పోలింగ్ ప్రశాంతం


Fri,April 12, 2019 12:29 AM

సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధానప్రతినిధి/ సంగారెడ్డి చౌరస్తా : జిల్లాలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ స్థానాలకు జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో జిల్లా యంత్రాంగం ఊపిరిపీల్చుకున్నది. మొదట్లో కాస్తా మందకోడిగా కొనసాగిన పోలింగ్ ఆ తరువాత వేగం పుంజుకున్నది. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగింది. సాయంత్రం పోలింగ్ ముగిసేవరకు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి దాదాపు 67.80శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 1,943 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఎక్కడ కూడా చిన్నపాటి సంఘటన కూడా చోటు చేసుకోలేదు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మొదట్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించినా, పోలింగ్ అధికారుల సత్వర స్పందనతో తిరిగి మాములుగా పోలింగ్ కొనసాగింది. కేవలం సాంకేతిక కారణాల వల్ల కొన్ని ఈవీఎంలు మొరాయించాయని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. మొత్తం మీద ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సాధారణ ఎన్నికల మాదిరిగా ఈసారి కూడా ముందస్తు అవగాహన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా ఓటర్లకు స్వీప్ బ్యాగులను పంపిణీ చేసి ఓటు హక్కుపై కలెక్టర్ స్వయంగా అవగాహన కల్పించారు. దీంతో ఓటర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఓటర్లు ఎండను సైతం లెక్క చేయకుండా అనుకున్న విధంగా పోలింగ్‌లో భాగస్వాములయ్యారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటలకు వరకు పోలింగ్ కొనసాగింది. ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఆయా ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ పూర్తయిన తరువాత జహీరాబాద్ పార్లమెంట్ పరిధికి సంబంధించిన ఈవీఎంలను రుద్రారంలోని గీతం యూనివర్సిటీకి, మెదక్ పార్లమెంట్‌కు సంబంధించిన ఈవీఎంలను బీవీఆర్‌ఐటీకి తరలించారు. వచ్చే నెల 23న ఓట్లను లెక్కించనున్నారు. అప్పటివరకు అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలోనే నిక్షప్తమై ఉంటుంది. ఇదిలా ఉండగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పోలింగ్ శాతం దాదాపు 67.80శాతం నమోదైంది. అయితే ఖచ్చితమైన వివరాలు పోలింగ్ సిబ్బంది వచ్చి తమ నివేదికలు అందించిన వెంటనే శుక్రవారం తుది నివేదిక వెలువడనున్నదని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.

ఊపిరి పీల్చుకున్న అధికారులు..
జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ పూర్తి కావడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నది. ఎన్నికల అధికారి హనుమంతరావు ఆదేశాల మేరకు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి గట్టి బందోబస్తును చేపట్టారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, ప్రాంతాలను గుర్తించి అక్కడ అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు. వెబ్‌కాస్టింగ్‌తో పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడూ పరిశీలించారు. వీడియో చిత్రీకరణ బృందాలు, తనిఖీ బృందాలతో నిఘాను ఏర్పాటు చేశారు. పోలింగ్‌కు ముందు రోజే గ్రామాలకు వెళ్లిన పోలీసు సిబ్బంది ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సహకరించాలని పార్టీల నాయకులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇబ్బందులు కలిగించి ఇబ్బందులు పడొద్దని హెచ్చరించారు.

ఓటేసిన ప్రముఖులు..
జిల్లాలోని ప్రముఖులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక ప్రాంతాల్లో కుటుంబ సమేతంగా వెళ్లి ఓటు వేశారు. ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి రామచంద్రపురంలో ఓటు వేయగా, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి పటాన్‌చెరులో ఓటు వేశారు. అదేవిధంగా వట్‌పల్లి మండలం పోతులబోగూడలో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఓటు వేశారు. జోగిపేటలో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఓటు వేయగా, మాజీ మంత్రి గీతారెడ్డి హైదరాబాద్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కల్హేర్ మండ లం ఖానాపూర్‌లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కుటుంబ సమేతంగా వెళ్లి ఓటు వేశారు. ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, మాజీ ఎమ్మెల్యే చెంగల్ బాగన్నలు జహీరాబాద్‌లో ఓటు వేయగా, జహీరాబాద్ ఎమ్మెల్యే కొణింటి మాణిక్‌రావు తన సొంతూరు ఝరాసంఘంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సదాశివపేటలో ఓటు వేయగా, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణలు సంగారెడ్డిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్ ఎం.హనుమంతరావు, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిలు సంగారెడ్డిలో ఓటు వేశారు.

పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు..
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సారథ్యంలో పోలీసు యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టింది. జిల్లాలో 233 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. 129 ప్రాంతాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఆయా ప్రాంతాలు, కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టారు.

ఈ ఎన్నికల్లో మొత్తం 1,626 మంది పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. ఎస్పీతో పాటు ఏఎస్పీ, ఐదుగురు డీఎస్పీలు, సీఐ, ఆర్‌ఐలు 27 మంది, 75 మంది ఎస్‌ఐలు, ఏఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుళ్లు 105 మంది, కానిస్టేబుళ్లు 414మంది, మహిళా కానిస్టేబుళ్లు 27, ఏఆర్ ఆర్‌ఎస్‌ఐ ఒక్కరు, ఏఆర్‌ఎస్, హెడ్‌కాన్సిబుళ్లు 35మంది, ఏఆర్ కానిస్టేబుళ్లు 80మంది, హోంగాడ్స్ 120, 327 మంది ఇతర సిబ్బంది, సీఏపీఎఫ్, ఎస్‌ఈసీఎస్ 409 మంది నేటి పోలింగ్‌లో విధులు నిర్వహించగా, మండలాలు, నియోజకవర్గాల వారీగా మొబైల్ బృందాలు ఎప్పటికప్పుడూ ఎన్నికల నిర్వహణ తీరును పరిశీలించాయి. ఎక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేశారు.

ఆకట్టుకున్న ప్రత్యేక కేంద్రాలు..
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో నియోజక వర్గానికి ఒక్కటి చొప్పున ఏర్పాటు చేసిన(సఖీ) మహిళా పోలింగ్ కేంద్రాలు, ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఓటర్లను ఆకర్షించాయి. ఈ ప్రత్యేక సఖీ కేంద్రాల్లో పోలీసు అధికారి మొదలుకుని ఈ కేంద్రాల్లో మొత్తం మహిళలే విధులు నిర్వహించారు. మహిళలు ప్రశాంతంగా ఆయా సఖీ కేంద్రాల్లో ఓటు వేశారు. వారికి అవసరమైన మౌలి క సదుపాయాలు కూడా కేంద్రాల్లో కల్పించారు. అదే విధంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 7ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఖేడ్ నియోజకవర్గంలో భూజరాన్‌పల్లిలో ఆదర్శ, నారాయణఖేడ్‌లో సఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందోల్, డాకూరులో ఆదర్శ, జోగిపేటలో సఖి, జహీరాబాద్‌లో బిడెకన్నెలో ఆదర్శ, జహీరాబాద్ పట్టణంలో సఖీ, జుక్కల్‌లో మద్నూర్‌లో ఆదర్శ, బిచ్‌కుందలో సఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బాన్సువాడలో ఆదర్శ, బిచ్‌కుందలో సఖీ, ఎల్లారెడ్డి పట్టణంలో సఖీ, కామారెడ్డి నియోజకవర్గంలోని లింగాపూర్‌లో ఆద ర్శ, కామారెడ్డి పట్టణంలో సఖీ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఆయా కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారు.

ప్రజల సహకారంతో పోలింగ్ ప్రశాంతం..
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ ప్రజలు, రాజకీయ పార్టీల సహకారంతోనే జిల్లాలో పోలిం గ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని తెలిపారు.
ఏ ఒక్క చిన్న పొరపాటు కూడా లేకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ స్పష్టం చేశారు. పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారని, పోలింగ్ అధికారులు, సిబ్బంది బాగా పనిచేశారని కితాభిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా ఓటర్లు ఎంతో ఉత్సాహం గా ఓట్లు వేశారో, అంతే ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓటు వేశారన్నారు. గ్రామాల్లోని చైతన్యవంతులైన విద్యావంతులు అంద రూ ఓటు వేసేలా కృషి చేశారన్నారు. ఎన్నికల నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశామని, ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని గుర్తు చేశారు. వికలాంగుల కోసం ప్రత్యేకంగా ర్యాంపులు ఏర్పాటు చేయడంతో వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. జిల్లాలో ప్రశాంత ఎన్నికల కోసం సహకరించిన ప్రతి ఒక్కరికీ కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...