ఓటెత్తారు


Fri,April 12, 2019 12:28 AM

నర్సాపూర్, నమస్తే తెలంగాణ : నర్సాపూర్ పట్టణంతో పాటు మండలంలో గురువారం జరిగిన మెదక్ పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా జాయింట్ కలెక్టర్ నగేశ్, నర్సాపూర్ రిటర్నింగ్ అధికారి అరుణారెడ్డిల ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గ పరిధిలో మొత్తం 300 పోలింగ్ బూత్‌ల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నర్సాపూర్ పట్టణంలో జడ్పీ చైర్ పర్సన్ రాజమణి, టీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్, మాజీ సర్పంచ్ వెంకటరమణారావులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్ మండలంలోని పెద్దచింతకుంటలో ఓటునువేశారు. అలాగే శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో మాజీ మంత్రి సునీతారెడ్డితో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్‌లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

నియోజకవర్గంలో శాతం పోలింగ్
నర్సాపూర్ నియోజకవర్గంలోని నర్సాపూర్, శివ్వంపేట, కౌడిపల్లి, కొల్చారం, చిలిపిచెడ్, వెల్దుర్తి, హత్నూర మండలాలలో ఉదయం 7గంటల వరకు ఓటింగ్ ప్రారంభమై 9గంటల వరకు 18.47 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. తర్వాత పుంజుకొని 11గంటల వరకు 39.66 శాతం నమోదైంది. మధ్యాహ్నం 1గంట వరకు 62.14 శాతం మూడు గంటల వరకు 70.12 శాతం నమోదైంది. సాయంత్రం 5గంటల వరకు మొత్తం 77.34 నమోదైనట్లు అధికారులు తెలిపారు.

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ రాజమణి, మాజీ మంత్రి సునీతారెడ్డి, టీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్‌లు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. అలాగే శివ్వంపేట మండలంలో జాయింట్ కలెక్టర్ నగేశ్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.

మహిళల కోసం ప్రత్యేకంగా..
కాగా నర్సాపూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మహిళల కోసం ప్రత్యేకంగా 279 నంబర్‌గల పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం 276 నంబర్‌గల పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు.

భారీ బందోబస్తు
ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు భారీ బందోబస్తు చేపట్టారు. మెదక్ అడిషనల్ ఎస్పీ నాగరాజుతో పాటు ఇద్దరు డీఎస్‌పీలు ముగ్గురు సీఐలు 12 మంది ఎస్‌ఐలు, 500 మంది పోలీసు సిబ్బంది భారీ బందోబస్తు చేపట్టారు.

కౌడిపల్లి: పార్లమెంట్ ఎన్నికలు కౌడిపల్లి మండలంలో గురువారం ప్రశాంతంగా జరిగాయి. మండల పరిధిలోని ముట్రాజ్‌పల్లి గ్రామంలో మాత్రం సాంకేతిక కారణాల వల్ల గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. అలాగే మండలంలోని రాజిపేట్ పోలింగ్ కేంద్రానికి మాత్రం ఉదయం 7గంటల నుంచే ఓటర్లు భారీగా తరలివచ్చి బారులు తీరారు.

ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే దంపతులు
నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, వారి సతీమణి సుజాతమ్మతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 16ఎంపీ సీట్లు గెలిస్తే దేశ ప్రధానమంత్రి కేసీఆర్ అవుతారన్నారు. అలాగే ఎంపీపీ చిలుముల పద్మానర్సింహారెడ్డి దంపతులతో పాటు ఉమ్మడి కౌడిపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చిలుముల వెంకటేశ్వరరెడ్డి దంపతులతో పాటు కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటేసిన అధికారులు
కౌడిపల్లి పోలింగ్ కేంద్రంలో తహసీల్దార్ తబితారాణి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఎస్‌ఐ శ్రీనివాస్‌తో పాటు పోలీస్ సిబ్బంది ఓటు వేశారు.

పోలింగ్ శాతం..
కౌడిపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ఉదయం 7గంటల నుంచి 9గంటల వరకు కేవలం 15శాతమే పోలింగ్ అయింది. అలాగే 9గంటల నుంచి 11గంటల వరకు 35శాతం, 11గంటల నుంచి 1గంటల వరకు 52శాతం, 1గంటల నుంచి 3గంటల వరకు 83శాతం పోలింగ్ అయింది.

కౌడిపల్లి: పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని మండలంలోని ఆయా గ్రామాల్లో గురువారం ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి పర్యటించారు. మండల కేంద్రమైన కౌడిపల్లితో పాటు మండలంలోని వెల్మకన్నె, కొట్టాల, లింగంపల్లి, కంచన్‌పల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామాల్లోని టీఆర్‌ఎస్ కార్యకర్తలతో మాట్లాడుతూ ఎన్నికపై పోలింగ్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన టీఆర్‌ఎస్ నాయకులు బొడ్ల నవీన్‌గుప్తా, నరహారి, యాదాగౌడ్, బాన్సువాడ మహిపాల్‌రెడ్డి, నర్సింగ్‌రావు, బోయిని వీరయ్య, సుధాకర్, శ్రీనురావు పాల్గొన్నారు.

నర్సాపూర్ రూరల్: మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో పార్లమెంట్ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు గుర్తింపు కార్డులు వెంట తెచ్చుకోకపోవడంతో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల అధికారులు ఓటర్లని వెనక్కి పంపించారు.

కొల్చారం: మండలంలో గురువారం జరిగిన పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండలంలోని 32 పోలింగ్ స్టేషన్‌ల్లో పోలింగ్ కొనసాగింది. మండలంలో 71.94 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం పోలింగ్ స్టేషన్‌ల వద్ద అన్ని వసతులను సమకూర్చింది. ఎండ ఉన్న ప్రాంతాల్లో నీడ వసతి కల్పించేందుకు టెంట్‌లను ఏర్పాటు చేశారు. చల్లని తాగునీటి వసతి కల్పించారు. వికలాంగులు, వృద్ధులకు ట్రైసైకిళ్లపై తీసుకువచ్చారు. గుర్తింపు కార్డు తీసుకువచ్చేవరకు ఓటు వేయనిచ్చేది లేదని పోలింగ్ సిబ్బంది ఓటర్లను ఇబ్బంది పెట్టారు. అంతలోనే పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యే మదన్‌రెడ్డి దృష్టికి స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు ఈ విషయాన్ని తీసుకుపోవడంతో జిల్లా ఎన్నికల అధికారితో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడి సమస్యను పరిష్కరించారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్సై పెంటయ్య ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు.

చిలిపిచెడ్: మండలంలోని పోలింగ్ బూత్‌లను ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మండల పరిధిలోని పోలింగ్ బూత్‌లను సందర్శించి, ఎన్నిక వివరాలను స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గడ్డం నరేందర్‌రెడ్డి, ఆయా గ్రామ సర్పంచులు పరశురాంరెడ్డి, ఇస్తారి, మనోహరనర్సింహారెడ్డి, లక్ష్మీదుర్గారెడ్డి, నాయకులు దుర్గారెడ్డి, జయరాంరెడ్డి, యాదగిరి, శ్రీనివాస్‌గౌడ్, కిష్టయ్య పాల్గొన్నారు. మండల పరిధిలో మొత్తం 79.12 శాతం నమోదైనట్లు మండల ఎన్నిక అధికారి అబ్దుల్ సత్తార్ తెలిపారు.

115
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...