర్సాపూర్ నియోజకవర్గంలో పలుచోట్ల కాంగ్రెస్, బీజేపీలకు ఏజెంట్లు కరువయ్యారు. కలెక్టర్ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఓటర్లకు తాగునీటి వసతితోపాటు దివ్యాంగులకు వీల్‌చైర్స్‌ను అందుబాటులో ఉంచారు. సమస్యాత్మక గ్రామాల్లో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ, పోలీసుల భారీ భద్రతతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. స్పెషల్ స్కాడ్‌లు, అబ్జర్వర్లు, జోనల్ అధికారులు, రూట్ అధికారులు ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించారు. ఓటింగ్ సరళిని తెలుసుకునేందుకు మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, రామలింగారెడ్డి, క్రాంతికిరణ్‌లు పలు పోలింగ్ బూత్‌లను సందర్శించారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో 67.80 శాతం పోలింగ్ నమోదైంది.

మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎన్నికల అధికారి, కలెక్టర్ ధర్మారెడ్డి అన్ని చర్యలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి వసతితో పాటు వికలాంగులకు వీల్‌చైర్స్ అందుబాటులో ఉంచారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ఉదయం 2 గంటల వరకే 40 నుంచి 50 శాతం పోలింగ్ నమోదైంది. మెదక్ నియోజకవర్గంలోని రామాయంపేట మండలం కోనాపూర్, అక్కన్నపేట, తొనిగండ్ల, లకా్ష్మపూర్, కాట్రియాల, ఝాన్సిలింగాపూర్, నిజాంపేట మండలం రాయిలాపూర్, నందిగామ, బచ్చురాజ్‌పల్లి, నిజాంపేట, చల్మెడ, నార్లాపూర్, నస్కల్, రాంపూర్, కల్వకుంట, కె.వెంకటాపూర్ తదితర గ్రామాల్లో ఉదయం 10.30 గంటలకే 40 నుంచి 50 శాతం పోలింగ్ నమోదైంది. చిన్నశంకరంపేట, పాపన్నపేట, హవేళిఘనపూర్, మెదక్ మండలాల్లో సైతం ఉదయం 10.30 గంటలకే 40 నుంచి 50 శాతం వరకు అన్ని పోలింగ్ బూత్‌లో పోలింగ్ నమోదైంది. నర్సాపూర్ నియోజకవర్గంలోని చిలిపిచెడ్ మండలంలో భద్రయ్యతండా, గౌతాపూర్, శీలంపల్లి, తదితర గ్రామాల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఏజెంట్లు కరువయ్యారు. ఈ నియోజకవర్గంలోని కౌడిపల్లి, కొల్చారం, శివంపేట, వెల్దుర్తి, నర్సాపూర్ పట్టణంతో పాటు, నర్సాపూర్ రూరల్ మండలాల్లోని ఎక్కువ గ్రామాల్లో సైతం ఉదయం 10.30 గంటల వరకే 45 నుంచి 50 శాతం వరకు పోలింగ్ జరిగింది.

సమస్యాత్మక గ్రామాల్లో భద్రతా ఏర్పాట్లు..
సమస్యాత్మక గ్రామాల్లో ముందస్తు ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం సఫలమైంది. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సమస్యాత్మక గ్రామాల్లో వెబ్‌కాస్టింగ్, వీడియో గ్రఫీ, పోలీసుల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కల్పించారు. స్పెషల్ స్కాడ్‌లు, అబ్జర్వర్లు, జోనల్ అధికారులు, రూట్ అధికారులు ఎప్పటికప్పుడూ పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించారు. కలెక్టర్ కలెక్టరేట్‌లో ఉండి వెబ్ కాస్టింగ్‌తో ఫుటేజీలను పరిశీలించి ఎప్పటికప్పుడూ మానిటరింగ్ చేశారు. జిల్లా సరిహద్దు గ్రామాల్లో గోవా, కర్ణాటక రాష్ర్టాల పోలీసులతో పాటు మన రాష్ర్టానికి సంబంధించిన పోలీసు బలగాలతో పహారా కాశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్‌ఐ స్థాయి అధికారులను ఎస్పీ చందన దీప్తి నియమించారు.

పోలింగ్ కేంద్రాలు సందర్శించి ఓటింగ్ సరళి తెలుసుకున్న అభ్యర్థులు...
జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి చిన్నశంకరంపేట, రామాయంపేట, మెదక్ పట్టణాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని తెలుసుకున్నారు. నర్సాపూర్‌లోని కౌడిపల్లి, కొల్చారం, వెల్దుర్తి తదితర మండలాల్లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పోలింగ్ బూత్‌లను సందర్శించి ఓటింగ్ సరళని తెలుసుకున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి తూప్రాన్‌లోని బాలుర పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటింగ్ సరళిని తెలుసుకున్నారు. రామాయంపేటలో ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.

మొరాయించిన ఈవీఎంలు.. అరగంట పాటు అంతరాయం...
తూప్రాన్ మండలం నాగులపల్లిలో ఈవీఎంలు మొరాయించగా అరగంట పాటు పోలింగ్‌కు అంతరాయమైంది. ఈవీఎంలను వెంటనే అధికారులు మరమ్మతు చేయడంతో యథావిధిగా మళ్లీ పోలింగ్ ప్రారంభమైంది. రామాయంపేట మండలం కోనాపూర్‌లో వీవీప్యాట్స్ మొరాయించింది. వెంటనే మార్చి కొత్తది భిగించారు. అదేవిధంగా అల్లాపూర్, తూప్రాన్ పట్టణంలోని 16వ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరాయించడంతో వెంటనే అధికారులు 20 నిమిషాల్లోనే మరమ్మతు చేయించి పోలింగ్‌ను ప్రారంభించారు.

ఓటేసిన ప్రముఖులు...
మెదక్ జిల్లాకు చెందిన ప్రముఖులు మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హవేళిఘనపూర్ మండలం కూచన్‌పల్లిలో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి దంపతులు, వారి కుమార్తె సుప్రిత సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెదక్ నియోజకవర్గం రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులు దేవేందర్‌రెడ్డి, కుమారుడు పునీత్‌రెడ్డి, కోడలు దీపికరెడ్డిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌడిపల్లిలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జడ్పీ చైర్‌పర్సన్ రాజమణిమురళీయాదవ్ దంపతులు నర్సాపూర్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మనోహరాబాద్ మండలం రామాయపల్లిలో ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్ ధర్మారెడ్డి మెదక్ మండలం మాచవరంలో గ్రామంలో ఓటు వేయగా, ఎస్పీ చందనదీప్తి కూడా మాచవరం గ్రామంలోని ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ మంత్రి సునీతా లకా్ష్మరెడ్డి శివంపేట మండలం గోమారంలో ఓటు వేయగా పాపన్నపేట మండలం కొత్తపల్లిలో కరుణం ఉమాదేవి, యూసుఫ్‌పేటలో మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డిలు తమ ఓటు హక్కును వినియోగించు
కున్నారు.

157
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...