ఓటేద్దాం రండి..!


Thu,April 11, 2019 12:16 AM

మెదక్ మున్సిపాలిటీ : ఓటు హక్కును ప్రతి ఒక్కరూ విధిగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. గతంలోనూ పల్లె ప్రాంతాల్లో కంటే పట్టణాల్లో ఓటరు నమోదు శాతం చాలా తక్కువగా ఉంది. అలా కాకుండా ఈసారి ఎక్కువ మొత్తంలో తమ ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. పౌరులు తమ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధాన్ని సద్వినియోగం చేసుకుంటే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది.

మెదక్ పార్లమెంట్ స్థానానికి గురువారం పోలింగ్ జరుగనున్నది. ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రభుత్వం ఓటర్లను చైతన్యం చేస్తోంది. ఈ సందర్భంగా ఓటర్లు తమ ఓటు వివరాలు ఎలా తెలుసుకోవాలి..? పోలింగ్ కేంద్రం ఎక్కడుంది.. స్లిప్పులు ఎలా తీసుకోవాలి..? పోలింగ్ కేంద్రంలో ఓటు ఎలా వేయాలనే విషయాలు తెలుసుకోండి.. అయితే మెదక్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇప్పటికే ఇంటింటికీ స్లిప్పులను పంపిణీ చేశారు. ఆ స్లిప్పులపై లోక్ సభ నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం, ఓటరు పేరు, చిరునామా తదితర వివరాలు ఉన్నాయి. అయితే ఈ స్లిప్పులను ఆన్‌లైన్‌లో కూడా పొందవచ్చు. ఈసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి సెర్చ్ యువర్ నేమ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మీ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి. నేషనల్ ఓటర్స్ సర్వీసెస్ పోర్టల్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అందులో ఓటరు పేరు, తండ్రి పేరు, వయస్సు, రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం నమోదు చేస్తే ఓటు ప్రాథమిక వివరాలు కనబడతాయి. ఆపై వ్యూ డిటైల్స్ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే పూర్తి వివరాలు కనిపిస్తాయి.
ఓటర్లకు ఎన్నికల సిబ్బంది పంపిణీ చేసిన స్లిప్పుల వెనుక పోలింగ్ కేంద్రం వివరాలు ఉన్నాయి.

అలాగే ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో కూడా ఆ వివరాలు పొందుపర్చారు. పోలింగ్ స్లిప్పులు చేరకపోతే ఓటరు కార్డుపై ఉండే ఎపిక్ నంబర్‌ను 9223166166 నంబర్‌కు మేసేజ్ చేస్తే తెలిసిపోతుంది లేదా 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. మీ ఓటరు స్లిప్పు ఓటు వేయడానికి ఎన్నికల సంఘం అనుమతించిన గుర్తింపు ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒక దానికి తీసుకొని పోలింగ్ కేంద్రానికి వెళ్లండి. ఓటరు కార్డు లేకున్నా ఎన్నికల సంఘం సూచించిన ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా దగ్గర ఉంచుకుంటే మీరు ఓటు వేయవచ్చు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, కెమెరాలు, ల్యాప్‌ట్యాప్‌లకు అనుమతి లేదు. పోలింగ్ కేంద్రాల్లో 100 మీటర్ల పరిధిలో ఫోన్లు వాడకంపై నిషేధం ఉంది. దివ్యాంగుల కోసం ప్రత్యేక ర్యాంపులు, క్యూలు, వీల్ చైయిర్స్‌తో పాటు బ్రెయిలీ లిపితో కూడిన ఈవీఎంలను, బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేశారు.

వీటితో ఓటు వేయవచ్చు...
ఓటరు స్లిప్పుతో ఒక్కదానితోనే మీరు ఓటు వేయలేరు. ఆ స్లిప్పుతో పాటు ఓటరు కార్డు ఉండాలి. ఒక వేళ ఓటరు కార్డు లేకుంటే ఎన్నికల సంఘం చూపించిన ధ్రువీకరణల్లో ఏదో ఒకటి ఉండాలి. ఓటు వేయడానికి వెళ్లిన ఓటర్లు తప్పనిసరిగా గుర్తింపు కార్డును తీసుకువెళ్లాలి. ఓటరు ఐడీ కార్డు లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డులను తీసుకెళ్లవచ్చు. రేషన్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్ పుస్తకాలు, విద్యాసంస్థలు ఫొటోలతో జారీ చేసిన కార్డులు, పింఛన్ పత్రాలు, ఉపాధి హామీ జాబ్‌కార్డులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు తీసుకువెళ్లవచ్చు.

పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చైర్లు, ర్యాంపుల ఏర్పాటు...
జిల్లాలో 749 వీల్ చైర్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక్కో వీల్ చైర్ చొప్పున అందించనున్నారు. యాప్ తెరిచి దివ్యాంగులు తమ ఎపిక్ కార్డు సంఖ్య నమోదు చేస్తే సంబంధిత బీఎల్‌వో ఫోన్‌కు పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాల్సిన సమాచారం వస్తుంది. ఓటరు ఫోన్ సంఖ్య ఈ యాప్‌కు అనుసంధానం చేసుకోవాలి. నడవడానికి వీలు లేని వారి కోసం వీల్ చైర్లపై తీసుకువెళ్లడానికి పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపులను ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, గర్భిణులు, బాలింతలు, వృద్ధులు ప్రత్యేక క్యూ లో బూత్‌లోకి వెళ్లి ఓటు వేయనున్నారు. ఇదిలావుండగా పోలింగ్ కేంద్రంలోకి మొబైల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు తీసుకొని వెళ్లడాన్ని ఎన్నికల సంఘం నిషేధించింది.

ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి..
గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే మెదక్ జిల్లా పోలింగ్ శాతం 3వ స్థానంలో ఉంది. 88. 24గా నమోదైంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఇదే స్ఫూర్తిని కొనసాగించి అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు, దానిని వినియోగించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలి. దివ్యాంగులు సైతం ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో వీల్ చైర్స్‌ను ఏర్పాటు చేశాం. ఉచిత రవాణా సౌకర్యం కల్పించాం. ఇదిలా ఉండగా కొత్త ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలి.
- కలెక్టర్ ధర్మారెడ్డి

ఓటు హక్కును వినియోగించుకోండి...
ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి. ఎవరికి వారు ఆలోచించి నచ్చిన అభ్యర్థికి నిర్భయంగా ఓటు వేయాలి. ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు. కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లు, యువతీ యువకులు తప్పని సరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. తప్పకుండా ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.
- ఎస్పీ చందనదీప్తి

తప్పకుండా ఓటు వేయాలి..
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు వేయడం మన హక్కు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు వజ్రాయుధం. సమాజానికి మేలు చేసే నాయకుడిని ఎన్నుకోవాలి.
- డాక్టర్ పి.చంద్రశేఖర్, జిల్లా కేంద్ర వైద్యశాల సూపరింటెండెంట్

ఓటర్లలో చైతన్యం రావాలి
ఓటు వేసే ప్రజల్లో చైతన్యం రావాలి. ఐదేండ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓటు వేసి మంచి నాయకుడిని ఎన్నుకునేలా చూడాలి. ఓటు వేసే ప్రతి పౌరుడు ఒక క్షణం ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉంది.
- రాజిరెడ్డి, మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు

186
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...